కొండవెలగాడ: నాన్న 2010లో.. కొడుకు 2026లో.. కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం, రజతం

ఫొటో సోర్స్, Valluri Srinivasa Rao
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో విజయనగరం జిల్లాకు చెందిన వల్లూరి అజయ్ బాబు రజత పతకం సాధించారు.
కాగా ఇంతకుముందు 2010 దిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో ఆయన తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా కాంస్య పతకం సాధించారు.
తండ్రీకొడుకులు ఇద్దరూ కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించడం విశేషం.
2010లో జరిగిన దిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో తండ్రి కాంస్యం గెలవగా.. 16 ఏళ్ల తర్వాత గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో కుమారుడు రజతం సాధించారు.
పురుషుల 79 కేజీల విభాగంలో జరిగిన పోటీలో అజయ్ బాబు స్నాచ్‌లో 149 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 181 కిలోలు ఎత్తి మొత్తం 330 కిలోల బరువును లిఫ్ట్ చేశాడు.
అయితే, కేవలం ఒక్క కిలో తేడాతో స్వర్ణ పతకం చేజారింది.


ఫొటో సోర్స్, Valluri Srinivasa Rao
మలేసియా క్రీడాకారుడు ఎర్రీ హిదాయత్ ముహమ్మద్ 331 కిలోలతో (147+184) స్వర్ణం గెలుచుకున్నాడు.
ఈ ప్రదర్శనతో అజయ్ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను మరోసారి చాటాడు.
స్వర్ణం కేవలం ఒక్క కిలో తేడాతో చేజారినా, ఈ రజతం భవిష్యత్తులో స్వర్ణానికి మెట్లుగా మార్చుకుంటానని గ్లాస్గో నుంచి బీబీసీతో మాట్లాడిన వల్లూరి అజయ్ బాబు చెప్పారు.

ఫొటో సోర్స్, Valluri Srinivasa Rao
తండ్రి స్ఫూర్తితో..
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల అజయ్ బాబు చిన్నప్పటి నుంచి వెయిట్‌లిఫ్టింగ్ వాతావరణంలోనే పెరిగాడు. ఆయన తండ్రి శ్రీనివాసరావు కూడా వెయిట్‌లిఫ్టర్ కావడంతో, అజయ్ బాబుకు చిన్నప్పటి నుంచే ఈ క్రీడపై ఆసక్తి పెరిగింది.
మరో విషయమేంటంటే.. డిగ్రీ చదువుతున్న అజయ్ తమ్ముడు అఖిల్ కూడా వెయిట్ లిఫ్టరే. జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాడు. వీరిద్దరికీ తండ్రి శ్రీనివాసరావే వెయిట్ లిఫ్టింగులో గురువు, కోచ్.
తండ్రి స్ఫూర్తితో కేవలం ఎనిమిదేళ్ల వయసులోనే శిక్షణ ప్రారంభించిన అజయ్ కఠోర సాధనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలను అందుకున్నాడు. చిన్న గ్రామం నెల్లిమర్ల మండలం కొండవెలగాడ నుంచి ప్రయాణం ప్రారంభించి ఇప్పుడు ప్రపంచ వేదికపై భారత్ తరపున సత్తా చాటారు.
అజయ్ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు ప్రముఖ ఇండియన్ వెయిల్లిఫ్టర్. 1997లో శిక్షణ ప్రారంభించిన ఆయన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించారు.
2010లో దిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీనివాసరావు భారత్ తరఫున 56 కేజీల విభాగంలో పోటీపడి కాంస్యం సాధించారు.
ఇప్పుడు ఆయన కుమారుడు అజయ్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించారు. అజయ్‌బాబు 2026లో అహ్మదాబాద్‌లో జరిగిన సీనియర్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించారు.

