సముద్రంలో బోల్తాపడిన పడవ కింద అన్నయ్య చనిపోయాడు, కజిన్ కళ్లెదుటే కొట్టుకుపోయాడు.. అయినా 15 ఏళ్ల ఆ బాలుడు రెండురోజులపాటు సముద్రంలో ఎలా ఉండగలిగాడంటే..

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, గ్రేస్ ఎలిజా గుడ్‌విన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
అలాస్కాలోని బేరింగ్ సముద్రంలోని శీతలజలాల్లో బోల్తా పడిన పడవపై రెండు రోజుల పాటు గడిపిన 15 ఏళ్ల బాలుడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.
డెరెక్ పార్కర్ అఘ్నాంగా అనే ఈ బాలుడు పడవ ప్రమాదంలో తన అన్నయ్యను, మరో కజిన్‌ను కోల్పోయాడు.
ఈ ముగ్గురూ సెప్టెంబర్ 4న సెయింట్ లారెన్స్ ద్వీపం నుంచి బయలుదేరారని, ఆదివారం మధ్యాహ్నానికి తిరిగి రావాల్సి ఉందని అమెరికన్ కోస్ట్ గార్డ్ తెలిపింది.
అయితే వాళ్లు వెళ్లిన 18 అడుగుల పొడవైన పడవ తిరిగి రాకపోవడంతో కోస్ట్ గార్డ్స్ గాలింపు చర్యలు ప్రారంభించారు.
బోల్తా పడిన పడవపై కూర్చుని ఉన్న బాలుడిని సోమవారం ఉదయం కోస్ట్ గార్డ్ విమాన సిబ్బంది గుర్తించారు.

సమీపంలో ఉన్న ఒక రెస్క్యూ పడవ (గుడ్ సమరిటన్ వెసెల్) అతనిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.
అదే పడవ అతని ఇద్దరు బంధువుల మృతదేహాలను కూడా వెలికితీసింది.
"ఈ ఇద్దరు నావికులను కోల్పోవడం అత్యంత విషాదకరం. వారి కుటుంబాలకు, స్నేహితులకు మా సానుభూతి తెలియజేస్తున్నాం" అని కోస్ట్ గార్డ్ ఆర్కిటిక్ డిస్ట్రిక్ట్ కమాండర్ రియర్ అడ్మిరల్ బాబ్ లిటిల్ అన్నారు.
చీకటిలో, గడ్డకట్టే చలిలో..
బాలుడిని రక్షించిన సమయంలో అతనికికి 'హైపోథెర్మియా' (తీవ్రమైన చలి వల్ల శరీరం గడ్డకట్టే పరిస్థితి) లక్షణాలు ఉన్నాయని యూఎస్ కోస్ట్‌గార్డ్ తెలిపింది.
ఆ టీనేజర్ ఘోరమైన చీకటిలో, దాదాపు పదిడిగ్రీల సెల్సియస్ ఉన్న చల్లని నీటిలో పడవను పట్టుకుని వేలాడుతూ గడిపాడని డెరెక్ పార్కర్‌ను రక్షించిన చేపల పడవ కెప్టెన్ స్థానిక మీడియా సంస్థతో చెప్పారు.
"అతను మొండి ధైర్యంగల పిల్లాడు" అని కెప్టెన్ ఆడమ్ వైట్ కేటీయూయూ టీవీతో అన్నారు.
"చలికి పళ్లు జివ్వుమంటున్నా, తన అన్నయ్య ఇంకా పడవ కిందే ఉండిపోయాడని అతను మాకు చెప్పాడు. అలాగే తమతో వచ్చిన కజిన్ రెస్క్యూకి ముందు రోజు రాత్రి నీటిలో కొట్టుకుపోయినట్టు తెలిపాడని" వైట్ వివరించారు.

ఫొటో సోర్స్, facebook.com/vina.kulowiyi
పడవ బోల్తా పడటంతో డెరెక్ పార్కర్ సముద్రంలో ఆహారం, నీరు లేకుండా రెండు రోజుల పాటు గడపాల్సి వచ్చిందని బాలుడి తల్లి ఫేస్‌బుక్‌లో రాశారు. తన కుమారులు తమకు ఇష్టమైన పనిని చేస్తున్నారని తల్లి వీనా కులోవియి చెప్పారు. సావూంగా ప్రాంతంలోని స్థానిక దుకాణాల్లో మాంసం అందుబాటులో ఉండని తమ సమాజంలోని ప్రజల కోసం వారు చేపలు పట్టేవారని చెప్పారు.
అలాస్కా తీరంలోని సెయింట్ లారెన్స్ ద్వీపంలో ఉన్న సవూంగా గ్రామంలో దాదాపు 800 మంది నివసిస్తున్నారు.
ఇక్కడ ప్రధానంగా సైబీరియన్ యుపిక్ ప్రజలు ఉంటారు. ఇంగ్లీష్, సెయింట్ లారెన్స్ ఐలాండ్ యుపిక్ ఇక్కడి ముఖ్య భాషలు.
"నా పిల్లలు ఇతరులకు సాయం చేసేలా పెరిగారు. ఇది మాకు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. మేము వేటాడినదాన్ని ఇతర కుటుంబాలకు అందిస్తాం. మిగతా వారితో పంచుకుంటాం" అని కులోవియి ఫేస్‌బుక్‌లో రాశారు.
ప్రస్తుతం ప్రాణాలతో బయటపడిన తన కుమారుడు ఇంట్లో కోలుకుంటున్నట్లు కులోవియి తెలిపారు.
"నా కుమారుడు ప్రాణాలతో తిరిగి వచ్చాడు. అతని కథ అద్భుతమైనది. ఆ సమయంలో అతను అస్సలు భయపడలేదు. అంతసేపూ దేవుడిని ప్రార్థిస్తూనే కూర్చున్నాడు" అని ఆమె తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























