రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు హెలికాప్టర్లు ఎందుకు నచ్చవు, ఆయన స్మార్ట్ ఫోన్ వాడకపోవడానికి కారణమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి భారత్‌కు వస్తున్నారు.
దిల్లీలోని భారత్ మండపంలో సెప్టెంబర్ 12నుంచి13వరకు బ్రిక్స్ సదస్సు జరగనుంది. నాలుగేళ్ల విరామం తర్వాత పుతిన్ గత డిసెంబర్‌లో ద్వైపాక్షిక సదస్సుకోసం భారత్ వచ్చారు.
ఈ పర్యటనలో అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య మరో ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం ఉందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు. పుతిన్ పర్యటనలో ఎప్పటిలాగే ఇరు దేశాలు ద్వైపాక్షిక అజెండాపై చర్చిస్తాయని పెస్కోవ్ చెప్పారు.
"మన సహకారం ముందుకు సాగకుండా అడ్డుకోవడానికి కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నందున చాలా విషయాలను బహిరంగంగా చర్చించలేం. అయితే వాటిపై గోప్యంగా, చాలా నిర్మాణాత్మకంగా చర్చలు జరుగుతాయి" అని కూడా పెస్కోవ్ చెప్పారు.
మరోవైపు పుతిన్ భద్రతపై మరోసారి చర్చ జరుగుతోంది.

పుతిన్ 2000 సంవత్సరం నుంచి అధికారంలో ఉన్నారు. సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ తర్వాత క్రెమ్లిన్‌లో ఎక్కువకాలం పదవిలో ఉంది పుతినే.
73 ఏళ్ల వయసులో ఆయన ఐదోసారి అధ్యక్షపదవిలో ఉన్నారు. ఆయన పాలనను వ్యతిరేకించే ప్రబలమైన శక్తి ఏదీ రష్యాలో లేదు. ఆయన కోరుకుంటే 2036 వరకు అధికారంలో కొనసాగగలరు.
పుతిన్‌కు భారీ భద్రత ఉంటుంది. వందలాది మంది భద్రతాసిబ్బంది 24 గంటలూ ఆయనతోనే ఉంటూ పరిసరాలను నిశితంగా గమనిస్తూ ఉంటారు.

ఫొటో సోర్స్, Getty Images
నాలుగంచెల భద్రత
పుతిన్ ఆహారాన్ని రహస్యంగా తయారు చేస్తారని, ఆయన తాగే ప్రతి పానీయాన్ని ముందుగా ఆయన అత్యంత సన్నిహిత సలహాదారులు తనిఖీ చేస్తారని బీబీసీ న్యూస్ రిపోర్ట్‌లో ఉంది.
కేజీబీ మాజీ అధికారి అయిన పుతిన్‌కు తన చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి బాగా తెలుసు. రష్యాలో అనేక భద్రతా సంస్థలు ఉన్నాయి. వాటిలో ఒక సంస్థ ప్రత్యేకంగా అధ్యక్షునికి, ఆయన కుటుంబానికి భద్రత కల్పించడానికే పనిచేస్తుంది. దీనిని రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ లేదా ఎస్‌బీపీ అని పిలుస్తారు.
ఇది రష్యా గూఢచార సంస్థ కేజీబీ నుంచి ఏర్పడిన రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్ఓ)కు రిపోర్ట్ చేస్తుంది. నల్ల సూట్లు ధరించి, చెవులకు ఇయర్‌ఫోన్లు పెట్టుకున్న ఎస్‌బీపీ గార్డులు 24గంటలూ పుతిన్‌తో పాటుంటారు.
"పుతిన్‌తో పాటు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఈ ఏజెంట్లు 4 బృందాలుగా విడిపోయి, 4 భద్రతా వలయాలుగా ఏర్పడతారు'' అని రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని మీడియా సంస్థ రష్యా బియాండ్ తెలిపింది.
ఇందులో మొదటి బృందం అధ్యక్షుడి సమీపంలో ఉంటుంది. ఇందులో ఆయన వ్యక్తిగత గార్డులు ఉంటారు.
రెండో వలయంలో ప్రజల దృష్టి పడకుండా ఉండేలా భద్రతా బృందాలను మోహరిస్తారు.
మూడో వలయంలో ఉండే బృందం అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తూ, వారు అధ్యక్షుడి వైపు రాకుండా అడ్డుకుంటుంది.
