జహంగీర్: మద్యానికి బానిసై, అధికారాన్ని భార్య నూర్‌ జహాన్‌కు వదులుకున్న రాజు కథ..

నూర్ జహాన్ జహంగీర్ మొఘల్ చక్రవర్తి

ఫొటో సోర్స్, Heritage Art/Heritage Images via Getty Images

ఫొటో క్యాప్షన్, నూర్‌ జహాన్, జహంగీర్ చిత్రం
    • రచయిత, వకార్ ముస్తఫా
    • హోదా, పరిశోధకులు, జర్నలిస్టు
  • ప్రచురణ
  • చదివే సమయం: 9 నిమిషాలు

"రాజ్యాన్ని నూర్‌జహాన్‌కు అప్పగించాను. నాకు కావాల్సిందల్లా ఒక సీర్‌ మద్యం, అర సీర్‌ మాంసం మాత్రమే"

మొఘల్ సామ్రాజ్య నాలుగో చక్రవర్తి నూరుద్దీన్ మహమ్మద్ జహంగీర్‌ ఈ మాటలు చెప్పారంటూ మీర్జా మహమ్మద్ హాదీ తన 'తుజుక్-ఇ-జహంగీరీ' గ్రంథానికి రాసిన ముందుమాటలో పేర్కొన్నారు.

మద్యం, ఇతర మత్తు పదార్థాల వినియోగానికి సంబంధించిన విషయాలను జహంగీర్ ఎప్పుడూ దాచిపెట్టలేదు. రోజువారీ జీవితంలోని సంఘటనల ఆధారంగా ఆయన రాసుకున్న 'జహంగీర్‌నామా'లో వీటి గురించి స్పష్టంగా ప్రస్తావించారు.

పాలన, న్యాయం, కళలు, ప్రకృతి వంటి అంశాలపై తన అనుభవాలతోపాటు మద్యపానానికి సంబంధించిన విషయాలను కూడా ఆయన అందులో పేర్కొన్నారు.

"ప్రార్థనలు, మొక్కులు, పూజల ఫలితంగా జన్మించిన ఆ శిశువు, తన కాలంలోని అత్యంత సంపన్నమైన, శక్తిమంతమైన చక్రవర్తికి పెద్ద కుమారుడు. అందమైన రాజనగరం ఫతేపూర్ సిక్రీకి అతడు అత్యంత ప్రియమైన యువరాజు" అని బేని ప్రసాద్ తన పుస్తకం 'హిస్టరీ ఆఫ్ జహంగీర్'లో రాశారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అప్పటి వరకు వచ్చిన మొఘల్ చక్రవర్తులతో పోలిస్తే జహంగీర్ జీవితం సకల సౌకర్యాలు, విలాసాలతో నిండినదే. అయితే ఈ సౌకర్యాలే ఆయనలో సంకల్పం, నిర్ణయ సామర్థ్యానికి సంబంధించిన బలహీనతలను పెంచాయని బేని ప్రసాద్ పేర్కొన్నారు.

తనకంటే సమర్థులు లేదా తెలివైన వారి ప్రభావానికి ఆయన సులభంగా లోనయ్యేవారు. యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలో అలవాటైన మద్యపానం ఈ బలహీనతలను మరింత తీవ్రం చేసింది.

బేని ప్రసాద్ అభిప్రాయం ప్రకారం, మద్యపానం అన్నది మొఘల్ వంశంలో చాలాకాలంగా ఉన్న బలహీనత.

బాబర్ తన ఆత్మకథలో దుఃఖాలు, ఆందోళనల నుంచి తప్పించుకునేందుకు మద్యంతో నడిచే విందుల గురించి విపులంగా రాశారు. హుమాయూన్ ఆరోగ్యం మద్యం, నల్లమందు వినియోగంతో దెబ్బతింది. ఆయన కుమారుడు మహమ్మద్ హకీమ్ కూడా మద్యానికి బానిసై 31 ఏళ్ల వయసులో మరణించాడు.

