‘ఆర్మీ ఆయుధాగారం నుంచి తుపాకులు దొంగిలించాడు.. ఊళ్లో గడ్డివాము దగ్గర భూమిలో పాతిపెట్టాడు’.. భార్య ద్వారా గుట్టు బయటకు లాగిన పోలీసులు

సికింద్రాబాద్ కంటోన్మెంట్, 20వ మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు

ఫొటో సోర్స్, Telangana police

ఫొటో క్యాప్షన్, నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 20వ మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. గతంలో ఆర్మీలో పనిచేసిన మల్లేశ్ అనే వ్యక్తి.. ఆయుధాలను చోరీ చేసినట్లుగా గుర్తించామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు.

''ఆయుధాలు చోరీ చేసి, ఇంటి ఆవరణలోని గడ్డి వాము వంటి ప్రాంతంలో మట్టి అంతా చదును చేసి పాతిపెట్టాడు'' అని డీజీపీ వివరించారు.

చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

దాదాపు పది రోజులపాటు అటు ఆర్మీ, ఇటు తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేసి, కేసులో పురోగతి సాధించారు. మరోవైపు, చోరీ ఘటన వ్యవహారంపై ఆర్మీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆయుధాల చోరీ ఎలా బయటపడిందంటే..

ఆగస్టు 30వ తేదీ రాత్రి తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని 20 మద్రాసు రెజిమెంట్‌కు చెందిన ఆయుధాగారం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీకి గురయ్యాయి.

ఆగస్టు 31న ఉదయం ఆయుధాగారం ఇన్‌ఛార్జి వినోద్ కుమార్ చోరీ విషయాన్ని గుర్తించి రెజిమెంట్ అధికారులకు సమాచారం అందించారు.

ఈ మేరకు ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ మయాంక్ గోవిత్రికర్ ఫిర్యాదు చేశారు. ఘటనపై బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లుగా డీజీపీ సీవీ ఆనంద్ సెప్టెంబరు 11న మీడియా సమావేశంలో వెల్లడించారు.

''ఆయుధాగారం(కోటే) నుంచి ఏడు పిస్టల్స్, 13 మ్యాగజైన్స్, నాలుగు ఏకే 203 తుపాకులు - 5 మ్యాగజైన్స్, 5.56 ఎంఎం ఇన్సాస్ తుపాకీ- మూడు మ్యాగజైన్స్, నైట్ విజన్ బైనాక్యులర్ దొంగిలించారు. మరో భవనం నుంచి మందుగుండు సామగ్రి, బుల్లెట్లు చోరీ చేశారు. ఇదంతా ఆగస్టు 30వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 4.30 మధ్య జరిగింది'' అని డీజీపీ చెప్పారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్, 20వ మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు

ఫొటో సోర్స్, Telangana police

ఫొటో క్యాప్షన్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 20వ మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ మీడియాకు వివరించారు.

8.5 లక్షల ఫోన్ నంబర్ల కాల్ డాటా పరిశీలన

కేసు తీవ్రత నేపథ్యంలో మల్కాజిగిరి పోలీసులు, ఎస్వోటీ, మిలిటరీ ఇంటెలిజెన్స్, హైదరాబాద్ సిటీ పోలీసు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారని సీవీ ఆనంద్ చెప్పారు.

''ఆయుధాగారం వద్దకు అనుమతి ఉన్న పది మందిని గుర్తించాం. రెండో భవనంలోకి వచ్చి వెళ్లేందుకు మరో ఆరుగురికి అనుమతి ఉందని గుర్తించాం. ఈ 16 మందితో పాటు మరో ఏడుగురు సభ్యుల ఆర్మీ బృందానికి అనుమతి ఉంది. ఏడుగురు హౌస్ కీపింగ్ స్టాఫ్ వస్తుంటారని తేల్చాం. వీరితో పాటు ఆర్మీలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శిక్షలు ఎదుర్కొంటున్న 34 మందిని గుర్తించాం. మిలిటరీ ఇంటెలిజెన్స్ సమాచారంతో సెలవుపై వెళ్లిన 54 మంది, సర్వీసులో క్రమశిక్షణరాహిత్యం, ఆరోగ్యపరమైన కారణాలతో తొలగింపునకు గురైన ఏడుగురిని గుర్తించి విచారించాం'' అని డీజీపీ చెప్పారు.