చివరిదైనా నాలుగో భద్రతా వలయంలో ఉండే గార్డులు పరిసరాలలో భవనాలపై మోహరిస్తారు.
రష్యన్ భద్రతా నిపుణుడు గలియోటి భద్రతా సమస్యలను విశ్లేషించే మాయక్ ఇంటెలిజెన్స్ అనే కన్సల్టింగ్ సంస్థకు డైరక్టర్‌గా ఉన్నారు.
"పుతిన్‌కు హెలికాప్టర్లు ఇష్టం ఉండవు. ఆయన సాధారణంగా చాలా పెద్ద నల్ల కార్లు, మోటార్ సైకిళ్లపై ఉండే భద్రతా సిబ్బందితో కూడిన భారీ కాన్వాయ్‌లో ప్రయాణిస్తారు. ఆయన ప్రయాణించే సమయంలో కొన్నిసార్లు డ్రోన్లు ఎగరడంపై ఆంక్షలు విధిస్తారు. ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు" అని బీబీసీ ముండోతో మార్క్ గలియోటి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అధ్యక్షుని 'వ్యక్తిగత సైన్యం'
రష్యన్ ప్రెసిడెన్షియల్ (ఎస్‌బీపీ)కి రష్యన్ నేషనల్ గార్డ్ లేదా రోస్‌గ్వార్డియా మద్దతుగా ఉంటుంది. కొందరు దీనిని అధ్యక్షుని "వ్యక్తిగత సైన్యం"గా పిలుస్తారు. దీని అధికారిక విధుల్లో రష్యా సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ప్రజా శాంతిభద్రతలను పరిరక్షించడం వంటివి ఉన్నప్పటికీ ఇది రష్యా సాయుధ దళాలకు భిన్నమైన సంస్థ.
వాస్తవానికి పుతిన్‌ను ప్రమాదాల నుంచి కాపాడటమే దీని అత్యంత ముఖ్యమైన పని.
"రష్యన్ నేషనల్ గార్డ్ చాలా వరకు పుతిన్ వ్యక్తిగత భద్రత అని అందరికీ తెలుసు" అని యూకేలోని బాత్ విశ్వవిద్యాలయంలో రష్యా విద్యావేత్త స్టీఫెన్ హాల్ బీబీసీ ముండోతో అన్నారు.
''అధ్యక్షుడు భద్రతాసంస్థల వలయంలో చాలా సురక్షితంగా ఉన్నారు'' అని ఆయన చెప్పారు.
నేషనల్ గార్డ్‌కు ప్రస్తుతం పుతిన్ మాజీ బాడీగార్డ్, అధ్యక్షునికి నమ్మకమైన సహచరునిగా భావించే విక్టర్ జోలోటోవ్ నాయకత్వం వహిస్తున్నారు.
ఇటీవలి సంవత్సరాలలో ఈ భద్రతా దళ సిబ్బంది సంఖ్యను దాదాపు నాలుగు లక్షల వరకు పెంచారు.
"ఇది చాలా పెద్ద సంఖ్య," అని హాల్ అంటారు. "అమెరికా అధ్యక్షుని భద్రతా విభాగంలోని గార్డుల సంఖ్య ఈ దరిదాపుల్లోకి కూడా రాదు" అని స్టీఫెన్ హాల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పుతిన్‌కు భద్రత ఎలా కల్పిస్తారు?
పుతిన్‌ను రక్షించడానికి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో, ఎంత మేరకు తీసుకుంటున్నారో తెలుసుకోవడం కష్టం. కానీ క్రెమ్లిన్, రష్యన్ భద్రతా నిపుణులు ఈ విషయంపై కొంత సమాచారం వెల్లడించారు.
పుతిన్ భద్రతా వర్గాలు అత్యంత కఠినమైన జాగ్రత్తలు తీసుకునే విషయం ఆయన ఆహారం. పుతిన్‌కు ఒక వ్యక్తిగత ఫుడ్‌టేస్టర్ ఉంటారు. విషప్రయోగం జరుగుతుందనే భయంతో అధ్యక్షుని వద్దకు వచ్చే ప్రతి ఆహార పదార్థాన్ని ఆయన ముందుగా పరీక్షిస్తారని మార్క్ గలియోటి చెప్పారు.
"దీన్ని ఆధునిక అధ్యక్షుని శైలి అనేకంటే కంటే మధ్యయుగపు చక్రవర్తిని తలపించే భద్రతావిధానంలో భాగమని చెప్పొచ్చు" అని ఆయన బీబీసీ ముండోతో అన్నారు.
