పిల్లలు ఒకరి బొమ్మలు ఒకరు షేర్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదా.. ఇన్ఫెక్షన్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
"పిల్లాడికి మళ్లీ జలుబు చేసింది..."
"నెలలో రెండుసార్లు జ్వరం వస్తోంది..."
"స్కూల్‌కి వెళ్లడం మొదలుపెట్టినప్పటి నుంచి తరచూ ఇన్ఫెక్షన్లే..."
— ఇవి చాలామంది తల్లిదండ్రుల నుంచి తరచూ వినిపించే మాటలు.
పాఠశాలకు వెళ్లే పిల్లల్లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వైరల్ ఫీవర్, విరేచనాలు వంటి ఇన్ఫెక్షన్లు తరచుగా కనిపిస్తాయి.

చిన్నపిల్లలు ఒకరితో ఒకరు దగ్గరగా కూర్చోవడం, ఆడుకోవడం, బొమ్మలు పంచుకోవడం, చేతులతో ముఖాన్ని తాకడం, పాఠశాలల్లో గాలి ప్రసరణ తక్కువగా ఉండటం వంటి కారణాలతో సూక్ష్మజీవులు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.
అయితే, ప్రతి ఇన్ఫెక్షన్ను పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాదు. పిల్లల రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న సమయంలో సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు రావడం సహజం.
కానీ తీవ్రమైన ఇన్ఫెక్షన్లను నివారించడం, వ్యాధి వ్యాప్తిని తగ్గించడం, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ప్రమాదకర లక్షణాలను త్వరగా గుర్తించడం ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లలకు ఇన్ఫెక్షన్లు ఎలా వస్తాయి?
ఇన్ఫెక్షన్లు ప్రధానంగా మూడు మార్గాల్లో వ్యాపిస్తాయి.
1. శ్వాసకోశ మార్గం
జలుబు, ఫ్లూ, ఆర్ఎస్వీ వంటి వైరస్లు దగ్గు, తుమ్ము, మాట్లాడటం లేదా సన్నిహిత సంబంధాల ద్వారా వ్యాపించవచ్చు.
2. చేతులు, వస్తువులు
ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి తాకిన వస్తువులను పిల్లలు తాకి, అదే చేతులతో కళ్లను, ముక్కును లేదా నోటిని తాకితే సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించవచ్చు.
3. కలుషిత ఆహారం, నీరు
పరిశుభ్రత లేని నీరు లేదా ఆహారం ద్వారా విరేచనాలు, వాంతులు వంటి జీర్ణాశయ ఇన్ఫెక్షన్లు రావచ్చు.
పిల్లలకు ఇన్ఫెక్షన్లు రాకుండా చేయడంలో సబ్బుతో చేతులు కడుక్కోవడం అత్యంత సులభమైన, ప్రభావవంతమైన చర్యల్లో ఒకటి.
ఇంట్లో, పాఠశాలల్లో, సమాజంలో చేతుల పరిశుభ్రతను అంటువ్యాధుల నివారణలో కీలకమైన చర్యగా డబ్ల్యూహెచ్ఓ కూడా గుర్తించింది.
పిల్లలకు ముఖ్యంగా ఈ సమయాల్లో చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి:
- భోజనం ముందు
- టాయిలెట్ ఉపయోగించిన తర్వాత
- బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు
- దగ్గిన లేదా తుమ్మిన తర్వాత
- ముక్కు శుభ్రం చేసుకున్న తర్వాత
- పెంపుడు జంతువులను తాకిన తర్వాత
- చిన్న పిల్లలకు ఆహారం పెట్టే ముందు
సబ్బు, నీటితో చేతులను కనీసం 20 సెకన్ల పాటు బాగా రుద్దాలి. సబ్బు, నీరు అందుబాటులో లేని సందర్భాల్లో కనీసం 60% ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించవచ్చు.
