అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ఆగిపోదా? 2029 వరకు సాగుతుందన్న అనుమానాలు ఎందుకు వస్తున్నాయి?

డోనల్డ్ ట్రంప్, అమెరికా- ఇరాన్ యుద్ధం, తెహ్రాన్, హార్ముజ్ జలసంధి, ముడి చమురు

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

సెప్టెంబర్ 9 నాటి అమెరికన్ మీడియా కథనాల్లో ‘ఈ యుద్ధం ఎప్పుడు ఎలా ముగుస్తుంది?’ అనే ప్రశ్న కంటే ‘ఈ యుద్ధం ఇంధన మార్కెట్లకు పెద్ద షాక్ ఇచ్చేలా సుదీర్ఘ ప్రాంతీయ ఘర్షణగా మారుతోందా?’ అనే అంశంపైనే ప్రధానంగా చర్చ నడిచింది.

ఇరాన్‌తో సాగుతున్న ప్రస్తుత యుద్ధం ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం ముగిసే వరకు అంటే 2029 వరకు కొనసాగే అవకాశం ఉందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పలువురు ట్రంప్ ప్రభుత్వ ఉన్నతాధికారులు అంతర్గతంగా చర్చించుకున్నట్లు 'ది వాల్‌స్ట్రీట్ జర్నల్' రిపోర్ట్ చేసింది.

యుద్ధం త్వరలోనే ముగుస్తుందంటూ ట్రంప్ పదే పదే చెబుతున్న మాటలకు ఈ అంచనాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

మరో రెండు నెలల్లో జరగనున్న అమెరికా ప్రతినిధుల సభ (దిగువ సభ) మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే యుద్ధం ముగుస్తుందని భావిస్తున్నట్లు ట్రంప్ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు.

తమకు సానుకూలంగా ఉండేవారు దిగువ సభలో అధికారంలోకి రావాలని ఇరాన్ కోరుకుంటోందని, ఇందుకోసం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని ట్రంప్ ఆరోపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల కవరేజ్ కూడా అమెరికన్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది.

ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడులు.. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార క్షిపణి దాడులు.. అలాగే దక్షిణ ఇరాన్ సముద్ర తీరంలో అమెరికన్ నేవీపై దాడి చేశామన్న ఇరాన్ సైనికాధికారుల ప్రకటనలు అమెరికన్ మీడియాలో పతాక శీర్షికల్లో కనిపించాయి.

అయితే దీనికి భిన్నంగా తమ యుద్ధనౌక దేనినీ ఇరాన్ టార్గెట్ చేసుకోలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.

"ఈ పరిస్థితి త్వరలో ముగిసే సంకేతాలేవీ కనిపించడం లేదు" అని పేర్కొన్న సీఎన్ఎన్ రిపోర్టర్, ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ చర్చలు ప్రారంభించడం సాధ్యమేనా అనే ప్రశ్నను లేవనెత్తారు.

డోనల్డ్ ట్రంప్, అమెరికా- ఇరాన్ యుద్ధం, తెహ్రాన్, హార్ముజ్ జలసంధి, ముడి చమురు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఉద్రిక్తతలు పెరిగితే బ్యారెల్ ముడి చమురు ధర 120 డాలర్లకు చేరవచ్చని నిపుణులు హెచ్చరించినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

చమురు ధరలపై ప్రభావం

బ్రెండ్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిందని దాదాపు అన్ని ప్రధాన అమెరికన్ మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొన్నాయి.

హార్ముజ్ జలసంధి ద్వారా సరుకు రవాణాకు ఆటంకాలు మరింత పెరిగితే ముడి చమురు ధర 120 డాలర్లు లేదా 150 డాలర్లకు కూడా చేరవచ్చని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లు 'అసోసియేటెడ్ ప్రెస్' వార్తా సంస్థ తెలిపింది.

హార్ముజ్ జలసంధిపై నియంత్రణ, నిర్వహణకు సంబంధించిన వివాదమే యుద్ధం ముగియడానికి ప్రధాన అడ్డంకిగా ఉందని 'ది వాషింగ్టన్ పోస్ట్' పేర్కొంది.

