'నన్ను వాళ్లు చంపినా చంపొచ్చు.. అయినా, బంగ్లాదేశ్ వెళ్లాలనుకుంటున్నాను' అని షేక్ హసీనా ఎందుకు అన్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శుభజ్యోతి ఘోష్
- హోదా, బీబీసీ న్యూస్ బంగ్లా, దిల్లీ
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
షేక్ హసీనా గత రెండేళ్లుగా భారత్‌లోనే ఉంటున్నారు. తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డిసెంబర్‌లో బంగ్లాదేశ్ కోర్టులో లొంగిపోవాలనుకుంటున్నట్లు ఆమె చేసిన ప్రకటన అటు బంగ్లాదేశ్, ఇటు భారత్‌లోనూ చర్చనీయమైంది.
అయితే, ఆమె చేసిన ఈ ప్రకటనను 'నిజంగానే స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు తీసుకున్న కచ్చితమైన నిర్ణయం'గా కాకుండా స్థానిక పరిస్థితులను అంచనా వేసే ప్రయత్నం(గ్రౌండ్ టెస్టింగ్)గా భారత్‌కు చెందిన విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, షేక్ హసీనా ఆశ్రయం విషయంలో అధికారికంగా దిల్లీ వైఖరిలోనూ ఎలాంటి మార్పూ లేదు.
భారత విదేశీ వ్యవహారాలు, హోం శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు బీబీసీతో మాట్లాడుతూ.. షేక్ హసీనాను భారత్ స్వయంగా ఆహ్వానించలేదని, ఆమెకు ఆశ్రయం కల్పించలేదని, అలాగే ఇప్పుడు బలవంతంగా ఆమెను పంపించేసే ప్రయత్నాలు కూడా చేయడం లేదని స్పష్టం చేస్తున్నారు.
భారత్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, "ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసుకుని ఆమె స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు. ఒకవేళ భారత్‌లోనే ఉండాలనుకున్నా ఉండొచ్చు. ఇందులో కొత్తగా చెప్పడానికేమీ లేదు" అన్నారు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనా గత వారం అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
డిసెంబర్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బంగ్గాదేశ్‌కు తిరిగి వెళ్లాలని, కోర్టులో లొంగిపోవాలని భావిస్తున్నట్లు ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
బంగ్లాదేశ్ వెళ్లగానే తనను అరెస్టు చేసే అవకాశం, లేదా ఉరితీసే అవకాశం ఉన్నప్పటికీ తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధానంగా రెండు విషయాలు
షేక్ హసీనా ప్రకటనకు సంబంధించి దిల్లీలోని పలువురు ఉన్నతాధికారులు, అనలిస్టులు, మాజీ దౌత్యవేత్తలతో బీబీసీ మాట్లాడింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలను కూడా సంప్రదించింది.
వారితో మాట్లాడినప్పుడు, ప్రధానంగా రెండు విషయాలు తేటతెల్లమయ్యాయి. వీటితో అన్ని వర్గాలూ ఏకీభవిస్తున్నాయి కూడా.
అవేంటంటే, షేక్ హసీనా ప్రకటనకు అర్థం ఆమె డిసెంబర్‌లో భారత్‌లో విమానమెక్కి ఢాకాలో దిగుతారని కాదు, అది దాదాపు అసాధ్యం.
కాకపోతే, ఈ ఐదు నెలల్లో పరిస్థితులు ఎలా మారతాయి? బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? హసీనాపై మళ్లీ విచారణ జరుపుతారా? లేదంటే ఆమెకు ఇప్పటికే విధించిన శిక్ష అమలుకు చర్యలు తీసుకుంటారా? అనే అంశాలపై అది ఆధారపడి ఉంటుంది.
అలాగే, షేక్ హసీనా గురించి అంతర్జాతీయ సమాజం వైఖరేంటి? షేక్ హసీనా నిజంగానే డిసెంబర్‌లో ఢాకాకు విమానం ఎక్కుతారా?