సీడీసీ ప్రకారం, సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల చిన్న పిల్లల్లో విరేచనాలకు సంబంధించిన అనారోగ్యాన్ని సుమారు మూడో వంతు వరకు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను సుమారు ఐదో వంతు వరకు తగ్గించే అవకాశం ఉంది.
"చేతులు కడుక్కోవాలి" అని చెప్పడం మాత్రమే కాదు... తల్లిదండ్రులే దానికి మోడల్ కావాలి!
పిల్లలు తల్లిదండ్రులను చూసి అలవాట్లు నేర్చుకుంటారు. కాబట్టి "ముందు చేతులు కడుక్కుందాం... తర్వాత తిందాం" అనే అలవాటును తల్లిదండ్రులే కుటుంబంలో ఏర్పాటు చేయాలి.
చిన్నపిల్లలకు హ్యాండ్ వాషింగ్‌ను పాటలతో, ఆటలతో నేర్పితే వారు సులభంగా అలవాటు చేసుకుంటారు.
దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు నోరు కప్పుకోవాలి.
దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు చేతులతో నోరు కప్పుకోవడం కంటే చేతి రుమాలు, టిష్యూ పేపర్ లేదా మోచేతి భాగాన్ని అడ్డుగా ఉపయోగించడం మంచిది. అనంతరం చేతులు కడుక్కోవాలి.
చెయ్యి అడ్డుపెట్టుకుని దగ్గడం, తర్వాత అదే చేతితో తలుపు తీయడం, పిల్లలు, పెద్దలు అదే తలుపు తాకడం... ఇలా ఇన్ఫెక్షన్ కుటుంబంలో వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
టీకాలు... పిల్లల రక్షణకు ప్రధాన ఆయుధం
పిల్లలకు అన్ని టీకాలను నిర్ణీత వయస్సులో వేయించడం అత్యంత ముఖ్యమైన నివారణ చర్య.
మీజిల్స్, కోరింత దగ్గు, హిమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా ( Hemophilus Influenza), నిమోకోకల్ ఇన్ఫెక్షన్ (pneumococcal disease) వంటి అనేక తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నుంచి టీకాలు రక్షణ కల్పిస్తాయి.
భారతదేశంలో పిల్లల టీకాల కోసం నేషనల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్‌తో పాటు పిల్లల పరిస్థితిని బట్టి IAP ( ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్) సిఫారసులు కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.
టీకా మిస్ అయితే?
ఒక టీకా మిస్ అయిందని మిగిలిన టీకాలు ఆపేయకూడదు.
పిల్లల డాక్టర్‌ను సంప్రదించి క్యాచ్ అప్ వాక్సినేషన్ చేయించుకోవచ్చు.
తల్లిపాలు... శిశువుకు సహజ రక్షణ
శిశువులకు మొదటి ఆరు నెలలు సాధ్యమైనంత వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని WHO సిఫారసు చేస్తోంది.
తల్లిపాలు కేవలం పోషకాహారం మాత్రమే కాదు, శిశువుకు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే అనేక రక్షణాత్మక పదార్థాలను అందిస్తాయి.
ఆరు నెలల తర్వాత వయస్సుకు తగిన పాక్షిక ఘన రూప ఆహారాన్ని ప్రారంభించి, తల్లిపాలను కొనసాగించడం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
తల్లి అనారోగ్యంగా ఉంటే తల్లిపాలు ఆపాలా?
సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి అనేక సాధారణ అనారోగ్య పరిస్థితుల్లో తల్లి తగిన విధంగా పరిశుభ్రంగా ఉండి , మాస్క్ పెట్టుకుని జాగ్రత్తలు పాటిస్తూ తల్లి పాలు ఇవ్వడం కొనసాగించవచ్చు. అనారోగ్యంతో ఉన్న తల్లి చేతులు కడుక్కోవడం, దగ్గు–తుమ్ముల సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
అయితే, కొన్ని ప్రత్యేక అంటువ్యాధులు లేదా తల్లి తీసుకుంటున్న మందుల విషయంలో వైద్యుడి సలహా అవసరం.
