‘వందల మంది చనిపోయారు, పిల్లలు సహా పారిపోయి వచ్చాం’.. హూతీల చేతుల్లోకి మోఖా వెళ్లాక అక్కడి ప్రజలు ఏం చెబుతున్నారంటే

ఫొటో సోర్స్, AL MASIRAH/Handout via REUTERS
- రచయిత, డేవిడ్ గ్రిటెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
యెమెన్‌లో ఇరాన్ అనుకూల హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్ర తీర పట్టణం మోఖాను తమ అధీనంలోకి తీసుకున్నట్లు మిలటరీ వర్గాలు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
వ్యూహాత్మకంగా కీలకమైన ఈ పోర్టు.. సౌదీ మద్దతు గల ప్రభుత్వ బలగాల నియంత్రణలో ఉండేది. మోఖాను చేజిక్కించుకోవడంతో బాబ్ అల్ మండెబ్ జలసంధికి కేవలం 75 కిలోమీటర్ల దూరంలోకి ఈ ఇరాన్ అనుకూల గ్రూప్ రాగలిగింది.
ఆసియా, ఐరోపాలను కలిపే వాణిజ్య మార్గానికి బాబ్ అల్ మండెబ్ దక్షిణ ద్వారంగా ఉంది. అయితే, అంతర్జాతీయ నౌకాయానానికి తమ నుంచి ఎలాంటి ముప్పు ఉండబోదని హూతీలు చెప్పారు. తమ లక్ష్యం సౌదీ అరేబియా నౌకలే అని స్పష్టం చేశారు.
ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా గల్ఫ్‌లో హార్ముజ్ జలసంధి మూతబడిన తర్వాత చమురు ఎగుమతుల కోసం సౌదీ అరేబియా ఎర్ర సముద్రంపైనే ఆధారపడుతోంది.
సౌదీ అరేబియా, యెమెన్ ప్రభుత్వం, హూతీల మధ్య ఘర్షణలు ముదిరి చమురు ధరలు భారీగా పెరిగేందుకు దారితీశాయి.

వారం కిందట, యెమెన్‌లోని నైరుతి ప్రాంతాల్లో హూతీలు చేసిన భీకర దాడిలో వందల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఈ దాడి తరువాత వేలాది మంది నిరాశ్రయులైనట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి సైతం ప్రభుత్వ బలగాలకు అనుకూలంగా పశ్చిమ యెమెన్‌లోని హూతీ నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది.
మరోవైపు, దక్షిణ సౌదీ అరేబియాలోని నగరాలు, చమురు స్థావరాలపై క్షిపణి, డ్రోన్ దాడులతో హూతీలు విరుచుకుపడ్డారు.
ఇరాన్‌కి వ్యూహాత్మక ప్రయోజనం?
మోఖా ఓడరేవును స్వాధీనపరచుకున్న అనంతరం, బాబ్ అల్ మండెబ్ దిశగా హూతీలు ముందుకు సాగుతున్నారు. అది అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి కీలక జలమార్గం. యెమెన్‌కి దక్షిణాన ఉంది.
మోఖా హూతీల చేతుల్లోకి వెళ్లడం సౌదీ అరేబియాకు, దాని మిత్రపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ. ప్రపంచ ఇంధన ధరలపై ఒత్తిడి కొనసాగించాలని ప్రయత్నిస్తున్న ఇరాన్‌కు ఈ ఘటనతో ఉపశమనం లభించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లకి బాబ్ అల్ మండెబ్ అనుసంధానంగా ఉంది. ప్రపంచ కార్గో (నౌకా వాణిజ్యం)లో 12 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ చమురు సరఫరా కోసం బాబ్ అల్ మండెబ్‌కి ప్రాముఖ్యత పెరిగింది.

మరోసారి అంతర్యుద్ధం..
మోఖాలో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న యెమెన్ ప్రభుత్వం, హూతీల మధ్య కొన్ని రోజులుగా భీకర ఘర్షణలు జరుగుతున్నాయి.
ఈ చారిత్రక ఓడరేవు పట్టణాన్ని హూతీలు చేజిక్కించుకున్న తర్వాత బ్రెంట్ (అంతర్జాతీయ బెంచ్‌మార్క్ చమురు) ధర బ్యారెల్‌కి 105 డాలర్లకు ఎగబాకింది.