అక్బర్ ఈ ధోరణికి దాదాపు ఒక మినహాయింపనే అనుకోవాలి. అయితే యవ్వనంలో ఆయన కూడా మద్యానికి అలవాటు పడి, కొన్ని సందర్భాల్లో హద్దులు దాటేవారు. ఆయన ఇద్దరు చిన్న కుమారులు మురాద్, దానియాల్ కూడా చివరకు మద్యపానం కారణంగా మరణించారు.

అయితే జహంగీర్ తన 17వ పుట్టినరోజు వరకు మద్యాన్ని రుచి కూడా చూడలేదు.

నూర్ జహాన్ జహంగీర్ మొఘల్ చక్రవర్తి

ఫొటో సోర్స్, Getty Images

‘వేటాడిన జంతువులను తన సమక్షంలోనే శుభ్రం చేయించేవారు’

భారతదేశాన్ని 1605 నుంచి 1627 వరకు పాలించిన జహంగీర్ తన పాలనా కాలంలో సగానికి పైగా సమయాన్ని సామ్రాజ్యమంతటా ప్రయాణించడంలోనే గడిపారు.

అంశికా జైన్ రాసిన 'ఎంపరర్ జహంగీర్: ది నేచురలిస్ట్' అనే వ్యాసం ప్రకారం, చిన్నప్పటి నుంచే జహంగీర్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశితంగా పరిశీలించేవారు. దేశ విదేశాల నుంచి బహుమతులుగా వచ్చిన జంతువులు, పక్షులను ఆయన ఆసక్తిగా గమనించేవారు. వాటి చిత్రాలను కూడా వేయించేవారు.

మార్ఖోర్, బర్బరీ జాతి మేకలను జహంగీర్ సంకరం చేసినట్లు చెప్పారు. వాటికి పుట్టిన సంతానం కదలికలు, ప్రవర్తనలను కూడా ఆయన దగ్గరగా పరిశీలించేవారు.

జహంగీర్‌కు జంతువులపై ఉన్న ఆసక్తి ఎంతలా ఉండేదంటే, ఆయన జీవితంలోని చివరి సంవత్సరాల్లో ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకునే స్థాయికి చేరుకుంది.

వేటాడిన జంతువులను తన సమక్షంలోనే శుభ్రం చేయాలని ఆయన ఆదేశించేవారు. అవి ఏమి తిన్నాయో తెలుసుకోవడానికి వాటి కడుపులను స్వయంగా పరిశీలించేవారు. ఏదైనా అసహ్యకరమైన పదార్థం కనిపిస్తే, ఆ జంతువును తన ఆహారపు జాబితా నుంచి తొలగించేవారు.

అంశికా జైన్ ప్రకారం, జహంగీర్ వ్యక్తిత్వంలో అనేక వైరుధ్యాలు కనిపిస్తాయి. ఆయన ఒకసారి విలాసాల్లో మునిగిపోయిన రాజు అయితే, మరోసారి ప్రపంచాన్ని లోతుగా పరిశీలించే తత్వవేత్త.

చరిత్రకారుడు హెన్రీ బెవరిడ్జ్ అభిప్రాయం ప్రకారం, జహంగీర్ ఒక మహా మొఘల్ సామ్రాజ్యానికి అధిపతిగా కాకుండా నేచురల్ హిస్టరీ మ్యూజియానికి అధిపతిగా ఉండి ఉంటే, బహుశా మరింత సంతోషంగా ఉండేవారు.

లిసా బాలబన్ లిల్లర్ తన పరిశోధనా వ్యాసం 'ది ఎంపరర్ జహంగీర్ అండ్ ది పర్స్యూట్ ఆఫ్ ప్లెజర్'లో జహంగీర్ స్వయంగా సైన్యాలకు నాయకత్వం వహించడం చాలా అరుదని రాశారు. తరచూ కుమారులు నడిపే సైన్యాలను అనుసరించేవారు లేదా వ్యక్తిగత ఆనందం, వినోదం కోసం ఖాళీగా సంచరించేవారు.

అయినప్పటికీ, ఈ సంచార జీవితం, వేట, బహిరంగంగా మత్తు పదార్థాలు తీసుకోవడం, దాదాపు నిరంతర ప్రయాణాల వంటివి ఉన్నప్పటికీ రాజసిబ్బంది, ప్రభువర్గం నుంచి కొంతవరకు ఆమోదం పొందేవారు.