అలాగే కేసు దర్యాప్తులో భాగంగా 8.5 లక్షల మొబైల్ నంబర్లను గుర్తించి, వారం రోజులపాటు కాల్ డాటా విశ్లేషించినట్లుగా పోలీసులు చెప్పారు. అయినప్పటికీ విచారణ కొలిక్కి రాకపోవడంతో టెక్నికల్, ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్, సీసీ కెమెరా, డాగ్ స్క్వాడ్.. ఇలా సమగ్ర కోణాల్లో విచారణ చేపట్టినట్లుగా పోలీసులు చెప్పారు.

‘చెమటలు పట్టాయి, పొంతన లేని సమాధానాలు వచ్చాయి’

పలు కారణాలతో సర్వీసు నుంచి తొలగించిన ఏడుగురిలో ఇద్దరిపై అనుమానం కలిగిందని డీజీపీ చెప్పారు.

వారిలో ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి ఒకరు కాగా, మరొకరు తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం జంగారెడ్డిపల్లికి చెందిన ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజు అని డీజీపీ వివరించారు.

''మల్లేశ్‌ను ఈ ఏడాది జూన్ 30న ఆరోగ్యం, క్రమశిక్షణా రాహిత్యం వంటి కారణాలతో సర్వీసు నుంచి ఆర్మీ అధికారులు తొలగించారు. ఇతనికి సుమారు 16 ఏళ్ల సర్వీసు ఉంది. అతను ప్రస్తుతం కంటోన్మెంట్ బాలాజీనగర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు'' అని వివరించారు.

''మల్లేశ్‌కు సంబంధించి ఫోన్ లోకేషన్ డాటా విశ్లేషించినప్పుడు కదలికలపై అనుమానం వచ్చింది. సెప్టెంబరు ఏడో తేదీన టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ పోలీసులు నాగర్ కర్నూలు జిల్లాకు వెళ్లి ప్రశ్నించారు. ఆయన పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. ప్రశ్నలు అడిగినప్పుడు చెమటలు పట్టడం, సమాధానాలు చెప్పేటప్పుడు తడబడటం చూసి మా అనుమానం బలపడింది'' అని డీజీపీ చెప్పారు.

అలాగే ఫోన్ లోకేషన్ వివరాలను పోలీసులు సేకరించారని, విచారణ సందర్భంలో ఆయన తన కదలికల వివరాలు చెప్పకుండా దాచిపెట్టినట్లుగా గుర్తించామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

''సెప్టెంబరు 8, 9 తేదీల్లో విచారణకు రావాలని పిలిచినా రాలేదు. పోలీసులు కేసు తీవ్రతను ఆయన మామ, భార్యకు వివరించారు. వారు సముదాయించి పదో తేదీ తీసుకువస్తామని చెప్పారు. వచ్చే దారిలో భార్య గట్టిగా ప్రశ్నించడంతో నేరం అంగీకరించారు. మల్లేశ్ మామ ఇచ్చిన సమాచారంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నాం'' అని చెప్పారు సీవీ ఆనంద్.

ఈ వ్యవహారంలో మల్లేశ్ భార్య, ఇతర కుటుంబసభ్యులను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది. వారు స్పందించగానే ఇక్కడ అప్‌డేట్ చేస్తాం. అలాగే ఆర్మీ అధికారులను బీబీసీ సంప్రదించింది. వారి స్పందన రాగానే అప్‌డేట్ చేస్తాం.

సికింద్రాబాద్ కంటోన్మెంట్, 20వ మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు

ఫొటో సోర్స్, Telangana police

ఆ రోజు రాత్రి చోరీ ఎలా చేశారంటే…

ఆగస్టు 30వ తేదీ రాత్రి 11 గంటలకు బాలాజీనగర్ నుంచి 20-మద్రాసు రెజిమెంట్ ఆయుధాగారం వద్దకు మల్లేశ్ వచ్చినట్లుగా గుర్తించామని పోలీసులు చెప్పారు.

