ఎర్రన్నాయుడు నుంచి రేవంత్ రెడ్డి వరకు.. సోషల్ మీడియాలో 80ల వింటేజ్ లుక్ ట్రెండ్

ఫొటో సోర్స్, RamMNK/GopichandMalineni/RevnathReddy/x.com
- రచయిత, ఖగేష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ట్రెండ్ వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా 1980ల నాటి లుక్ ఫోటోలు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కనిపిస్తున్నాయి.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.
తమ లేటెస్ట్ ఫోటోలకు రెట్రో రూపాన్ని ఇచ్చి మురిసిపోతున్నారు. అంతేకాకుండా మరికొందరు తాము 80ల్లో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు.
దీంతో ఏఐతో జనరేట్ చేసిన ఫోటోలు ఒకవైపు, ఒరిజినల్ ఫోటోలు మరోవైపు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.
ఫోటో చాలా విలువైన జ్ఞాపకాలను అందిస్తుందని ప్రజలు భావిస్తారు. ప్రతి ఫోటో కూడా ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తుందంటారు.
అందుకే ఎంత వేగంగా మారుతున్నప్పటికీ ఫోటోకి ఉన్న విలువ తగ్గడం లేదు. కెమెరా కనిపెట్టినప్పటి నుంచి నేటి వరకు ఫోటోల ప్రాధాన్యం అలానే ఉంది.
ఫోటోలు తీసుకునే విధానంలో, వాటిని స్టోర్ చేసే విధానంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి.

నేడు 4K, HD ఫోటోలు బాగా పాపులర్ అయినప్పటికీ పాత ఫోటోలకూ అంతేస్థాయిలో ఆదరణ ఉంటోంది. అందుకే అప్పడుప్పుడు నోస్టాల్జియా అంటూ ఒక ట్రెండు లైమ్‌లైట్‌లోకి వస్తుంది. ఇప్పుడు కూడా అదే తరహాలో 1980 ఏఐ నోస్టాల్జియా పేరుతో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్స్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోటోలు తీసుకునే విధానం, వాటి ఎడిటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఏదో ఒక చోట నిలబడి ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పంచుకోవడం బోరింగ్‌గా ఉంటోందని కొందరి అభిప్రాయం. అందుకే కొత్తగా ఏదో చేయాలనే ఆలోచనతో ఇలాంటి ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు. అలాంటి కోవలోకే వస్తోంది ఈ 80ల ఏఐ ట్రెండ్.
1980ల నాటి ఫోటోగ్రఫీ ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటుంది. కెమెరా ఫిల్మ్, అనలాగ్ ఫోటోగ్రఫీ ఆనాటి స్పెషల్.
గ్రాన్యులర్ టెక్స్చర్, వార్మ్ కలర్ టోన్స్, నియాన్ లైటింగ్, డార్క్ బ్యాక్‌గ్రౌండ్స్, అప్పటి డ్రెస్సింగ్ స్టైల్స్ నేటి తరాన్ని ఆకట్టుకుంటున్నాయి.
అందుకే తాజా ఫోటోలను రెట్రోలుక్‌లోకి మార్చుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Twitter/Jadal Targaryen
మిడ్ జర్నీ లాంటి యాప్‌లను ఉపయోగించి 80s కాలం నాటి ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు.
వాటిని సోషల్ మీడియాలో రీల్స్, ఫోటో ఫార్మాట్‌లో షేర్ చేసుకుంటున్నారు.
నాటి సినిమా పోస్టర్లు, రోలర్ డిస్కో, క్లాసిక్ పాప్ స్టార్ లుక్స్‌లో తమను చూసుకొని నేటి తరం మురిసిపోతోంది.
ఈ ట్రెండ్‌లో కేవలం జెన్ జడ్ మాత్రమే లేదు. 70, 80, 90 కిడ్స్ కూడా భాగమైపోయారు. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ, క్రీడా సెలబ్రిటీల వరకు అందరూ తమ ఏఐ ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో సెలబ్రిటీల ఫొటోలను అభిమానులు తయారుచేసి షేర్ చేస్తున్నారు.
ఇప్పుడు ట్రెండ్ అవుతున్న 80s ఫోటోలను చూస్తే కచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ ఫోటో నిజంగానే 80 కాలం నాటిదా లేకుంటే ఏఐతో జనరేట్ చేసిందా అనేలా ఉంటున్నాయి. కేవలం కలర్స్, డ్రెస్సింగ్ స్టైల్‌ను మాత్రమే మార్చడం లేదు. నాటి హెయిర్ స్టైల్, ఆభరణాలు, చేతి గడియారాలు, బ్యాగ్‌లు సహా యాక్ససరీలు అన్నింటికి 80ల కాలపు హంగులు అద్దుతున్నారు.