నూర్ జహాన్ జహంగీర్ మొఘల్ చక్రవర్తి

ఫొటో సోర్స్, Getty Images

మద్యానికెలా బానిసయ్యారు?

ఆత్మకథ 'తుజుక్-ఇ-జహంగీరీ'లో జహంగీర్ తన విజయాలు, ఆస్థానం, సామ్రాజ్యం గురించి మాత్రమే కాకుండా తన బలహీనతల గురించి కూడా రాశారు.

మద్యం తాగే అలవాటు ఒక చిన్న సంఘటనతో ప్రారంభమైందని స్వయంగా రాశారు.

యువరాజుగా ఉన్న సమయంలో జహంగీర్ సింధు నది ఒడ్డున అటక్ సమీపంలో తన తండ్రి అక్బర్ సైన్యంతో ఉన్నారు. ఒక రోజు వేట నుంచి తిరిగి వస్తుండగా అలసిపోయారు. తుపాకీ దళ అధికారి ఉస్తాద్ షా కులీ ఆయనకు ఒక గ్లాసు మద్యం తాగాలని సూచించారు.

జహంగీర్ తన సేవకుడు మహ్మద్‌ను హకీమ్ అలీ ఇంటి నుంచి మత్తు పానీయం తీసుకురావాలని ఆదేశించారు. దాంతో చిన్న సీసాలో సుమారు ఒకటిన్నర కప్పుల తీపి, పసుపు రంగు మద్యం తీసుకొచ్చారు.

జహంగీర్ దాన్ని తాగారు. దాని రుచి ఆయనకు నచ్చింది. ఆ తర్వాత తన మాటల్లోనే చెప్పాలంటే, "రోజురోజుకూ పరిమాణాన్ని పెంచడం ప్రారంభించాను"

ఒకదశలో ఆయన ప్రతిరోజూ మద్యం తాగేవారు. అయితే గురు, శుక్రవారపు రాత్రుల్లో మాత్రం దూరంగా ఉండేవారు. గురువారం సింహాసనారోహణ దినంగా, శుక్రవారం పవిత్ర దినంగా భావించేవారు. ఈ రెండు రోజుల్లో మద్యానికి దూరంగా ఉండటం మతపరమైన, రాజ సంప్రదాయాలతో ముడిపడి ఉండేది.

గ్రేప్ వైన్ తనకు తగినంత మత్తు ఇవ్వడం లేదని భావించినప్పుడు ఆయన అరక్ అనే ఆవిరి ద్వారా తయారయ్యే మద్యానికి మారారు. తొమ్మిదేళ్లలో పరిస్థితి మరింత తీవ్రమైంది. రోజుకు 20 కప్పుల అరక్ తాగే స్థాయికి చేరుకున్నారు. ఇందులో 14 కప్పులు పగటిపూట, ఆరు కప్పులు రాత్రిపూట తీసుకునేవారు. ఒక్కో కప్పులో సుమారు 82 గ్రాములు, అంటే దాదాపు 85 మిల్లీలీటర్ల మద్యం ఉండేది.

ఈ మోతాదు వల్ల తన శరీరంపై పడిన ప్రభావాన్ని కూడా జహంగీర్ స్వయంగా వివరించారు.

‘‘చేతులు ఎంతగా వణికేవంటే, సొంతంగా కప్పు పట్టుకుని తాగలేకపోయేవాడిని’’ అని ఆయన రాశారు. ఇతరులు తనకు మద్యం తాగించాల్సి వచ్చేది. హకీమ్ హమ్మామ్ అప్పుడు రాజును తీవ్రంగా హెచ్చరించారు. ఇదే విధంగా మద్యపానం కొనసాగిస్తే మరికొన్ని నెలల్లో ఆయనకు చికిత్స చేయడం కూడా సాధ్యం కాదని చెప్పారు.

