పిత్తాశయంలో రాళ్లు ఎలా వస్తాయి, అవి ఎంత ప్రమాదకరం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ హిమానీ
- హోదా, రేడియేషనల్ ఆంకాలజిస్ట్, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
"కడుపు కుడివైపున అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి వచ్చింది. గ్యాస్ అనుకుని మందులు వేసుకున్నా తగ్గలేదు. చివరకు పరీక్షలు చేయించుకుంటే పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని తెలిసింది"..
ఇటువంటి అనుభవాన్ని చాలామంది చెబుతుంటారు.
పిత్తాశయ రాళ్లు (గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదా గాల్ స్టోన్స్) ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సాధారణ జీర్ణాశయ వ్యాధులలో ఒకటి.
చాలా మందిలో ఇవి ఎలాంటి లక్షణాలు లేకుండానే సంవత్సరాల తరబడి ఉంటాయి. కానీ కొందరిలో తీవ్రమైన నొప్పి, ఇన్ఫెక్షన్, కామెర్లు, పాంక్రియాటైటిస్ వంటి ప్రమాదకర సమస్యలకు దారితీయవచ్చు.
సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ఈ సమస్యను పూర్తిగా అధిగమించవచ్చు.
పిత్తాశయం అంటే ఏమిటి?
పిత్తాశయం అనేది కాలేయం కింద ఉండే ఒక చిన్న సంచి లాంటి అవయవం. ఇది సుమారు 7 నుంచి 10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది.
కాలేయం ప్రతిరోజూ తయారు చేసే పైత్యరసం (Bile)ను తాత్కాలికంగా నిల్వ చేయడం దీని ప్రధాన పని.
కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు ఈ పైత్యరసం చిన్న పేగులోకి విడుదలై కొవ్వుల జీర్ణక్రియకు సహాయపడుతుంది.

పిత్తాశయంలో రాళ్లు ఎలా ఏర్పడతాయి?
పైత్యరసంలో ప్రధానంగా మూడు పదార్థాలు ఉంటాయి.
- కొలెస్ట్రాల్
- బైల్ సాల్ట్స్
- బిలిరుబిన్
ఈ పదార్థాల మధ్య సమతుల్యత దెబ్బతింటే చిన్న చిన్న స్ఫటికాలు ఏర్పడతాయి. కాలక్రమేణా ఇవి పెద్దవై రాళ్లుగా మారుతాయి.
రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణాలు:
- పైత్యరసంలో అధిక కొలెస్ట్రాల్ ఉండటం
- పిత్తాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం
- బిలిరుబిన్ అధికంగా తయారవడం
- పిత్తాశయంలో ఇన్ఫెక్షన్ లేదా వాపు

ఫొటో సోర్స్, Getty Images
పిత్తాశయ రాళ్ల రకాలు
1.కొలెస్ట్రాల్ రాళ్లు
ఇవి అత్యంత సాధారణం. దాదాపు 80% వరకు కేసుల్లో కనిపిస్తాయి.
2.పిగ్మెంట్ రాళ్లు
బిలిరుబిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడతాయి. కాలేయ వ్యాధులు, రక్త సంబంధిత కొన్ని వ్యాధుల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
3.మిశ్రమ రాళ్లు
కొలెస్ట్రాల్, కాల్షియం, బిలిరుబిన్ కలిపి ఏర్పడే రాళ్లు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరిలో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది?
వైద్యులు ఫైవ్ - ఎఫ్ (Five F) అనే సూత్రంతో దీన్ని గుర్తుంచుకుంటారు.
- ఫీమేల్ - మహిళలు
- ఫార్టీ - 40 సంవత్సరాల వయస్సు పైబడినవారు.
- ఫ్యాట్ - అధిక బరువు
- ఫెర్టైల్ - బాలింతలు
- ఫెయిర్ - పాశ్చాత్య దేశాల్లోని తెల్లజాతీయులు
భారతీయుల్లో కూడా ఈ ప్రమాద కారకాలు చాలా వరకు వర్తిస్తాయి.
ఇతర ప్రమాద కారకాలు
- ఊబకాయం
- మధుమేహం
- అధిక కొలెస్ట్రాల్
- గర్భధారణ
- ఈస్ట్రోజెన్ హార్మోన్ మందులు
- కుటుంబ చరిత్ర
- ఎక్కువసేపు ఉపవాసం
- వేగంగా బరువు తగ్గడం
- అధిక కొవ్వు ఆహారం
- తక్కువ ఫైబర్ ఆహారం
- కాలేయ వ్యాధులు
- హీమోలిటిక్ అనీమియా
- వృద్ధాప్యం
భారత్‌లో పిత్తాశయ రాళ్లు క్రమంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి.
