కడుపులో బిడ్డకు గుండె సమస్య.. అబార్షన్‌కు నిరాకరించిన సరోగేట్ తల్లి సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మ్యాడలీన్ హాల్పర్ట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
కాలిఫోర్నియాకు చెందిన ఒమర్ అహ్మద్, నౌషీన్ గిల్కర్ దంపతులు తమ బిడ్డకు జన్మనిచ్చేందుకు మెకెన్నావెస్ట్ అనే మహిళను సరోగేట్ మదర్‌గా నియమించుకున్నారు. మెకెన్నా గర్భంలో పెరుగుతున్న పిండానికి ఆరోగ్య సమస్యలున్నట్టు తేలడంతో అబార్షన్ చేయించు కోవాల్సిందిగా ఆ దంపతులు కోరారు.
కానీ ఆ కోరికను తిరస్కరించిన మెకెన్నా బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడా బిడ్డ సంరక్షణ విషయంలో జరుగుతున్న వివాదంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ఆమె అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
మునుపటి కోర్టు తీర్పును నిలిపివేయాలని కోరుతూ మెకెన్నా వెస్ట్ అత్యవసర అప్పీల్ దాఖలు చేశారు. మెకెన్నా జన్మనిచ్చిన శిశువుపై ఒమర్ అహ్మద్, నౌషీన్ గిల్కర్ దంపతులకు తల్లిదండ్రుల హక్కులు కల్పిస్తూ గతంలో తీర్పు వెలువడింది.
గర్భం దాల్చిన 20వ వారంలో చేసిన స్కానింగ్‌లో పిండానికి తీవ్రమైన గుండె లోపం ఉన్నట్లు తేలడంతో వెస్ట్‌ను గర్భస్రావం చేయించుకోవాల్సిందిగా అహ్మద్, గిల్కర్ దంపతులు కోరారు. కానీ వెస్ట్ అందుకు నిరాకరించి టెక్సాస్‌కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చారు.
టెక్సాస్‌లో అబార్షన్లు చట్టవిరుద్ధం. వెస్ట్‌కు పలువురు రిపబ్లికన్ అధికారులు మద్దతు తెలిపారు. ఈ విషయంపై స్పందన కోసం అహ్మద్, గిల్కర్ న్యాయవాదులను బీబీసీ సంప్రదించింది.
ఆగస్టులో జన్మించిన ఆ బిడ్డకు హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ ఉన్నట్లు తేలింది. ఈ లోపం వల్ల గుండె ఎడమ భాగం శరీరానికి అవసరమైనంత రక్తాన్ని పంపించలేకపోతుంది.
ఈ పరిస్థితికి తరచుగా అనేక శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. అయితే అవి ఈ లోపాన్ని పూర్తిగా నయం చేయలేవు. ఈ వ్యాధి ఉన్న శిశువులకు జీవితాంతం ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.
వెస్ట్ టెక్సాస్‌కు వెళ్లిన తర్వాత, రిపబ్లికన్ పార్టీకి చెందిన టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్ట్సన్ ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. ఆ శిశువుకు టెక్సాస్‌లోనే వైద్యం అందించేలా కోర్టు నుంచి అత్యవసర ఉత్తర్వులు పొందారు. పుట్టిన కొద్దిసేపటికే శిశువుకు శస్త్రచికిత్స జరిగింది.

చికిత్సకు ఉన్న అవకాశాల గురించి తెలుసుకున్న తర్వాత "ఈ విలువైన ప్రాణాన్ని" తన వద్దే ఉంచుకోవాలని నిర్ణయించుకుని దంపతులు కోరిన గర్భస్రావానికి తాను నిరాకరించానని వెస్ట్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తెలిపారు.
జీవితానికి ముప్పు కలిగించే ఆరోగ్య సమస్య ఉన్నట్లు తెలిసిన తర్వాత దంపతులు గర్భస్రావం చేయించుకోవాలని కోరారని, అందువల్ల బిడ్డకు అవసరమైన వైద్య చికిత్సను వారు అందించకపోవచ్చని తాను ఆందోళన చెందుతున్నానని వెస్ట్ చెప్పారు. ఈ కారణంగా బయోలాజికల్ తల్లిదండ్రులకు శిశువు సంరక్షణ అప్పగించకూడదని ఆమె వాదించారు.
గతంలో జరిగిన కోర్టు విచారణలో గిల్కర్ తాము రుమి అని పేరుపెట్టుకున్న తమ బిడ్డ "తమ ప్రేమకు ప్రతిరూపం" అని పేర్కొన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. వెస్ట్ తమకు చెప్పకుండా టెక్సాస్‌కు వెళ్లారని, బిడ్డకు సంబంధించిన వైద్య సమాచారాన్ని తాము తెలుసుకునే అవకాశాన్ని ఆమె అడ్డుకున్నారని వారు ఆరోపించారు.
కాలిఫోర్నియా కోర్టు గతంలో అహ్మద్, గిల్కర్కు తల్లిదండ్రుల హక్కులు కల్పించింది. అదే సమయంలో ఓ టెక్సాస్ కోర్టు బిడ్డను చూడకుండా వెస్ట్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గత నెలలో ఈ కాలిఫోర్నియా దంపతుల తరఫు న్యాయవాది బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని, మరిన్ని సమస్యలతో బిడ్డ అవస్థ పడే అవకాశముందని చెప్పారు.
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే శిశువు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని ఇకపై తాను తెలుసుకోలేనని వెస్ట్ వాదించారు. కాలిఫోర్నియా దంపతులు బిడ్డను హాస్పిస్ సంరక్షణకు తరలించే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వెస్ట్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