"జీవితం విలువైనది" అనే ఆలోచన తనపై ప్రభావం చూపిందని జహంగీర్ రాశారు. దాంతో మద్యం పరిమాణాన్ని తగ్గించడం ప్రారంభించారు. అయితే ఒక వ్యసనం నుంచి బయటపడుతూ మరో వ్యసనం వైపుకి తిరిగారు జహంగీర్.

నూర్ జహాన్ జహంగీర్ మొఘల్ చక్రవర్తి

ఫొటో సోర్స్, Museum of Art & Photography, India

‘రోజూ 20 గ్లాసుల మద్యం తాగడం ప్రారంభించాను’

మద్యం ఎంత తగ్గించుకున్నారో, అదే స్థాయిలో 'ఫిలోనియా' పరిమాణాన్ని పెంచానని జహంగీర్ పేర్కొన్నారు.

ఆ తర్వాత కథలో నల్లమందు ప్రవేశించింది. తనకు 46 సంవత్సరాల నాలుగు నెలల వయసున్నప్పుడు ఆయన రోజు ఎంత నల్ల ముందు తీసుకునే వారో కూడా నమోదు చేశారు. పగటిపూట ఐదు ఘరీల తర్వాత ఎనిమిది సుర్ఖాలు, రాత్రిపూట ఒక ఘరీ తర్వాత ఆరు సుర్ఖాలు తీసుకునేవారు. అంటే తన నల్లమందు వినియోగాన్ని కూడా రోజువారీగా అత్యంత కచ్చితంగా నమోదు చేసుకునేవారు.

జహంగీర్ తాను 18 ఏళ్ల వయసు నుంచి మద్యం తాగుతున్నానని రాశారు. ఒక దశలో రోజుకు 20 గ్లాసులకు చేరిన మోతాదును తరువాత తగ్గించుకున్నారు. 30 ఏళ్లు దాటిన తర్వాత రాత్రిపూట మాత్రమే తాగేవారు. చివరికి ఆ కొంచం కూడా జీర్ణక్రియ కోసమే తీసుకుంటున్నానని చెప్పుకున్నారు.

పాలనలో 13వ సంవత్సరంలో గుజరాత్ వాతావరణం తనకు అనుకూలంగా లేదని భావించిన జహంగీర్ ఆరోగ్యం క్షీణించింది. మద్యం, నల్లమందు రెండింటినీ తగ్గించాలని వైద్యులు సూచించారు. ఆయన వెంటనే రెండింటి మోతాదును తగ్గించగా, మొదటి రోజే ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని రాశారు.

కాని వ్యసనాలకు విచక్షణతో పనిలేదు.

ఈ అనారోగ్య సమయంలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం ఉన్నప్పటికీ ఆయన త్వరలోనే రోజువారీ మద్యపానం ఊబిలోకి పడిపోయారు. ఆ తర్వాత పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

తీవ్రమైన అనారోగ్యంలో మద్యం తనకు తాత్కాలిక ఉపశమనం కలిగించిందని జహంగీర్ రాశారు. దాంతో ఇంతకుముందు అలవాటు లేని విధంగా పగటిపూట కూడా మద్యం తాగడం ప్రారంభించారు. ఆ తర్వాత మోతాదు క్రమంగా హద్దులు దాటింది. వేడి వాతావరణం పరిస్థితిని మరింత దిగజార్చడంతో బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి.

ఇక్కడే నూర్‌జహాన్ పాత్ర కీలకంగా మారారు.

నూర్‌జహాన్ బేగం క్రమంగా తన మద్యపానాన్ని తగ్గించిందని, హానికరమైన ఆహారం, పానీయాలు తీసుకోకుండా అడ్డుకున్నారని, చికిత్స కూడా ఏర్పాటు చేశారని జహంగీర్ రాశారు.

వైద్యుల నైపుణ్యం, అనుభవంకంటే నూర్‌జహాన్ చూపిన ప్రేమ, కరుణ, శ్రద్ధే తనకు మరింత ప్రభావవంతంగా అనిపించాయని ఆయన పేర్కొన్నారు. అంటే నూర్‌జహాన్‌ను కేవలం ప్రభావశీలమైన రాణిగానే కాకుండా, అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకుంటూ ఆయన మద్యపానాన్ని నియంత్రించిన భార్య కూడా.