మరో కోణం ఏమిటంటే, తన నిర్ణయం గురించి ఏ విదేశీ ప్రభుత్వంతోనూ సంప్రదించలేదని షేక్ హసీనా ఎంత చెప్పినా.. ఆమె భారత్ అనుమతి లేకుండా అలా అని ఉండరని విశ్లేషకులు ఒకే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఆమెకు ప్రస్తుతం ఆశ్రయం కల్పిస్తోంది భారత్.
నిజానికి, ఈ ప్రకటన తమకు ఎలాంటి ఇబ్బంది కలిగించదని, పైగా ప్రయోజనం పొందే అవకాశాలు మరింత పెరుగుతాయని భారత ప్రభుత్వం కూడా భావిస్తోంది.
ఎందుకంటే, షేక్ హసీనా నిజంగా బంగ్లాదేశ్ తిరిగి వెళ్తే గత రెండేళ్లుగా కొనసాగుతున్న దౌత్యపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.
ఒకవేళ ఆమె తిరిగి వెళ్లకపోయినా, షేక్ హసీనా తిరిగి వెళ్లాలని అనుకున్నారని, కానీ అందుకు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో భారత్ నిరాకరించినట్లు చెప్పవచ్చు.
దీంతో, షేక్ హసీనా ప్రకటనను "ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టే" ప్రయత్నంగా చూస్తున్నారు. స్పష్టంగా చెప్పాలంటే, ఆమెకు గానీ ఆమెకు ఆశ్రయం ఇచ్చిన దేశానికి గానీ దీనివల్ల ఎలాంటి నష్టం లేదు.
వాస్తవానికి, ఇది ఇరుపక్షాలూ ఉద్దేశపూర్వకంగా వేసిన అడుగు. దీనిద్వారా బంతిని బంగ్లాదేశ్ లేదా బంగ్లాదేశ్ ప్రభుత్వ కోర్టులోకి నెట్టే ప్రయత్నం.
ఆమె డిసెంబర్‌లో వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పినంత మాత్రాన, ఆమె కచ్చితంగా వెళ్తారని దానర్థం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రభుత్వ వైఖరేంటి?
బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లడంపై షేక్ హసీనా ప్రకటన గురించి అడిగినప్పుడు, ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ జులై 14న స్పష్టం చేశారు.
ప్రత్యేక భద్రతా కారణాల రీత్యా ఆమె ఆశ్రయం కోరినప్పుడు, ఆమె భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆమె అభ్యర్థనకు అంగీకారం తెలిపినట్లు భారత ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తూ వస్తోంది.
ఈ ప్రకటన ద్వారా షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడంలో గానీ, ఆమె దేశం విడిచి రావడంలో గానీ తమ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేయాలని భారత్ భావిస్తోంది. అప్పటి పరిస్థితుల కారణంగానే ఆమెకు ఆశ్రయం కల్పించాల్సి వచ్చిందని భారత్ పలు సందర్భాల్లో వివరించింది.
అయితే, షేక్ హసీనాను అప్పగించాలంటూ గత ఏడాదిన్నర కాలంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన మౌఖిక, అధికారిక అభ్యర్థనలకు భారత్ స్పందించకపోవడం కూడా వాస్తవం.
భారత గడ్డపై షేక్ హసీనా ఉండడమనేది భారత్ - బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల్లో తీవ్ర అసౌకర్యానికి కారణమవుతుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, షేక్ హసీనా బంగ్లాదేశ్ తిరిగి వెళ్లేందుకు భారత్ అంగీకరిస్తుందా?
ఈ ప్రశ్నకు సింపుల్‌గా సమాధానం, 100 శాతం అవును.
భారత్ పరోక్ష మద్దతు లేదా సంప్రదింపులు జరపకుండానే షేక్ హసీనా ఈ ప్రకటన చేసి ఉండరని బీబీసీతో మాట్లాడిన అనలిస్టులు, మాజీ దౌత్యవేత్తలు అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
"షేక్ హసీనా తిరిగి వెళ్లడానికి చాలా స్పష్టతతో, ఆసక్తితో ఉన్నారని నేను భావిస్తున్నా" అని ఢాకాలో భారత మాజీ హైకమిషనర్ పినాక్ రంజన్ చక్రవర్తి అన్నారు. "అవామీ లీగ్‌ను కాపాడుకోవాలంటే, దేశానికి తిరిగి వెళ్లాలని ఆమె గ్రహించి ఉండాలి."