జనాభాలో సుమారు 5–15% మందికి జీవితకాలంలో ఒకసారి అయినా ఈ రాళ్లు రావచ్చు.
పురుషుల కంటే మహిళల్లో 2–3 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి.
40 ఏళ్ల తరువాత ఈ సమస్య వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఊబకాయం పెరగడం, వ్యాయామం తగ్గడం, ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరగడం వల్ల యువతలో కూడా ఇటీవల ఈ సమస్య కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
పిత్తాశయంలో రాళ్లు - లక్షణాలు
చాలామందికి ఎలాంటి లక్షణాలు ఉండవు. అల్ట్రాసౌండ్ పరీక్షలో యాదృచ్ఛికంగా బయటపడుతుంది.
లక్షణాలు ఉన్నప్పుడు:
- కడుపు కుడివైపున తీవ్రమైన నొప్పి (బిలియరీ కోలిక్)
- భుజానికి లేదా వీపుకు వ్యాపించే నొప్పి
- కొవ్వు ఆహారం తిన్న తరువాత నొప్పి
- వికారం
- వాంతులు
- అజీర్తి
- కడుపు ఉబ్బరం
- గ్యాస్ సమస్య
ప్రమాదకర లక్షణాలు
ఈ కింది లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
- జ్వరం
- వణుకు
- కామెర్లు
- కళ్లు పసుపురంగులోకి మారడం
- మూత్రం ముదురురంగులో రావడం
- తెల్లటి మలం
- తీవ్రమైన పొత్తికడుపు నొప్పి
- ఆగని వాంతులు
నిర్ధరణ పరీక్షలు:
- అల్ట్రాసౌండ్: ఇది అత్యంత సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన, కచ్చితమైన పరీక్ష.
- రక్తపరీక్షలు: సీబీసీ, లివర్ ఫంక్షన్ టెస్టులు – సీరమ్ బిలిరుబిన్, లివర్ ఎంజైమ్స్
- ఎంఆర్సీపీ
- పైత్యనాళాల్లో రాళ్లు అనుమానం ఉన్నప్పుడు సీటీ స్కాన్
- ఈఆర్సీపీ పరీక్షతో రాళ్లను గుర్తించడమే కాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్స..
- లక్షణాలు లేని రాళ్లకు చాలామందికి ఎలాంటి చికిత్సా అవసరం ఉండదు.
- వైద్యుల పర్యవేక్షణలో ఉంటే సరిపోతుంది.
- లక్షణాలు ఉన్నప్పుడు, మళ్లీ మళ్లీ నొప్పి వస్తే శస్త్రచికిత్స ఉత్తమ పరిష్కారం.
- లాపరోస్కోపిక్ గాల్ బ్లాడర్ తొలగింపు - ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇదే ప్రామాణిక చికిత్స. దీనిని లాపరోస్కోపిక్ కొలెసిస్టెక్టమీ అంటారు.
లాపరోస్కోపిక్ కొలెసిస్టెక్టమీతో ప్రయోజనాలు
- చిన్న గాయాలు
- తక్కువ నొప్పి
- తక్కువ రక్తస్రావం
- త్వరగా కోలుకోవడం
- 1–2 రోజుల్లో డిశ్చార్జ్
- త్వరగా సాధారణ పనులకు తిరిగి వెళ్లడం

ఫొటో సోర్స్, Getty Images
అత్యవసర శస్త్రచికిత్స ఎప్పుడు అవసరం?
- యాక్యూట్ కొలెసిస్టైసిస్
- గాల్ బ్లాడర్ పగిలే ప్రమాదం
- పైత్యనాళం మూసుకుపోవడం
- పాంక్రియాటైటిస్
- ఇన్ఫెక్షన్
మందులతో రాళ్లు కరుగుతాయా?
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మందులు ఉపయోగించవచ్చు. అయితే, ఇవి అందరికీ పనికిరావు.
చిన్న సైజ్ కొలెస్ట్రాల్ రాళ్లు ఉన్న వాళ్లకు మందులు ఉపయోగపడొచ్చు. వీరికి చికిత్సకు నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది కానీ మళ్లీ రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. అందువల్ల శస్త్రచికిత్సే శాశ్వత పరిష్కారంగా భావిస్తారు.
