‘బీరులో బీ విటమిన్’.. ఏ రకంలో ఎంత ఉంటుందో చెప్పిన రీసెర్చర్స్

గ్లాస్ బీర్, ఆరోగ్య ప్రయోజనాలు, బీ6 విటమిన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 4 నిమిషాలు

అప్పుడప్పుడు ఒక గ్లాస్ బీర్ తాగడం వల్ల మెదడు పనితీరును మెరుగుపరిచే విటమిన్ బీ6 తగినంత స్థాయిలో అందుతుందని ఒక జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన చెబుతోంది.

విటమిన్ బీ6 మెదడు, రక్తం, రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది రకరకాల ఆహారాల్లో ఉంటుంది.

ఒక గ్లాస్ బీర్ తాగితే రోజుకు అవసరమయ్యే బీ6 విటమిన్‌లో 15 శాతం వరకు అందుతుందని, ఆల్కహాల్ లేని లాగర్ బీర్‌తోనూ ఇదే ఫలితం ఉంటుందని పరిశోధకులు చెప్పారు.

బీర్ తయారీలో వాడే బార్లీ, గోధుమలు, బ్రూవర్స్ ఈస్ట్ వంటి ముడి పదార్థాల్లో విటమిన్ బీ6 ఉంటుందని, బ్రూయింగ్ ప్రక్రియలో ఇది పూర్తిగా నశించదని పరిశోధన సూచిస్తోంది.

బీ6 అనేది మనం ఆహారం ద్వారా పొందాల్సిన ముఖ్యమైన పోషకం. మాంసం, చేపలు దీనికి మంచి వనరులు. ఇవే కాకుండా ఓట్స్, బంగాళదుంపలు, శనగల్లోనూ ఇది ఉంటుంది. చాలా బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్‌లో అదనంగా బీ6 కలుపుతారు.

శరీరంలో బీ6 లోపం ఏర్పడటం అరుదు. అయితే కొన్నిసార్లు దీని స్థాయిలు తగ్గొచ్చు. తరచుగా బీ12 వంటి ఇతర బి-విటమిన్ల లోపంతో కలిసి ఇది సంభవిస్తుంది. దీనివల్ల అలసట, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏ బీర్లలో ఎంతమేరకు ఉంది?

జర్మనీలోని స్థానిక సూపర్ మార్కెట్లలో కొనుగోలు చేసిన 65 రకాల బీర్లపై జరిపిన ఈ పరిశోధనలో తేలిన ముఖ్యాంశాలు ఇవే..

పరీక్షించిన అన్ని రకాల్లో బాక్ బీర్‌లోనే విటమిన్ బి6 ఎక్కువగా ఉంది. దీని తర్వాత లాగర్స్, డార్క్ లాగర్స్, వీట్ బీర్స్ (గోధుమ బీర్లు) మెరుగైన స్థానాల్లో నిలిచాయి.

బియ్యంతో తయారు చేసే బీర్లలో విటమిన్ బీ6 తక్కువగా ఉంది.

మద్యం తయారయ్యాక ఆల్కహాల్‌ను తొలగించిన బీర్లలోనే విటమిన్ బి6 స్థాయిలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తక్కువ ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేసే ఈస్ట్‌తో చేసే బీర్లలో ఈ విటమిన్ అంతగా లేదు.

రోజువారీ అవసరమయ్యే విటమిన్ బీ6 మోతాదులో లాగర్ బీర్ 20 శాతం అందించింది.

ఆల్కహాల్ లేని లాగర్ బీర్ అయితే ఏకంగా 59 శాతం వరకు విటమిన్ బీ6ను అందించినట్లు తేలింది.

బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, పురుషులకు రోజుకు 1.4 మిల్లీగ్రాములు, మహిళలకు 1.2 మిల్లీగ్రాములు విటమిన్ బీ6 అవసరం. ఒక లీటరు బీర్‌లో 0.3 మిల్లీగ్రాముల నుంచి 1 మిల్లీగ్రాముల వరకు ఈ విటమిన్ ఉండవచ్చని పరిశోధన సూచిస్తోంది.

పరిమితి లోపలే మద్యం తాగినా, బాటిళ్లపై 'విటమిన్ ఉంది' అని ప్రచారం చేసుకునేందుకు నియంత్రణ సంస్థలు అనుమతించవని అయితే, అందులో చెప్పుకోదగ్గ స్థాయిలో విటమిన్ ఉండటం మాత్రం నిజమేనని ప్రొఫెసర్ మైఖేల్ రిచ్లిక్ పేర్కొన్నారు.

తమ విటమిన్ స్థాయిలను మెరుగుపరుచుకోవాలనుకునే వినియోగదారులకు మాత్రమే ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని మైఖేల్ తెలిపారు.

పరీక్షించిన అన్ని రకాల బీర్లలో జర్మన్ బాక్ బీర్‌లో అత్యధికంగా బీ6 ఉంది. దీనికి కారణం అందులో ఉండే 6.5 శాతం ఆల్కహాల్ స్థాయి.

గ్లాస్ బీర్, ఆరోగ్య ప్రయోజనాలు, బీ6 విటమిన్

ఫొటో సోర్స్, Getty Images

నిపుణులు ఏమంటున్నారు?

విటమిన్ బీ6 చాలా ఆహారాల్లో లభిస్తుందని, యూకే ప్రజల్లో ఈ విటమిన్ స్థాయిలు తక్కువగా ఉండటం అరుదని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్‌కు చెందిన బ్రిడ్జెట్ బెనెలామ్ అన్నారు.

"బీర్ లేదా మరే ఇతర ఆల్కహాల్ పానీయాన్ని పోషకాలకు ప్రధాన వనరుగా చూడాలని మేం సూచించం. పోషకాలు అనేవి ఆహారం నుంచే అందాలి" అని ఆమె పేర్కొన్నారు.

"చాలా పరిమితమైన ఆహారం తీసుకుంటే తప్ప, బీ6 లోపం వచ్చే అవకాశం తక్కువ" అన్నారామె.

మద్యపాన వ్యసనం లేదా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ఉన్నవారు మాత్రమే దీనివల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని బెనెలామ్ చెప్పారు.

పాల ఉత్పత్తులు, జంతు సంబంధిత ఆహారాల్లో లభించే బీ12, రైబోఫ్లావిన్ (బీ2) వంటి ఇతర ముఖ్యమైన బి-విటమిన్లపై దృష్టి పెట్టాలని ఆమె సిఫార్సు చేస్తున్నారు.

"ఇవి జీవక్రియలో, శక్తిని విడుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి" అని బెనెలామ్ చెప్పారు.

వీగన్ ఆహారం తీసుకునే వారు ఈ విటమిన్లను పొందేందుకు, పోషకాలు అదనంగా కలిపిన పాలు, పెరుగు వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని ఆమె సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)