ఢాకాకు వచ్చిన వెంటనే షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించడం అనుకున్నంత సులభం కాదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
"మరణశిక్షపై ఆమె కోర్టులో అప్పీల్ చేస్తారని, ఆ విచారణ సమయంలో కంటోన్మెంట్‌లో భద్రత నడుమ ఉంచుతారని భావిస్తున్నా. అందుకోసం భారత్ తెరవెనుక ఢాకాతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నా నాకేమీ ఆశ్చర్యం లేదు" అని ఆయన అన్నారు.
ఒకవేళ షేక్ హసీనా తిరిగొచ్చిన తర్వాత, ఆమెపై మళ్లీ విచారణ జరుపుతామని బంగ్లాదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లైతే, అది కూడా భారత్‌కు విజయంగానే పరిగణించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
షేక్ హసీనా వ్యూహమేంటి?
బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లే విషయంలో షేక్ హసీనా తన లెక్కలు తాను వేసుకున్నారని దిల్లీలోని రాజకీయ, దౌత్య విశ్లేషకులు భావిస్తున్నారు.
వాస్తవానికి, బంగ్లాదేశ్‌లో తన పార్టీ అవామీ లీగ్ కార్యాలయాలు ధ్వంసం చేసినప్పుడు, తగలబెట్టినప్పుడు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో కార్యకర్తలపై దాడులు చేసి, వారిపై కేసులు పెట్టినప్పుడు షేక్ హసీనాతో సహా పార్టీ అగ్రనాయకత్వం వారికి అండగా నిలవలేకపోయింది.
సుదీర్ఘ విరామం తర్వాత, కచ్చితమైన తేదీని ప్రకటించడం ద్వారా తాను తిరిగి వచ్చేందుకు దృఢనిశ్చయంతో ఉన్నాననే సందేశాన్ని పంపాలనుకుంటున్నారు షేక్ హసీనా. తద్వారా కార్యకర్తలు, నాయకుల్లో మనోధైర్యాన్ని పెంచి, వారికి అండగా నిలవాలని కోరుకుంటున్నారు.
అవామీ లీగ్‌ను పునరుద్ధరించి, ఆ పార్టీని బంగ్లాదేశ్ రాజకీయ చిత్రపటంపైకి తిరిగి తీసుకురావాలంటే తాను బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టాల్సి ఉంటుందనేది షేక్ హసీనాకు తెలిసిన మరో విషయం. భారత్‌లో ఉంటూ అది సాధ్యమయ్యే పని కాదు.
దిల్లీకి చెందిన సీనియర్ రాజకీయ విశ్లేషకులు, బంగ్లాదేశ్ వ్యవహారాల నిపుణులు జయంత్ రాయ్ చౌధరి మాట్లాడుతూ, "అవామీ లీగ్‌ను నిషేధించడం ద్వారా దానిని రాజకీయ చిత్రపటం నుంచి తప్పించడానికి చేసే ప్రయత్నాన్ని తానే స్వయంగా అడ్డుకుంటాననే సందేశాన్ని బీఎన్‌పీకి పంపేందుకు షేక్ హసీనా ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నా. ఆమెకు భారత్ కూడా పరోక్షంగా మద్దతిస్తుందనేది స్పష్టం" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అలాగే, అవామీ లీగ్ నాయకత్వ బాధ్యతలను తన కుటుంబ సభ్యులకు కాకుండా మరొకరికి అప్పగించేందుకు షేక్ హసీనా సుముఖంగా లేరు కాబట్టి, పార్టీపై తిరిగి పట్టు సాధించేందుకు ఆమె ఆఖరి ప్రయత్నం చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశానికి తిరిగి వస్తున్నట్లు స్వయంగా ప్రకటించడం ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై కొంత ఒత్తిడి కూడా తీసుకురావొచ్చని ఆమె భావిస్తున్నారు.