నూర్ జహాన్ జహంగీర్ మొఘల్ చక్రవర్తి

ఫొటో సోర్స్, Getty Images

‘‘చక్రవర్తి పూర్తిగా నూర్‌జహాన్‌పై ఆధారపడిపోయారు’’

అయితే మునీ లాల్ తన 'జహంగీర్' పుస్తకంలో, జహంగీర్ నిస్సహాయత జాలిపడే స్థాయికి చేరిందని రాశారు. నూర్‌జహాన్ సౌందర్యం, రాజస్వభావం ఆయనలో మిగిలి ఉన్న కొద్దిపాటి వివేచన, సంకల్పబలాన్ని కూడా మిగలకుండా చేసాయని ఆయన అభిప్రాయపడ్డారు.

దీర్ఘకాలిక అనారోగ్యం, మద్యపానం, తీవ్రమైన శారీరక కోరికలు జహంగీర్‌ను నూర్‌జహాన్‌పై పూర్తిగా ఆధారపడేలా చేసిన ప్రధాన కారణాలని మునీ లాల్ పేర్కొన్నారు.

అయితే 'ఎన్‌సైక్లోపీడియా ఇరానికా'లో లిసా బాలబన్ లార్ రాసిన ప్రకారం, జహంగీర్ తన భార్యకు రాజ్యాధికారాన్ని పూర్తిగా అప్పగించాడని కొందరు చరిత్రకారులు భావించినప్పటికీ, ఆయన పాలనలోని చివరి ఐదేళ్లలో కూడా రాజ్యనికి సంబందించిన రాజకీయ వ్యవహారాలపై ఆసక్తి కొనసాగించారు. వాటిలో చురుకుగా పాల్గొన్నారు.

నిజానికి పాలన నుంచి పూర్తిగా వైదొలగకుండా, తనకు నమ్మకమైన, సమర్థురాలైన సహచరికి ప్రభుత్వ బాధ్యతల్లో కొంత భాగాన్ని అప్పగించిన రాజుకు నూర్‌జహాన్ అధికార భాగస్వామిగా ఉన్నారు.

వేట, క్రీడలను జహంగీర్ ఎంతో ఇష్టపడేవారని, నూర్‌జహాన్ కూడా తరచూ ఆయనతో పాటు ఈ యాత్రలకు వెళ్లేవారని లిసా 'తుజుక్' అనే డైరీ ఆధారంగా రాశారు.

ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు నూర్‌జహాన్ కేవలం ఆరు తూటాలతో నాలుగు సింహాలను చంపారు. తన భార్య సామర్థ్యానికి గర్వించిన జహంగీర్ ఆమెకు వెయ్యి బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు. లక్ష రూపాయల విలువైన ఒక జత ముత్యాలు, వజ్రాన్ని కూడా అందించారు.

అయితే పాలనలో సాఫీగా ప్రశాంతంగా, సంతోషకరంగా సాగిన సంవత్సరాల్లో కూడా జహంగీర్ మద్యం, మత్తు పదార్థాలపై వ్యసనాన్ని వదులుకోలేకపోయారు. ఆస్థానంలో మద్యాన్ని సంరక్షించడానికి, భద్రపరచడానికోసమే ప్రత్యేకంగా ఒక అధికారిని కూడా ఆయన నియమించారు.

జహంగీర్ ఆత్మకథలోని అత్యంత పెద్ద వైరుధ్యాల్లో ఇదొకటి. చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మద్యం, ఇతర మత్తు పదార్థాలను ప్రజలు తయారు చేయడం, విక్రయించడాన్ని ఆయన నిషేధించారు. అయితే అదే ఆదేశంలో తన మద్యపాన అలవాటు గురించి కూడా ప్రస్తావించారు.

ఇతరుల మద్యపానం, నల్లమందు వ్యసనం వల్ల కలిగిన పరిణామాలను కూడా ఆయన ఆత్మకథలో నమోదు చేశారు. నల్లమందుకు బానిసై, మద్యం కూడా తాగిన ఇనాయత్ ఖాన్ గురించి ఆయన రాశారు. మద్యం ఆయన పరిస్థితిని మరింత దిగజార్చిందని పేర్కొన్నారు.