ఇద్దరూ ఆర్మీలోనే...
ఇంటి వద్దనే తండ్రి ఏర్పాటు చేసుకున్న చిన్న జిమ్‌లో రోజుకు 6-7 గంటల పాటు కష్టపడి శిక్షణ తీసుకునేవాడు అజయ్.
ఇండియన్ ఆర్మీలో సిపాయి స్థాయి నుంచి సుబేదార్‌గా వల్లూరి శ్రీనివాసరావు రిటైర్ అవ్వగా... వెయిట్‌లిఫ్టింగ్‌లో సాధించిన ప్రతిభతో అజయ్‌బాబు క్రీడల కోటాలో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు.
"ఈ క్షణం నాకు ఎంతో ఆనందంతో పాటు కొంత బాధను కూడా మిగిల్చింది. రజత పతకం సాధించినందుకు సంతోషంగా ఉంది. కానీ, స్వర్ణం కేవలం ఒక్క చిన్న పొరపాటు వల్ల చేజారిందనే బాధ ఉంది. అయితే, పోటీలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని భావిస్తున్నా. ఆ పొరపాటు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటా. గత రెండేళ్లుగా ఎంతో కష్టపడి సాధన చేశా. ఆ కష్టానికి ఈ రజత పతకం ప్రతిఫలం. ఈ విజయాన్ని మా నాన్నకు అంకితం చేస్తున్నా" అని అజయ్ బాబు బీబీసీతో చెప్పాడు.

ఫొటో సోర్స్, Valluri Srinivasa Rao
'నాన్న కలను నిజం చేస్తా'
"నేను 2005లో పుట్టాను. నాకు ఐదేళ్ల వయసున్నప్పుడు మా నాన్న 2010లో కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించారు. దీనిని దాటి నేను మరింత ఎత్తుకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. తండ్రి శిక్షణలో క్రమశిక్షణ, పట్టుదల నేర్చుకుని, రోజుకు 10-12 గంటల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నా" అని వల్లూరి అజయ్ బాబు బీబీసీతో చెప్పాడు.
కొండవెలగాడ గ్రామంలో పలువురు క్రీడాకారులు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటారు, ఆ సంప్రదాయాన్ని అజయ్ బాబు కూడా కొనసాగించాడు.
"మా నాన్న సాధించాలనుకున్నది ఒలింపిక్స్ పతకం. ప్రస్తుతం నేను మా నాన్న కలని నిజం చేసే పనిలో ఉన్నా. నేను ఒలింపిక్ పతకం గెలిచి ఆయన కోరిక నెరవేరుస్తా" అని వల్లూరి అజయ్ బాబు బీబీసీతో అన్నారు.
పతకం గెల్చుకున్న అజయ్ బాబు ప్రస్తుతం ఇతర టీం సభ్యులతో స్కాట్లాండ్లోనే ఉన్నారు. అక్కడి నుంచి బీబీసీతో మాట్లాడారు.

'నా కొడుకుని ఒక్కసారి కూడా టీవీలో, ఫోనులో చూడలేదు'
"అజయ్ బాబు ఏదైనా గేమ్స్‌లో పాల్గొంటే.. ఆయన తండ్రి, తమ్ముడు టీవీ ముందో, ఫోన్ లోనే ఆ మ్యాచ్ చూస్తుంటారు. కానీ, నేను మాత్రం ఎప్పుడూ మ్యాచ్ చూడలేదు" అని తల్లి లక్ష్మి చెప్పారు.
తన కొడుకు అంతంత బరువులు ఎత్తుతూ కష్టపడటం తాను చూడలేనని.. అందుకే టీవీ, ఫోన్లలో తాను మ్యాచ్ జరిగే సమయంలో చూడనని ఆమె అన్నారు. ఆ సమయంలో దేవుడి గదిలోకి వెళ్లి పూజలు చేసుకుంటానని బీబీసీతో అన్నారు.
తాను ఇప్పటివరకు ఒక్కసారి కూడా లైవ్‌లో తన కుమారుడు వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండగా చూడలేదని చెప్పారు.
తన భర్త, ఇప్పుడు ఇద్దరు కుమారులు వెయిట్ లిఫ్టింగులోనే రాణిస్తుండటం ఆనందంగా ఉందని, కాకపోతే.. అంతంత బరువులు ఎత్తుతూ.. ఒక్కోసారి దెబ్బలు తగిలించుకున్నప్పుడు మాత్రం చాలా బాధ ఉంటుందని అజయ్ బాబు తల్లి లక్ష్మి అన్నారు.
"అవును, మా అమ్మ ఇప్పటి వరకు నా గేమ్ ఒక్కటీ చూడలేదు. ఎందుకో అంత భయం. అమ్మ కదా నేను కష్టపడితే చూడలేదేమో" అని అజయ్ బాబు బీబీసీతో అన్నారు.