మధ్యంతర ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ట్రిబ్యునల్ ఆమెకు విధించిన మరణశిక్ష న్యాయబద్ధమైనది కాదని అవామీ లీగ్ భావిస్తోంది.
అయితే, పునర్విచారణ కోసం పట్టుబట్టాలంటే ఆమె బంగ్లాదేశ్‌కు తిరిగి రావాల్సి ఉంటుంది. స్వదేశానికి వచ్చిన తర్వాత కోర్టులో లొంగిపోతాననడం ద్వారా న్యాయవ్యవస్థపై తనకు నమ్మకముందని షేక్ హసీనా ఒక సంకేతం పంపాలనుకుంటున్నారు. అలాంటప్పుడు, నిష్పక్షపాత, స్వతంత్ర విచారణకు ప్రభుత్వం కూడా హామీ ఇవ్వాల్సి ఉంటుంది.
వీటన్నింటి నేపథ్యంలో, ఆమె బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని చెబుతున్నప్పటికీ, డిసెంబర్‌లో వెళ్తారనేది వాస్తవం కాకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఆమె పార్టీ నేతలు ఏమంటున్నారు?
వేలాది మంది అవామీ లీగ్ నాయకులు, మాజీ ఎంపీలు, మంత్రులు, సాధారణ కార్యకర్తలు, మద్దతుదారులు 2024 ఆగస్టు నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.
వీరిలో చాలామంది కోల్‌కతా సమీపంలోని న్యూటౌన్ రాజార్‌హాట్, అస్సాంలోని గువాహటి, త్రిపురలోని అగర్తలా వంటి నగరాల్లో నివసిస్తున్నారు. షేక్ హసీనా ప్రకటన వెలువడిన తర్వాత వీరిలో చాలామందితో బీబీసీ బంగ్లా మాట్లాడింది.
బంగ్లాదేశ్‌లో ఇప్పటికీ రాజకీయ పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉందని చాలామంది అవామీ లీగ్ అగ్రనేతలు భావిస్తున్నారు. షేక్ హసీనా తిరిగొస్తే ఆ పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారొచ్చు. అంత రిస్క్ తీసుకునేందుకు బీఎన్‌పీ ప్రభుత్వం ఇష్టపడకపోవచ్చు.
కానీ, ఒకవేళ తమ నాయకురాలు స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకుంటే ఎంతమంది ఆమెతో వెళ్లేందుకు అంగీకరిస్తారు? అని అడిగినప్పుడు, భిన్నమైన సమాధానాలు వచ్చాయి.
నాయకురాలు ఎప్పుడు బంగ్లాదేశ్‌కు తిరిగొచ్చినా స్వదేశంతో పాటు విదేశాల్లో ఆశ్రయం పొందుతున్న "అవామీ లీగ్ సైనికులు" కచ్చితంగా ఆమెతో కలిసి ఢాకాకు తిరిగి వెళ్లాలనే కోరుకుంటారని కొందరు అంటున్నారు.
అయితే, షేక్ హసీనాకున్న రాజకీయ పలుకుబడి, ప్రాముఖ్యత, అంతర్జాతీయ గుర్తింపును పార్టీలోని మరే ఇతర నాయకులతో పోల్చలేమని మరికొందరు అంటున్నారు.
అంటే, "ఒకవేళ నాయకురాలిపై మళ్లీ విచారణ జరిగితే ప్రపంచం దృష్టి, అంతర్జాతీయ మీడియా దృష్టి ఆమెపై ఉంటాయి. కానీ, మేం దేశానికి తిరిగి వెళ్లి, తప్పుడు ఆరోపణలతో జైలు పాలైతే ఆ విషయం కూడా ఎవరికీ తెలియకపోవచ్చు. ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా ఉండదు" అని షేక్ హసీనా క్యాబినెట్‌లోని ఒక మాజీ సభ్యుడు అన్నారు.
దీంతో షేక్ హసీనా నిజంగానే డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లినా, ఎంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమతో పాటు వెళ్తారనేది అంచనా వేయడం కష్టం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























