‘గుండు చేయించుకుంటే రూ. 15 వేలు’.. ప్రభుత్వ పథకం పేరుతో మహిళలను మోసగించిన వ్యక్తి అరెస్ట్, ఇంతకీ వీళ్లంతా ఎలా మోసపోయారంటే

- రచయిత, సుధాకర్.పి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
"కొత్త రకం అంటువ్యాధి వస్తోంది. ఇది జట్టు ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. కాబట్టి, మీరు గుండు చేయించుకుంటే తమిళనాడు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.15000 ఇస్తుంది" అంటూ వచ్చిన ఒక ఫోన్ కాల్‌ను నమ్మి సేలంలోని అత్తూర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు మహిళలు గుండు చేయించుకున్నట్లు కథనాలొచ్చాయి.
అత్తూరు సమీపంలోని పుదుకోత్తంపాడి గ్రామానికి చెందిన కొంతమంది మహిళల మొబైల్ ఫోన్లకు రాత్రివేళ ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశారు.
తాను తహసీల్దార్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకుని, "కరోనా లాంటి ఒక కొత్త వ్యాధి వస్తోంది. ఇది జుట్టు ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి గుండు చేయించుకుంటే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చు. అందుకోసం తమిళనాడు ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది" అని చెప్పారు.
మహిళలకు రూ.15 వేలు, పురుషులకు రూ.6 వేలు, విద్యార్థినులకైతే రూ.45 వేలు నగదు ప్రోత్సాహకాలు ఇస్తారని చెప్పినట్లు బాధితులు తెలిపారు.

'మీ ఊరికి కేవలం 18 టోకెన్లే'
ఫోన్ కాల్ చేసిన వ్యక్తి తమను నమ్మించేందుకు, "మీ ఊరికి కేవలం 18 టోకెన్లు మాత్రమే కేటాయించారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా అధికారులు డబ్బు తీసుకుని వస్తారు. అప్పటికి మీరు గుండు చేయించుకుని సిద్ధంగా ఉండాలి" అని చెప్పారని బాధితులు ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా, ఆ వ్యక్తి అప్పటికే గుండు చేయించుకున్న మహిళల ఫోటోలతో పాటు డబ్బు కట్టల ఫోటోలను కూడా వారికి వాట్సాప్ ద్వారా పంపించారు.
దీంతో సుమారు 20 మంది గుండ్లు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు, వారిలో ముగ్గురు మహిళలు గుండు చేయించుకున్నారు.
అనంతరం, ఆ నంబర్‌కు తిరిగి ఫోన్ చేస్తే స్విచాఫ్ అని రావడంతో తాము మోసపోయినట్లు గ్రహించారు.
బాధిత మహిళ ఒకరు బీబీసీతో మాట్లాడుతూ, "అధికారులు వచ్చేప్పటికి బల్లలు, కుర్చీలు ఏర్పాటు చేసి సిద్ధంగా ఉండాలని చెప్పారు. మాకు అనుమానం వచ్చి అడిగితే, అప్పటికే గుండు చేయించుకున్న వారి ఫోటోలను కూడా మాకు పంపించారు. దీంతో ఆయన మాటలు నమ్మాం" అని అన్నారు.

పోలీసులు ఏమన్నారంటే..
ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే అత్తూరు రూరల్ పోలీసులు ఆ సెల్‌ఫోన్ నంబర్‌పై నిఘా పెట్టారు.
దర్యాప్తులో, అరియలూర్ జిల్లాకు చెందిన సతీశ్ కుమార్‌ను నిందితుడిగా గుర్తించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ గుర్తించి, ఆయన్ను అరెస్టు చేసినట్లు అత్తూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కులశేఖరన్ తెలిపారు.
"సెల్‌ఫోన్ సిగ్నల్ ద్వారా మోసగాడిని గుర్తించాం. వెంటనే నిందితుడిని అరెస్టు చేశాం" అని ఆయన చెప్పారు.
మద్యం మత్తులో సరదాగా అలా చేశానని, జనం నిజంగా గుండు చేయించుకుంటారని అనుకోలేదని నిందితుడు సతీశ్ కుమార్ విచారణలో చెప్పినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
సతీశ్‌కు గతంలో పెద్దగా నేరచరిత్ర లేదని, కూలి పనులు చేసుకుంటూ ఉంటారని దర్యాప్తులో తేలింది.
"నిందితుడు టెలిగ్రామ్ యాప్‌లో వివిధ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నారు. ఆ గ్రూపుల్లో కొన్నింటిలో గుండు చేయించుకున్న ఫోటోలు, వీడియోలను గ్రూపు సభ్యులు షేర్ చేసుకున్నారు"
"మహిళలు గుండు చేయించుకున్న తర్వాత తిరిగి ఫోన్ చేస్తే, నిందితుడు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. సెల్‌ఫోన్ స్విచాఫ్ చేశారు. ఆ తర్వాత, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు" అని ఇన్‌స్పెక్టర్ కులశేఖరన్ అన్నారు.

ఫొటో సోర్స్, handout
ఒక వ్యక్తి ఇలా ప్రవర్తించడం కేవలం వ్యసనం వల్లనా, లేక మానసిక రుగ్మతా? అనే విషయం వైద్య పరీక్షలు నిర్వహించకుండా నిర్ధరించలేమని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధాకృష్ణన్ అంటున్నారు.
ప్రజల్లో అవగాహన అవసరమని ఇలాంటి ఘటనలు చూపుతున్నాయని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని సూచనలు చేశారు.
- ప్రభుత్వం వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఎలాంటి పథకాలనూ ప్రకటించదు.
- వాట్సాప్ ఫోటోలు లేదా వీడియోలను ఆధారాలుగా భావించకూడదు.
- ఏవైనా అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైం విభాగాన్ని సంప్రదించాలి.
- ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక ప్రకటనల ద్వారా మాత్రమే నిర్ధరించుకోవాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