పుతిన్ రష్యా వెలుపల పర్యటించేటప్పుడు అధ్యక్షుని బృందం ఆయన ఉపయోగించే ప్రతి వస్తువును తనిఖీ చేస్తుంది.
"పుతిన్ తినబోయే, తాగబోయే ఆహార పదార్థాలను ఆయన భద్రతా బృందమే తీసుకొస్తుంది. ఉదాహరణకు ఏదైనా అధికారిక కార్యక్రమంలో ఒకవేళ షాంపేన్ టోస్ట్ ఉంటే పుతిన్ ఇతర బాటిళ్ల నుంచి కాకుండా తన బృందం తెచ్చిన బాటిల్‌లోని షాంపేనే తాగుతారు'' అని గలియోటి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పుతిన్ స్మార్ట్‌ఫోన్ ఎందుకు వాడరు?
పుతిన్ భద్రతలో మరో కీలకమైన అంశం క్రెమ్లిన్ లోపల స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంపై నిషేధం. తాను స్మార్ట్‌ఫోన్ ఉపయోగిచనని రష్యా అధ్యక్షుడు స్వయంగా ధ్రువీకరించారు.
రష్యా వార్తా సంస్థ టాస్‌కు 2020లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పుతిన్ ఈ విషయం చెప్పారు. ఎవరితోనైనా మాట్లాడాల్సివస్తే లేదా సంప్రదించాల్సివస్తే అందుకోసం ఒక అధికారిక కమ్యూనికేషన్ లైన్ ఉందని ఆయన తెలిపారు.
ఆయన సలహాదారులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. పుతిన్‌కు 'సమయం లేకపోవడం' వల్లే ఆయన మొబైల్ ఫోన్ వాడరని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పలుమార్లు చెప్పారు.
అయితే పుతిన్‌కు ఇంటర్‌నెట్‌పై అసలు నమ్మకం లేకపోవడం వల్లే స్మార్ట్‌ఫోర్ వాడరనే ప్రచారం ఉంది. ఇంటర్‌నెట్‌ను ఒక "సీఐఏ ప్రాజెక్ట్" అని పుతిన్ గతంలో అభివర్ణించారు. గూగుల్ సెర్చ్‌ను ఉపయోగించవద్దని రష్యన్లను కోరారు. సమాచారం మొత్తాన్ని అమెరికా పర్యవేక్షిస్తుందని పుతిన్ భావిస్తారు.
"పుతిన్ ఇంటర్‌నెట్‌ను దాదాపుగా ఉపయోగించరు. ఆయనకు ఫోన్లు ఇష్టం ఉండవని అందరికీ తెలుసు. అది సరైనదే. భద్రత విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. పుతిన్ చెప్పింది అక్షరాలా నిజం. స్మార్ట్‌ఫోన్‌లు అంత సురక్షితమైనవి కావు" అని గలియోటి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పుతిన్‌కు కాగితపు ఫైళ్ల ద్వారా ఆయన ఆయన సలహాదారులు సమాచారం అందిస్తారని నిపుణులు చెబుతున్నారు.
"పుతిన్ తన రోజును మూడు భద్రతా సమావేశాలతో ప్రారంభిస్తారు. మొదటిది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించినది. రెండోది రష్యాలో జరిగే విషయాలు. రష్యాలో ఉన్నతవర్గాల్లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించినది మూడోది'' అని హాల్ చెప్పారు.
''పుతిన్‌కు ఇదే అత్యంత ముఖ్యమైన సమాచారం. ఈ సమాచారమే ఆయన రోజూవారీ కార్యక్రమాలను నిర్ణయిస్తాయి'' అని హాల్ చెప్పారు.
"నేను దౌత్యవేత్తలు, విదేశాంగశాఖ అధికారులతో మాట్లాడినవిషయం నాకు గుర్తుంది అని పుతిన్ అంటారు. వాళ్ల వద్ద ఉన్న సమాచారం సరైనది కాదని తన గూఢచార సంస్థలు భావిస్తే పుతిన్ కూడా అలాగే అనుకుంటారు. గూఢచార సంస్థలు చెప్పిందే సరైనదని, దౌత్యవేత్తలు చెప్పింది తప్పని పుతిన్ భావిస్తారని వాళ్లు నాతో చెప్పారు" అని హాల్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























