చైనా అవసరాలే దానిని భారత్‌కు దగ్గర చేస్తున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్‌లో ఈ నెల ప్రారంభంలో జరిగిన షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కరచాలనం చేయడానికి ముందే బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ను సందర్శించవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
సెప్టెంబర్ 12న 18వ బ్రిక్స్ సమావేశం కోసం షీ జిన్‌పింగ్ దిల్లీ చేరుకోవడం ద్వారా ఈ ఊహాగానాలు నిజమేనని నిరూపించారు.
గత ఏడేళ్లలో జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ తర్వాత 2025లో ప్రధాని మోదీ ఎస్‌సీఓ సమావేశానికి హాజరైనప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సడలి, సంబంధాలు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపించాయి.
గల్వాన్‌లోయలో ఘర్షణ తర్వాత పెరిగిన విద్వేషాల నడుమ జిన్‌పింగ్ భారత్ రావడానికి అంగీకరించేలా ఏం జరిగిందన్నదే ప్రశ్న.

ప్రపంచంలో వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు చైనా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలోనే ఈ ప్రశ్నకు సమాధానం దాగి ఉందని నిపుణులు అంటున్నారు.
భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ వాణిజ్యపరంగా అవి ప్రధాన భాగస్వాములు.
భారత, చైనా సైన్యాల మధ్య చాలాసార్లు ఉద్రిక్తతలు తలెత్తినప్పటికీ, అది ఇరు దేశాల పరస్పర వాణిజ్యాన్ని ప్రభావితం చేయలేదు. రెండు దేశాల మధ్య వాణిజ్యం 151.5 బిలియన్ డాలర్లని అయితే 2025-26లో చైనాతో భారత వాణిజ్య లోటు 112.16 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
సరిహద్దుల్లో ముఖాముఖి
భారత పారిశ్రామిక లక్ష్యాల సాధనలో చైనా సాంకేతిక పరిజ్ఞానం అవసరం అంతకంతకు పెరగుతోంది.
భారత్ 2025లో చైనా నుంచి సుమారు 57 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్, విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకుంది.
స్మార్ట్‌ఫోన్‌ల నుంచి టెలికాం నెట్‌వర్క్‌లు, ఎలక్ట్రానిక్స్ అమరికల వరకు ప్రతిదానికీ భారత్ చైనా విడిభాగాలపై ఆధారపడి ఉందని ఈ డేటా వెల్లడిస్తోంది.
భారత ఫార్మా ఇండస్ట్రీ కూడా చైనా ముడి పదార్ధాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంది.
మరోవైపు చైనా కూడా భారత్‌ను తన ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్‌గా చూస్తోంది. 2025లో భారత్‌లో 15 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 90 శాతం లేదా వాటి విడిభాగాలు చైనా నుంచి దిగుమతి అయ్యాయి.
షావోమి, వివో, ఒప్పో వంటి చైనా మొబైల్ కంపెనీలకు భారత మార్కెట్ బంగారు గని లాంటిదని ఇప్పటికే నిరూపితమైంది.
భారత్‌లో 2025లో 45 లక్షల కార్లు అమ్ముడవుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేయడంతో చైనా ఇండియా కార్లమార్కెట్‌పైనా దృష్టి సారించింది.
చైనా కంపెనీలు 2020కి ముందు భారత్‌లోని స్టార్టప్ రంగంలో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.
చైనాకు చెందిన అలీబాబా గ్రూప్, టెన్సెంట్ హోల్డింగ్స్ కూడా పేటీఎం, జొమాటో, ఓలా ఎలక్ట్రిక్, బైజూస్‌లలో భారీగా పెట్టుబడులు పెట్టాయి.
కానీ, 2020 ఘర్షణల తర్వాత భద్రతాపరమైన ఆందోళనలను కారణంగా చూపుతూ పలు చైనా కంపెనీల పెట్టుబడులను ఆమోదించడానికి భారత్ నిరాకరించింది.
అలాగే అరుదైన ఖనిజాలతోపాటు, కార్ల తయారీలో వాడే అయస్కాంతాలు, ఇతర వస్తువులను తమ కంపెనీలు భారత్‌కు అమ్మకుండా చైనా అడ్డుకుంది.
అయితే కొంతకాలంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారాయని నిపుణులు అంటున్నారు.
ట్రంప్ విధించిన సుంకాలు, అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అనిశ్చితిని గణనీయంగా పెంచాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ యుద్ధం.. పెరిగిన చైనా సమస్యలు
డోనల్డ్ ట్రంప్ 2025లో చైనాపై సుంకాలు విధించే సమయానికే చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మందగమనం, నిరుద్యోగంతో సతమతమవుతోంది.