అమెరికా నౌకాదళంపై దాడి చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందనీ, దీనివల్ల మరిన్ని చమురు ట్యాంకర్లు ధ్వంసమవుతాయనీ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించినట్లు 'ఫాక్స్ న్యూస్' రిపోర్ట్ చేసింది.

ఇరాన్ నేవీని దిగ్బంధించడం, ఆర్థిక ఆంక్షలు-ఈ రెండూ అమెరికా వ్యూహంలో కలిసి ఉన్నాయని ఈ ఘర్షణకు హార్ముజ్ జలసంధి కేంద్ర బిందువుగా మారిందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.

డోనల్డ్ ట్రంప్, అమెరికా- ఇరాన్ యుద్ధం, తెహ్రాన్, హార్ముజ్ జలసంధి, ముడి చమురు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హూతీ రెబల్స్ సౌదీ అరేబియాలో చమురు రవాణా మార్గాలపై దాడులు చేస్తున్నారు

హూతీ- సౌదీ మధ్య దాడులు మరో సమస్య

యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియాల మధ్య జరుగుతున్న ఘర్షణను కూడా ఇరాన్-అమెరికా సంక్షోభంలో భాగమని మీడియా భావిస్తోంది.

సౌదీ అరేబియా ఇంధన మౌలిక సదుపాయాలపై హూతీల దాడులు, సౌదీ మద్దతున్న యెమెన్ ప్రభుత్వ దళాల ప్రతీకార దాడులు ఈ మీడియా కవరేజీలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి.

బాబ్ అల్-మందేబ్ మార్గం ద్వారా జరుగుతున్న చమురు రవాణాకు హూతీల దాడులు పెద్ద ముప్పుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

ప్రపంచంలోని రెండు వ్యూహాత్మక ఇంధన రవాణా మార్గాలైన 'హార్ముజ్ జలసంధి' 'బాబ్ అల్-మందేబ్'పై పొంచి ఉన్న ముప్పుపైనే ప్రస్తుతం యుద్ధ వార్తల కవరేజ్ అంతా కేంద్రీకృతమైంది.

డోనల్డ్ ట్రంప్, అమెరికా- ఇరాన్ యుద్ధం, తెహ్రాన్, హార్ముజ్ జలసంధి, ముడి చమురు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోందని ట్రంప్ సన్నిహితులు భావిస్తున్నారు.

భిన్న వాదనలు

ఇరాన్ మునుపెన్నడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటోందని ట్రంప్‌కు సన్నిహితంగా ఉండే మీడియా సంస్థలు భావిస్తున్నాయి. తెహ్రాన్ సైనిక శక్తి, ఆర్థిక పునాది బలహీనపడ్డాయని అవి అంచనా వేస్తున్నాయి.

ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో అమెరికా నౌకలపై ఇరాన్ దాడులు చేయడం అనేది తెహ్రాన్ అసహనానికి సంకేతమని ట్రంప్ అనుకూల మీడియా సంస్థల అభిప్రాయం.

ఆయితే ఈ అభిప్రాయానికి భిన్నంగా 'ది న్యూయార్క్ టైమ్స్' 'వాషింగ్టన్ పోస్ట్' సీఎన్ఎన్' వంటి సంస్థలు మాత్రం అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టాన్ని కలిగించే సామర్థ్యం ఇరాన్‌కు ఇంకా ఉందని నమ్ముతున్నాయి.

అలాగే అమెరికా అనుసరిస్తున్న 'ఒత్తిడి పెంచే విధానం' విధానం వల్ల ఉద్రిక్తతలు పెరుగుతాయే తప్ప, ఇరాన్ లొంగిపోదని భావిస్తున్నాయి.

ఈ కారణంగానే ఈ యుద్ధం 2029 వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తూ 'వాల్ స్ట్రీట్ జర్నల్' రాసిన కథనానికి విస్తృత ప్రచారం లభించింది.

మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని అమెరికా ప్రభుత్వంలోని కొన్ని విభాగాలు కేవలం స్వల్పకాలిక సంక్షోభంగా మాత్రమే చూడటం లేదని ఈ కథనం సూచిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)