గాల్ బ్లాడర్ తీసేస్తే ప్రమాదమా?
చాలామంది భయపడే ప్రశ్న ఇదే.
పిత్తాశయం తొలగించిన తరువాత కూడా కాలేయం పైత్యరసాన్ని తయారు చేస్తూనే ఉంటుంది. అది నేరుగా చిన్నపేగులోకి వెళ్తుంది.
అందువల్ల చాలా మంది పూర్తిగా సాధారణ జీవితం గడపగలుగుతారు.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్స ఆలస్యం చేస్తే..
- యాక్యూట్ కొలెసిస్టైసిస్
- ఎంపైమా
- గాల్ బ్లాడర్ గాంగ్రీన్
- పిత్తాశయ రంధ్రం
- అబ్స్ట్రక్టివ్ జాండిస్
- కొలాంజైటిస్
- యాక్యూట్ పాంక్రియాటైటిస్
- ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్
- అరుదుగా గాల్ బ్లాడర్ క్యాన్సర్ వంటి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.
నివారణ సాధ్యమేనా?
- వంద శాతం నివారణ సాధ్యం కాకపోయినా ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
- ఆరోగ్యకరమైన బరువు ఉండాలి.
- ఊబకాయం తగ్గించాలి. ఒక్కసారిగా బరువు తగ్గకూడదు
- నెలకు 2–4 కిలోల కంటే ఎక్కువ తగ్గించే క్రాష్ డైట్లు నివారించాలి.
- వ్యాయామం - రోజుకు కనీసం 30–45 నిమిషాలు చేయాలి.
- సమతుల ఆహారం - పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
- తగ్గించాల్సినవి - ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ పదార్థాలు, అధిక నెయ్యి, అధిక వెన్న, ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు
- తగినంత నీరు - రోజూ సరిపడా నీరు తాగాలి.
- మధుమేహం నియంత్రణ - డయాబెటిస్ నియంత్రణలో ఉంటే ప్రమాదం తగ్గుతుంది.
అపోహలు - నిజాలు
అపోహ: రాళ్లు ఉంటే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలి.
నిజం: లక్షణాలు లేని చాలామందికి శస్త్రచికిత్స అవసరం ఉండదు.
అపోహ: ఆయుర్వేదం లేదా ఇంటి చిట్కాలతో రాళ్లు పూర్తిగా కరుగుతాయి.
నిజం: దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. స్వయంగా చికిత్స చేయడం ప్రమాదకరం.
అపోహ: గాల్ బ్లాడర్ తీసేస్తే జీవితాంతం జీర్ణక్రియ సరిగ్గా ఉండదు.
నిజం: చాలా మంది సాధారణ జీవితం గడుపుతారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పుడు వెంటనే వైద్యుడిని కలవాలి?
ఈ కింది లక్షణాల్లో ఏదైనా ఉంటే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలి.
- కుడివైపు తీవ్రమైన కడుపు నొప్పి
- 4–6 గంటలకు మించి నొప్పి కొనసాగడం
- జ్వరం
- వాంతులు
- కామెర్లు
- కళ్లు పసుపు రంగులోకి మారడం
- ముదురురంగు మూత్రం
పిత్తాశయ రాళ్లు ప్రస్తుతం సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ, వాటిని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. చాలా మందిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా, కొందరిలో తీవ్రమైన నొప్పి, ఇన్ఫెక్షన్, కామెర్లు, పాంక్రియాటైటిస్ వంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీయవచ్చు.
ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల ఆహారం, సరైన బరువు, క్రమం తప్పని వ్యాయామం ద్వారా ఈ సమస్య వచ్చే అవకాశాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.
కుడివైపు పై పొత్తికడుపులో తరచూ నొప్పి వస్తుంటే స్వయంగా మందులు వేసుకోవడం కాకుండా వైద్యులను సంప్రదించి అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. ఆధునిక లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా ఈ సమస్యకు సురక్షితమైన, సమర్థవంతమైన, శాశ్వతమైన చికిత్స అందుబాటులో ఉంది.
సమయానికి గుర్తింపు, సరైన చికిత్స, ఆరోగ్యకరమైన జీవనశైలి - ఇవే పిత్తాశయ రాళ్ల నుంచి రక్షణకు ప్రధాన ఆయుధాలు.
(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