లొకేషన్స్ విషయంలో కూడా నాటి కాల పరిస్థితులు స్పష్టంగా కనిపించేలా ప్రాంప్ట్‌లు వాడుతున్నారు. నాటి సైకిల్ స్టాండ్స్, నాటి రోడ్స్, కాలేజీలు, పాత సినిమాహాల్స్, సైన్ బోర్డులు, వీధులు, గోడలు అన్నింటిలో సహజత్వం ఉట్టిపడుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడు సోషల్ మీడియా బాగా షేర్ అవుతున్న సెలబ్రిటీస్ ఫోటోలు కొన్నింటిని వారే క్రియేట్ చేసుకుంటే మరికొన్నింటిని అభిమానులు క్రియేట్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Twitter/CongressSevadal
రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి క్రికెట్‌లో విరాట్ కోహ్లీ వరకు వివిధ సెలబ్రిటీలు 80ల కాలపు లుక్‌లో ఎలా ఉంటారనే ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా ట్రెండ్‌కు తగ్గట్టు 80ల ఏఐ ఫోటోను షేర్ చేశారు.
ఆయనతోపాటు మరో మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇదే బాటలో నడిచారు.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కూడా తను, తన పిల్లలతో కలిసి దిగిన లేటెస్ట్ ఫోటోలకు 80ల లుక్ అద్దారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తన తండ్రి రెట్రో లుక్ ఫోటోను షేర్ చేసి నా హీరో అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
చంద్రబాబు, లోకేష్‌తో దిగిన తాజా ఫోటోలను 80ల్లో దిగి ఉంటే ఎలా ఉండేదనే ఆలోచన టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోస్టాల్జియా ఫోటో కూడా వైరల్ అవుతోంది. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏఐ ఫోటోలను వీడియో రూపంలో కొందరు అభిమానులు షేర్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Twitter/Aditya Music Tamil
కొందరు సినిమా అభిమానులు టాలీవుడ్ నటులతో ఉన్న 80కాలానికి సంబంధించిన వీడియోను కూడా రూపొందించారు.
ఇర్ఫాన్ పఠాన్ లాంటి మాజీ క్రికెటర్స్, ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్స్ కూడా తమ 80ల లుక్స్ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఐపీఎల్‌కు చెందిన ఫ్రాంచైజీలు కూడా తమ జట్టులోని క్రికెటర్లకు 80 కాలం నాటి లుక్ జోడించారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరికొందరు నడుస్తున్న 80s ఏఐ ట్రెండ్‌కు సమాంతరంగ 80sఓజీ అంటూ తాము 80ల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు. బీజేపీకి చెందిన సునీల్ దేవ్‌ధర్ తన స్కూల్ సర్టిఫికెట్‌లోని ఫోటోను షేర్ చేసి, ఇది ఏఐ జనరేటెడ్ ఫోటోకాదు ఓజీ అంటూ కామెంట్ చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ట్రెండ్‌లో భాగమయ్యారు. తన 80s ఫోటోను పంచుకున్నారు.
ఈ ట్రెండ్‌ను కూడా ప్రత్యర్థులపై విమర్శలకు వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. కేరళ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియాలో ప్రధానమంత్రి మోదీని, బీజేపీ లీడర్లపై విమర్శనాత్మక పోస్ట్‌లు పెడుతోంది.
అయితే దీనికి కౌంటర్‌గా బీజేపీకి మద్దతు ఇచ్చే కొన్ని హ్యాండిల్స్ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలపై విమర్శనాత్మకమైన ఏఐ ఫోటోలతో పోస్ట్‌లు పెడుతున్నాయి.
ఇది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య కూడా ఇలాంటి సోషల్ మీడియా పోస్టుల ఫైట్ నడుస్తోంది.
ప్రత్యర్థి పార్టీల నాయకులను రాజకీయ అంశాలు, ఆరోపణలకు ముడిపెడుతూ 80ల లుక్ ఫోటోలు రూపొందించి తమతమ పార్టీల సోషల్ మీడియా హ్యాండిళ్లలో షేర్ చేస్తున్నారు.
‘ప్రైవసీ మర్చిపోవద్దు’
అయితే ట్రెండ్, వింటేజ్ లుక్ మోజులో పడి ప్రైవసీని మర్చిపోవద్దని కొందరు సూచిస్తున్నారు.
ఫోటోలు ఏఐ అప్లికేషన్లలో అప్లోడ్ చేసే ముందు.. ఆ యాప్‌లలో ప్రైవసీ నిబంధనలను ఒకటికి రెండుసార్లు చదివి ఫోటోలు అప్లోడ్ చేయాలో వద్దో నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