ఇతరుల వ్యసనాన్ని గురించి రాస్తున్నప్పుడు దాని ప్రమాదకర ప్రభావాలను జహంగీర్ స్పష్టంగా గుర్తించగలిగారు. అయితే తన మద్యపానాన్ని మాత్రం నియంత్రణ, ఔషధం లేదా జీర్ణక్రియ కోసం అవసరమైనదిగా తరచూ సమర్థించుకున్నారు.

ఈ వైరుధ్యానికి మరో ఉదాహరణ ఆయన కుమారుడు, తర్వాతి కాలంలో చక్రవర్తి అయ్యి షాజహాన్‌గా మారిన ఖుర్రమ్ కథ.

ఖుర్రమ్ 24 ఏళ్ల వయసు వరకు మద్యానికి దూరంగా ఉన్నారని జహంగీర్ రాశారు. ఒక సందర్భంలో ఆయన కుమారుడికి స్వయంగా మద్యం ఇచ్చి, మితంగా తాగాలని సూచించారు. ఇబ్న్ సీనా మాటలను ఉటంకిస్తూ, మద్యం కొద్దిగా సేవిస్తే ఔషధంలాంటిదని, ఎక్కువైతే పాము విషంలాంటిదని చెప్పారు.

రాజు ఆస్థానంలో జహంగీర్ తరచూ మద్యంతో విందులు ఏర్పాటు చేసేవారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఆ విందుల అనంతరం ఆస్థానంలోని వ్యక్తులు "విధేయత అనే మద్యంతో మత్తెక్కిపోయేవారు"

నౌరోజ్ సందర్భంగా రాజసభలో పాల్గొనే వారికి తమకు నచ్చిన "మత్తు పానీయం లేదా మత్తు పదార్థాన్ని" తీసుకునేందుకు అనుమతిచ్చారు. ఎలాంటి "నిషేధం లేదా అడ్డంకి" గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆదేశించారు.

నూర్ జహాన్ జహంగీర్ మొఘల్ చక్రవర్తి

ఫొటో సోర్స్, Getty Images

‘న్యాయాన్ని ప్రేమించిన రాజు’

రామ్ చంద్ర ప్రసాద్ తన 'ఎర్లీ ఇంగ్లిష్ ట్రావెలర్స్ ఇన్ ఇండియా' పుస్తకంలో, 1616లో జహంగీర్ మద్యం మత్తులో కొంతమంది ఆస్థానికులను తనతో కలిసి కూర్చుని మద్యం తాగాలని ఆదేశించినట్లు రాశారు.

మరుసటి రోజు ఎవరో ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా ముందు రోజు రాత్రి జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. తాను ఇచ్చిన ఆదేశం గుర్తులేని జహంగీర్, ఆస్థానికులకు మద్యం తాగేందుకు అనుమతి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

జహంగీర్ వ్యసనం, మద్యం నల్లమందుకే పరిమితం కాలేదు.

కశ్మీర్ పర్యటనలో తానే తయారు చేసిన ఒక స్థానిక మత్తు పానీయం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అందులో గంజాయి కలిపి ఉండొచ్చని ఆయన భావించారు. దాని మత్తు ప్రభావాలను, శరీరంపై కలిగించే ప్రభావాలను వివరించారు. మద్యం అందుబాటులో లేని సమయంలో అవసరమైతే ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగించవచ్చని భావించారు.

భారత సంతతికి చెందిన అమెరికన్ చరిత్రకారుడు, రచయిత నరసింహ పి. సిల్ ప్రకారం, జహంగీర్‌ను సాధారణంగా విలాసాలకు మక్కువ చూపిన పాలకుడిగా చూస్తారు. అయినప్పటికీ ఆయన న్యాయ నిర్వహణకు ఒక అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులో అత్యంత ప్రసిద్ధమైనది 'జంజీర్-ఇ-అదల్'. ప్రజల ఫిర్యాదులు, సమస్యలు నేరుగా చక్రవర్తి దృష్టికి చేరేలా చేయాలన్న నిబద్ధతకు ఇది ప్రతీకగా నిలిచింది.