అయినప్పటికీ ఎగుమతులను పెంచుకోవడం ద్వారా సుమారు ఐదు శాతం వృద్ధి రేటును సాధించినా, ఆర్థిక అసంతృప్తి పెరుగుతోంది.
ప్రపంచ మార్కెట్లకు చైనా ప్రధాన ముడి సరుకుల సరఫరాదారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తీవ్రంగా పడిపోయింది. దీంతో చైనాకు తన సరుకులను విక్రయించుకోవడం మరింత కష్టంగా మారింది.
వాణిజ్యపరంగా మిగులు దేశం అయినప్పటికీ చైనాలో వస్తువులకు డిమాండ్ లేదని స్థానికంగా పని చేస్తున్న అంతర్జాతీయ వార్తా సంస్థల జర్నలిస్టులు భావిస్తున్నారు.
ఈ సమస్య చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే చైనాకు భారత్ లాంటి పెద్ద మార్కెట్లు అవసరం. 140 కోట్ల జనాభాతో భారత్ ఇప్పటికే చైనాకు పెద్ద మార్కెట్‌గా ఉంది. పైగా ఇది నిరంతరం విస్తరిస్తోంది.
భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి, చైనా వస్తువుల వినియోగ అవకాశాలను కూడా పెంచుతోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.7శాతంగా ఉంది. భారత్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంచనా వేసిన 7.8శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. భారత్ మార్కెట్ చైనాకు ఎంత అవసరమో చెప్పడానికి ఈ చిన్న పోలిక చాలు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా సంక్షోభంలో ఉందా?
మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకమైన ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి చైనా ప్రభుత్వం ఇటీవల తన ఎనిమిది ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలకు సుమారు 54 బిలియన్ డాలర్ల నగదు సహాయాన్ని అందించాలని నిర్ణయించింది.
చైనా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి బీబీసీ ప్రతినిధి లారా బికర్ ఇటీవలి తన కథనంలో ప్రస్తావించారు.
"140 కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ దేశానికి భారీ దేశీయ మార్కెట్ ఉంది. కానీ సమస్య ఏమిటంటే ప్రజలు డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నారు. చైనాలో దేశీయ వినియోగం తక్కువగా ఉంది. చైనా వద్ద ఎగుమతికి తగినంత సరుకులు ఉన్నాయి, కానీ దేశీయ డిమాండ్‌ను ఉత్తేజపరచడంలో అది బలహీనంగా కనిపిస్తోంది" అని ఆ కథనంలో వివరించారు.
అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం వల్ల ఈ పరిస్థితి ఏర్పడలేదు. చైనా అంతర్గత ఆర్థిక ఆంశాలే ఈ పరిస్థితులకు దారి తీశాయి.
ఉదాహరణకు చైనా గృహ నిర్మాణ రంగం కుప్పకూలింది. ఒకప్పుడు చౌక రుణాలతో బలోపేతమైన ఈ రంగం ఇప్పుడు సరఫరా పెరిగిపోవడంతో కుదేలవుతోంది. మరోవైపు ప్రజల వద్ద డబ్బు అయిపోతోంది. అక్కడ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీ అపార్ట్‌మెంట్లన్నింటినీ నింపపడానికి చైనా జనాభా మొత్తం సరిపోదు.
చైనాలో ప్రస్తుతం 3 బిలియన్ల మందికి సరిపడా ఖాళీ ఇళ్లు ఉన్నాయని రెండేళ్ల క్రితం చైనా గణాంకాల బ్యూరో మాజీ డిప్యూటీ హెడ్ హీ కెంగ్ అంగీకరించారని లారా బికర్ తెలిపారు.
మధ్యతరగతి చైనీస్ కుటుంబాలు కేవలం ఇంటి ధరల గురించే ఆందోళన చెందడం లేదని లారా బికర్ రాశారు.
ప్రభుత్వం తమకు పింఛన్లు అందించగలదా లేదా అని వారు ఆందోళన చెందుతున్నారు. రాబోయే దశాబ్దంలో ప్రస్తుతం 50 నుంచి 60ఏళ్ల మధ్య వయస్సున్న సుమారు 3కోట్ల మంది చైనా కార్మిక శక్తి నుండి రిటైరవుతారు.
ప్రభుత్వ పింఛను నిధి 2035 నాటికి ఖాళీ కావచ్చని ప్రభుత్వ యాజమాన్యంలోని చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ 2019లో అంచనా వేసింది.
లక్షలాది మంది పట్టభద్రులు ఉద్యోగాలు సంపాదించడానికి ఇబ్బంది పడుతున్నందున, తమ కుమారులు, కుమార్తెలు, మనవళ్లు ఉద్యోగాలు సంపాదించగలరా లేదా అని కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారని లారా బికర్ తన కథనంలో రాశారు.