ఐరోపా, మిడిల్ ఈస్ట్‌లోని కాఫీ ట్రేడర్లకు ఒకప్పుడు ప్రధాన కేంద్రంగా ఉన్న మోఖా నుంచి యెమెన్ ప్రభుత్వ అనుకూల బలగాలను తరిమేసి, దానిని హూతీలు గురువారం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రోజుల తరబడి జరిగిన భీకర దాడిలో హూతీ తిరుగుబాటుదారులకు విజయం లభించింది. ఇది.. దశాబ్దకాలంగా జరుగుతున్న అంతర్యుద్ధాన్ని మళ్లీ రగిల్చింది. సౌదీ ట్యాంకర్లపై దాడి చేసి, బాబ్ అల్ మండెబ్ గుండా నౌకాయానానికి అంతరాయం కలిగించిన అనంతరం, సౌదీ పోర్టులను దిగ్బంధించినట్లు ఈ ఏడాది జులైలో హూతీలు ప్రకటించారు.
రోడ్లపైనే క్షతగాత్రులు
సౌదీ మద్దతు గల యెమెన్ ప్రభుత్వ బలగాలతో భీకర పోరు అనంతరం బుధవారం రాత్రి హూతీ ఫైటర్లు పట్టణంలోకి ప్రవేశించినట్లు మోఖా నివాసితులు తెలిపారు. పర్యవసానంగా, అనేక కుటుంబాలు బలవంతంగా తమ ఇళ్లు ఖాళీ చేసి పారిపోవాల్సి వచ్చిందని చెప్పారు.
"ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే మోఖాను ముట్టడించారు. ఈ ప్రాంతాన్ని భయం కమ్మేసింది. ప్రజలు బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. పరిస్థితి దారుణంగా ఉంది. క్షతగాత్రులు రోడ్లపైనే పడి ఉన్నారు. వారికి సహాయం చేయడానికి ఎవరూ లేరు" అని ఓ వ్యక్తి బీబీసీతో తన అనుభవాలను పంచుకున్నారు.
మోఖాలో గురువారం నాడు ప్రభుత్వ కార్యాలయాలు, షాపులు మూతబడి ఉన్నాయని, పట్టణ వీధుల్లో హూతీలు పహారా కాస్తున్నారని మరో వ్యక్తి తెలిపారు.
"అన్సార్ అల్లా (గ్రూప్ అధికారిక పేరు) ఏమి చేయబోతున్నారో తెలియడం లేదు. ప్రతి ఒక్కరూ తమ భద్రత పట్ల ఆందోళనగా ఉన్నారు" అని ఆయన చెప్పారు.
నిరాశ్రయులైన అనేక కుటుంబాలు తూర్పు వైపుగా.. యెమెన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్ కౌన్సిల్, ప్రభుత్వం ఉన్న ఏడెన్ నగరానికి తరలివెళ్తున్నాయి.
"మా పిల్లలను తీసుకొని పారిపోయి వచ్చాం. ఇంకా పరిగెడుతూనే ఉన్నాం. మాకు గది లేదు. ఇళ్లు లేదు. ఏమీ లేదు. ఒక్క గంటలో మొత్తం ఛిద్రమైపోయింది. వారు మాకు ఎలాంటి హెచ్చరిక గానీ, అవకాశం గానీ ఇవ్వలేదు." అని ఓ మహిళ తెలిపారు.
"మమ్మల్ని మేము కాపాడుకునేందుకు ఎలాంటి మార్గం లేని మహిళలం. మాతో పాటు పసి పిల్లలు కూడా ఉన్నారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మోఖాను ముట్టడించడాన్ని హూతీలు వెంటనే నిర్ధరించలేదు. అయితే, హూతీల నిర్వహణలో ఉన్న అల్-మసిరా టీవీ ప్రకారం, సౌదీ శత్రు బలగాల మోహరింపును తిప్పికొట్టిన తర్వాత పశ్చిమ తీర జిల్లాలలో ఘర్షణలు నిలిచిపోయాయని ఆ గ్రూప్ సుప్రీమ్ పొలిటికల్ కౌన్సిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఫొటో సోర్స్, @SPA
యెమెన్ ప్రభుత్వం, హూతీలు ఏమంటున్నారు?
ప్రభుత్వ అనుకూల జాతీయ ప్రతిఘటన దళాల (నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్) నాయకుడు తారిఖ్ సలాహ్ కూడా పశ్చిమ తీరంలో ఉన్న తన కమాండ్ సెంటర్‌ను ఒక 'సురక్షిత ప్రాంతానికి' మార్చినట్లు తెలిపారు.
ఇరాన్ మద్దతుతో హూతీలు చేసిన ప్రణాళికాబద్ధమైన దాడిని ఎదుర్కోవడంలో ఇటీవలి రోజుల్లో తమ దళాలు భారీ మూల్యాన్ని చెల్లించాయని ఆయన చెప్పారు.