అంతకుముందు ఆగస్టు 28, 29 తేదీల్లో రెక్కీ నిర్వహించినట్లుగా విచారణలో తేలిందన్నారు.

''మొదట ఒక బిల్డింగు(కోటే) తాళం పగులగొట్టి తుపాకులు, పిస్టళ్లు, వాటి మ్యాగజైన్లు దొంగిలించి చీకటి ప్రదేశంలో పెట్టాడు. తర్వాత మరో భవనంలో మందుగుండు సామగ్రి నిల్వ ఉన్న ప్రాంతానికి చేరుకుని గంటపాటు ప్రయత్నించి తాళం పగలగొట్టి లోనికి వెళ్లాడు. ఆ సమయంలో గార్డుకు శబ్దం వచ్చి చూసినా, చీకటి కారణంగా ఏమీ కనిపించలేదు. అనంతరం, చోరీ చేసిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి మోటారు సైకిల్‌పై తీసుకెళ్లి రెండు కిలోమీటర్ల దూరంలోని ఒక ఆలయం వద్ద ఉంచి, తిరిగి మళ్లీ రెజిమెంట్ వద్దకు చేరుకున్నాడు మల్లేశ్ '' అని డీజీపీ వివరించారు.

రెండోసారి వెళ్లినప్పుడు గేటు వద్ద సెక్యూరిటీ గార్డు ఆపి అడిగితే, '20-మద్రాస్ రెజిమెంట్' అని చెప్పేసరికి వదిలేశారని విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.

'రెండోసారి వెళ్లినప్పుడు 'మ్యాగజైన్ కవర్' తీసుకుని ఇంటికి వచ్చి, కారులో టెంపుల్ వద్దకు చేరుకుని ఆయుధాలన్నీ అందులోకి ఎక్కించినట్లు'గా విచారణలో మల్లేశ్ చెప్పారని డీజీపీ వివరించారు.

''తర్వాత బయల్దేరి సొంతూరు అచ్చంపేట చేరుకున్నాడు మల్లేశ్. జాతీయ రహదారిలో వెళితే టోల్ గేట్ల వద్ద సీసీ కెమెరాల్లో దొరికే అవకాశం ఉందని వేరే దారిలో వెళ్లాడు. ఈ క్రమంలో ప్రయాణికులను కూడా ఎక్కించుకుని తీసుకెళ్లి డబ్బులు తీసుకుని దించేశాడు'' అని చెప్పారు.

ఇంటికి చేరుకున్నాక గడ్డి వాము వంటి ప్రదేశంలో మట్టి తీసి ఆయుధాలు పాతిపెట్టాడని, ఐదారు రోజుల తర్వాత వేరొకచోటకు తీసుకెళ్లి, తిరిగి తీసుకువచ్చి మళ్లీ అక్కడే పెట్టాడని డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్, 20వ మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు

ఫొటో సోర్స్, Telangana police

ఎందుకు చోరీ చేశాడంటే…

ఆయుధాలు ఎందుకు చోరీ చేశాడనే కోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని డీజీపీ వివరించారు.

''ముఖ్యంగా ఆవేశంలో.. కోపంతో చేసిన పనిలా ఇది కనిపిస్తోంది. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తీసేశారనే ఉద్దేశంలో ఉన్నట్లుగా ఉంది. పూర్తి వివరాలు ఇంకా దర్యాప్తులో తెలియాల్సి ఉంది'' అని డీజీపీ చెప్పారు.

గతంలో మద్రాసు రెజిమెంట్‌లో అగ్నిప్రమాదం జరగడంతో రాత్రి సమయాల్లో లైట్లన్నీ ఆర్పివేస్తున్నారని, దానివల్ల ఆయుధాగారం, ఇతర భవనాల వద్ద చీకటిగా ఉంటోందని విచారణలో తేలిందని డీజీపీ ఆనంద్ వివరించారు.

దేశ రక్షణ శాఖ పరిధిలోని విషయం కావడంతో కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు ప్రక్రియను ఆర్మీ అధికారులతో కలిసి చేయనున్నామని వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)