జహంగీర్ పాలనలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో వాణిజ్య సంబంధాలు కూడా ఏర్పడ్డాయి.

కళలు, సాంస్కృతికి ప్రోత్సాహం, పరిపాలనా చర్యలు, సంక్లిష్టమైన కుటుంబ సంబంధాలు, మొఘల్ చరిత్రలోని విస్తృత పరిణామాలన్నీ కలిసి జహంగీర్ వారసత్వాన్ని రూపొందించాయి. ఆయన వ్యక్తిత్వంలోని అనేక వైరుధ్యాలను ఇవి ప్రతిబింబిస్తాయి.

జీవితంలోని చివరి సంవత్సరాల్లో అధిక మద్యం, మత్తు పదార్థాల వినియోగం జహంగీర్ శరీరాన్ని తీవ్రంగా బలహీనపరిచిందని లిసా రాశారు. మరో కుమారుడి తిరుగుబాటును అణచివేసి విజయవంతమైన కానీ ఆ యాత్ర తర్వాత తీవ్రమైన అలసటతో ఆయన దాదాపు పక్షవాతానికి గురయ్యారు. నల్లమందు తీసుకోవడం వల్ల కూడా ఆయన నడవడం, సాధ్యం కాని స్థితికి చేరుకున్నారు. కొద్దిపాటి మద్యం మాత్రమే తాగగలిగేవారు.

అయినా ఆయన ప్రయాణాలు ఆపలేదు.

1627 వేసవిలో తనకు అత్యంత ఇష్టమైన విశ్రాంత ప్రదేశమైన కశ్మీర్‌కు జహంగీర్ బయలుదేరారు. అయితే అక్కడికి చేరిన కొద్ది రోజులకే ఆయనతో పాటు వచ్చిన చిన్న కుమారుడు యువరాజు షహర్యార్ కూడా తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమించింది.

ఆ తర్వాత జహంగీర్ లాహోర్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. అయితే ప్రయాణంలో 1627 అక్టోబర్ 28న చింగార్ సిరి వద్ద ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయసు 58 సంవత్సరాలు. సింహాసనంపై దాదపు 21 సంవత్సరాలు పాటు ఉన్నారు.

అనారోగ్యం, బలహీనత కారణంగా జహంగీర్ ఆత్మకథ రచన ఆయన పాలన 17వ సంవత్సరం తర్వాత నిలిచిపోయింది. ఆ తర్వాతి భాగాలను ఆస్థాన చరిత్రకారులు, ముఖ్యంగా ముతమిద్ ఖాన్, మహమ్మద్ హాదీ పూర్తి చేశారు.

జహంగీర్ తర్వాత వచ్చిన మొఘల్ చక్రవర్తులు తమ పూర్వీకుల మాదిరిగానే ఆర్థిక, రాజకీయ శక్తి ఉన్నంతకాలం చురుకైన విలాసవంతమైన జీవనశైలిని కొనసాగించారని లిసా పేర్కొన్నారు. ఈ ధోరణి జహంగీర్ తరువాత సుమారు వందేళ్లపాటు కొనసాగింది.

అయితే ఆనందం, వినోదం కోసం జహంగీర్‌లా నిరంతరం ప్రయాణించిన మొఘల్ చక్రవర్తి జహంగీర్‌కు ముందు కానీ, తర్వాత కానీ చాలా అరుదు.

మద్యపానం అలవాటును, దాన్ని నియంత్రించేందుకు చేసిన ప్రయత్నాలను జహంగీర్ బహిరంగంగా అంగీకరించారు. ఆయన ఆస్థాన కవి తాలిబ్ అమలీ ఈ పరిస్థితిని ఒక పద్యంలో ఇలా వర్ణించినట్లు జహంగీర్ పేర్కొన్నారు:

నాకు రెండు పెదవులు ఉన్నాయి,

ఒకటి మద్యం తాగుతుంది,

మరొకటి మత్తులో ఉన్నందుకు క్షమాపణ కోరుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)