చైనాలోని పట్టణ ప్రాంతాల్లో 16 నుండి 24 ఏళ్ల వయస్సు గల వారిలో ఐదుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉన్నారని 2023 ఆగస్టులో ప్రచురించిన అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. అప్పటి నుండి ప్రభుత్వం నిరుద్యోగ గణాంకాలను విడుదల చేయలేదు.
చైనాలో అతి పెద్ద సమస్య ఏంటంటే అమెరికాకు వస్తువులను అమ్మడం నుంచి స్థానిక కొనుగోలుదారులకు అమ్మే పద్ధతికి ఆ దేశం రాత్రికి రాత్రే మారడం సాధ్యం కాని పని.

ఫొటో సోర్స్, Getty Images
ఆంక్షలున్నా కొనసాగిన వాణిజ్యం
గల్వాన్ ఘర్షణ తర్వాత కూడా చైనా భారతదేశంతో వాణిజ్యాన్ని కొనసాగించిందని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో తూర్పు ఆసియా అధ్యయన విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ అరవింద్ యెలారి చెప్పారు.
"గల్వాన్ ఘటన తర్వాత భారత్ విధించిన ఆంక్షలకు ప్రతిగా చైనా మరింత కఠినమైన ఆంక్షలతో ప్రతీకారం తీర్చుకోగలిగేది కానీ అలా చేయలేదు. 2022, 2023, 2024లో భారతదేశంతో చైనా వాణిజ్యం క్రమంగా పెరిగింది. తమ ద్వితీయ, తృతీయ శ్రేణి సంస్థలు భారత్‌తో వ్యాపారం చేస్తున్నాయని దీనివల్ల తమ దేశీయ మార్కెట్‌లోకి డబ్బు వస్తుందని చైనాకు బాగా తెలుసు. ఇది దేశీయ డిమాండ్‌ను పెంచడానికి గణనీయంగా సహాయపడుతుంది" అని అరవింద్ యెలారి బీబీసీతో చెప్పారు.
"యూరప్, అమెరికాతో చైనా వాణిజ్య సంబంధాలు చాలా బాగుండేవి. కానీ 2017-18 తర్వాత ఆ మార్కెట్లలో చైనా అవకాశాలు అంతగా మెరుగుపడలేదు" అని ఆయన అన్నారు.
"భారత్ వాణిజ్యాన్ని విస్తరించుకోవాలని కోరుకుంటోంది. కానీ చైనాకు దాని పరిమితులు, సామర్థ్యం గురించి తెలుసు. అందుకే భారత్ తనపైనే ఆధారపడి ఉండాలని అది కోరుకుంటుంది. కాబట్టి, ఒక స్థిరమైన వినియోగదారుడిని రెచ్చగొట్టడానికి అది ఇష్టపడదు. భారత్‌తో చైనా వాణిజ్యం పెరుగుతున్న తీరు చూస్తే రానున్న ఏడేళ్లలో ఇది 200 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు" అని అరవింద్ అభిప్రాయపడ్డారు.
గతేడాది భారత్- చైనా ప్రత్యక్ష విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించాయి. చైనా వ్యాపార నిపుణుల కోసం భారత్ వీసా విధానాలను సులభతరం చేసింది. అయితే ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య పోటీ అంత సులభంగా ముగియదు.
"చైనాకు చెందిన అలీపేను భారత్‌లోని తక్షణ చెల్లింపుల వ్యవస్థతో అనుసంధానించాలన్న ప్రతిపాదనను తిరస్కరించినట్లు" రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
చైనాకు చెందిన యాంట్ గ్రూప్‌తో అనుబంధం ఉన్న ఈ చెల్లింపుల సేవను జాతీయ భద్రతాపరమైన ఆందోళనల కారణంగా నిలిపివేశారు .
చైనా మొబైల్ కంపెనీ షియోమిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ ఎస్ఎఫ్ఐఓ చేసిన సిఫార్సును భారత ప్రభుత్వం కూడా పరిశీలిస్తోంది.
భారత్‌కు కీలక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అందించవద్దని చైనా అధికారులు కంపెనీలను కోరినట్లు భారత్‌కు చెందిన సోర్స్ ఒకటి రాయిటర్స్‌కు తెలిపింది.
వీటిలో పోర్ట్ పరికరాలు, సోలార్ ప్యానెళ్లు, మొబైల్ ఫోన్ల తయారీకి అవసరమైన పరికరాలు ఉన్నాయి.
దీనిపై రాయిటర్స్ వార్తా సంస్థ చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ సంప్రదించగా స్పందించేందుకు వారు నిరాకరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