ఎర్ర సముద్రంలో ఉన్న జుకర్ ద్వీపాన్ని హూతీ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నట్లు ఒక యెమెన్ సైనిక వర్గం ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు వెల్లడించింది.
మోఖాకు సుమారు 80 కిలోమీటర్ల వాయువ్యంగా ఉన్న ఈ ప్రాంతంపై, హూతీలు భారీగా రాకెట్ దాడులు చేసి, అనంతరం పడవల ద్వారా వచ్చి భూభాగాన్ని ఆక్రమించారు.
ఈ క్రమంలోనే, యెమెన్ తీరప్రాంతాలను రక్షించి, ప్రభుత్వ నియంత్రణను పునరుద్ధరించాలని అరబ్ సహా ఇతర దేశాలను ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు రషద్ అల్-అలీమీ కోరారు.
"యెమెన్‌పై మాకు హక్కు ఉంది"
యెమెన్ సార్వభౌమత్వాన్ని, దాని ప్రాదేశిక జలాలను రక్షించుకునే హక్కు తమకు ముమ్మాటికీ ఉందని హూతీ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ చెప్పింది. అదేసమయంలో, ఎర్రసముద్రంలో నౌకాయానం సురక్షితంగా ఉంటుందని అంతర్జాతీయ సమాజానికి హామీ ఇచ్చింది.
అయితే, సౌదీ నౌకలపై నిషేధం మాత్రం అలాగే కొనసాగుతుందని హూతీల ఆధ్వర్యంలోని మానవతా సహాయ ఆపరేషన్ల సమన్వయ కేంద్రం స్పష్టం చేసింది.
గత 24 గంటల్లో తైజ్, హొదైదా, మారిబ్, జౌఫ్ పశ్చిమ ప్రావిన్సులపై సౌదీ యుద్ధ విమానాలు 64 వైమానిక దాడులకు పాల్పడినట్లు హూతీ సైనిక ప్రతినిధి యహ్యా సరేయా తెలిపారు. దీనిపై సౌదీ మిలటరీ నుంచి వెంటనే ఎలాంటి స్పందన రాలేదు.
అయితే, నైరుతి సౌదీ నగరాలైన ఖమిస్ ముషైత్, అబ్హా, జిజాన్ నగరాలపై హూతీల డ్రోన్, క్షిపణి దాడుల పట్ల కచ్చితంగా ప్రతిస్పందిస్తామని యెమెన్‌లో హూతీలను ఢీకొంటున్న సౌదీ నేతృత్వంలోని అరబ్ కూటమికి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు.
సౌదీ అధికారుల సమాచారం ప్రకారం, మంగళవారం నాడు హూతీలు దక్షిణ సౌదీ అరేబియాపైకి డజన్ల కొద్దీ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడిలో 73 మంది పౌరులు గాయపడ్డారు. అనేక చమురు సంస్థలలో మంటలు చెలరేగి, అక్కడి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది.
ఇటీవలి రోజుల్లో తమ నియంత్రణలో ఉన్న భూభాగాలపై సౌదీ జరిపిన డజన్ల కొద్దీ వైమానిక దాడులకు ప్రతీకారంగానే తాము దాడులు చేస్తున్నట్లు హూతీలు తెలిపారు. సోమవారం జౌఫ్ ప్రావిన్సులోని హజ్మ్ పట్టణంలో ఉన్న ఒక జైలుపై జరిగిన దాడిలో కనీసం 23 మంది పౌరులు మరణించారని వారు పేర్కొన్నారు.
యెమెన్‌లో దశాబ్ద కాలానికి పైగా జరుగుతున్న భీకర అంతర్యుద్ధంలో హూతీలకు వ్యతిరేకంగా యెమెన్ ప్రభుత్వానికి సౌదీ నేతృత్వంలోని కూటమి మద్దతుగా నిలుస్తోంది.
సౌదీ అరేబియాపై హూతీలు "నావిక దిగ్బంధనం" ప్రకటించి, సౌదీ విమానాశ్రయాలు, చమురు కేంద్రాలు, ఎర్ర సముద్రంలోని ట్యాంకర్లపై క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడటంతో.. నాలుగేళ్ల అనధికారిక కాల్పుల విరమణ ఒప్పందం జులై నుంచి బలహీనపడుతూ వస్తోంది.
తమ భూభాగంలోని ఓడరేవులు, విమానాశ్రయాలను దిగ్బంధించడంతో పాటు సనా విమానాశ్రయంపై సౌదీ జరిపిన వైమానిక దాడికి ప్రతిచర్యగానే తాము ఈ దాడులు చేస్తున్నట్లు హూతీలు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