'వెయిట్ లిఫ్టర్నని.. ఏ బస్సైనా ఉచితమే'
వెయిట్ లిఫ్టింగ్ పట్ల ఆసక్తి ఎలా మొదలైందో వివరించారు వల్లూరి శ్రీనివాసరావు.
"మా గ్రామంలో 'సంకెన రాళ్ల పోటీ', అంటే ప్రత్యేక ఆకారంలో ఉన్న బరువైన రాళ్లను ఎత్తే సంప్రదాయ బలపరీక్ష పోటీలు జరుగుతుండేవి. వాటిలో పాల్గొనేందుకు మా గ్రామాల్లోని యువకులు ప్రాక్టీస్ చేస్తుండేవారు. వారిని చూసి చూసి నాకు కూడా రాళ్లు ఎత్తడంపై ఆసక్తి పెరిగి.. కొంత కాలానికి అది వెయిట్ లిఫ్లింగ్ వైపు మళ్లీంది" అని అజయ్ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు చెప్పారు.
"వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు శిక్షణ కోసం విజయనగరంలోని కోడి రామ్మూర్తి వ్యాయామ సమాజంలో ప్రతి రోజు శిక్షణ పొందేవాడిని. అందుకు రోజూ 9 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుని వెళ్లేవాడిని. కాలక్రమంలో మెల్లగా జిల్లా స్థాయి దాటి రాష్ట్ర, జాతీయ పతకాలు సాధించడంతో చాలా మంది నన్ను చూసి వారి వాహనాలపై దింపేవారు.
చివరకు బస్సుల్లో నన్ను ఉచితంగా ఎక్కించుకునేవారు. ఏ బస్సైనా నేను రోడ్డుపై వెళ్తుంటే నన్ను ఎక్కించుకుని మా వ్యాయమశాల వద్ద దింపేవారు. అలా మొదలైన నా వెయిట్ లిఫ్టింగ్ ప్రస్థానంలో అనేక మెడల్స్ గెల్చుకున్నా. అందులో 2010 కామన్వెల్త్ కూడా ఒకటి" అని వల్లూరి శ్రీనివాసరావు చెప్పారు.
"శిక్షణలో అజయ్‌కు అనేక సార్లు గాయాలయ్యాయి. అప్పుడు తండ్రిగా కంటే కోచ్‌గానే ఆలోచించి మనసుని గట్టి చేసుకునేవాడిని" అని శ్రీనివాసరావు చెప్పారు.
ఇప్పుడు ఆ శ్రమే అతనికి విజయాలను అందిస్తోంది. తండ్రీకొడుకులిద్దరం కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించడం చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభినందనలు
గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 79 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన వల్లూరి అజయ్ బాబును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు.
కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత అయిన తండ్రి వల్లూరి శ్రీనివాసరావు అడుగుజాడల్లో నడుస్తూ, అంకితభావం, కృషితో కుటుంబ క్రీడా వారసత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని చంద్రబాబు కొనియాడారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
విజయనగరం జిల్లాకు చెందిన అజయ్ బాబు ప్రస్థానం అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
స్వర్ణ పతకాన్ని స్వల్ప తేడాతో కోల్పోయినా, ఆయన ప్రదర్శన నిజమైన ఛాంపియన్ స్ఫూర్తిని చాటిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారుడు దేశానికి కీర్తి తీసుకురావడం ప్రతి తెలుగువారికీ గర్వకారణమని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