పోషకాహారం లేకపోతే ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి తగ్గుతుంది
"ఇమ్యూనిటీ పెంచే ఒక ప్రత్యేక ఆహారం" అంటూ ఏదీ లేదు.
పిల్లలకు సమతుల ఆహారం ఇవ్వడం ముఖ్యం.
ఆహారంలో పప్పులు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, ఇతర కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, వయస్సుకు తగిన ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఉండేలా చూడాలి.
పోషకాహార లోపం ఉన్న పిల్లల్లో ఇన్ఫెక్షన్లు తీవ్రమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. WHO కూడా పిల్లల్లో న్యుమోనియా నివారణలో తగినంత పోషకాహారానికి ప్రాధాన్యం ఇస్తోంది.
తగినంత నిద్ర కూడా "ఇమ్యూనిటీ కేర్"
పిల్లల ఎదుగుదలలో నిద్రకు ప్రత్యేకమైన పాత్ర ఉంది.
వయస్సుకు తగినంత నిద్ర, క్రమబద్ధమైన నిద్ర ప్రణాళిక ఉండేలా తల్లిదండ్రులు చూడాలి.
రాత్రి పడుకునే ముందు ఎక్కువసేపు మొబైల్, టాబ్లెట్, టీవీ వాడటం తగ్గించడం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంట్లో సిగరెట్ పొగకు "నో ఎంట్రీ"
పిల్లల ముందు ధూమపానం చేయకూడదు.
సిగరెట్ పొగ పిల్లల శ్వాసకోశ ఆరోగ్యానికి హానికరం. ఇంట్లో గాలి కలుషితం అయినా కూడా పిల్లల్లో శ్వాస కోస ఇన్ఫెక్షన్లు ప్రమాదాన్ని పెంచుతుంది.
అందుకే ఇల్లు , కారులో పూర్తిగా పొగ తాగకూడదన్న నియమాన్ని పాటించాలి.
‘పిల్లలకు జలుబు రాకుండా’ పూర్తిగా ఇంట్లోనే ఉంచాలా?
అవసరం లేదు.
పిల్లలకు వయస్సుకు తగిన ఆట, శారీరక చలనం, బయట గడిపే సమయం అవసరం.
అయితే శ్వాస కోస ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నప్పుడు:
- రద్దీ ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండకుండా చూడాలి
- అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని తగ్గించాలి
- మూసివేసిన గదుల్లో గాలి ప్రసరణ ఉండేలా చూడాలి
పాఠశాలల్లో వస్తువులను పంచుకోవడం , ఇన్ఫెక్షన్లు ఉన్న పిల్లలకు దగ్గరగా కూర్చోవడం, వెంటిలేషన్ సరిగా లేకపోవడం వంటి అంశాలు ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందడానికి దోహదం చేయవచ్చు.
బొమ్మలు, తలుపులు, మొబైల్... ఇవి కూడా "ఇన్ఫెక్షన్ వాహకాలు" కావచ్చు
పిల్లలు తరచుగా తాకే వస్తువులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
ప్రత్యేకంగా బొమ్మలు, డోర్ హ్యాండిల్స్, బల్లలు , రిమోట్ కంట్రోల్, ఎక్కువగా ముట్టుకునే ఇతర వస్తువులు వంటి వాటిని అవసరాన్ని బట్టి శుభ్రం చేయాలి.
అయితే ఇంట్లో ప్రతి వస్తువును గంటకొకసారి డిస్ఇన్ఫెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సాధారణ పరిశుభ్రత, అనారోగ్య సమయంలో తగిన క్లీనింగ్ సరిపోతుంది.
పిల్లలు బొమ్మలు షేర్ చేసుకోవచ్చా?
పిల్లలు కలిసి ఆడుకోవడం సహజం.
అయితే, ఒక పిల్లవాడు అనారోగ్యంగా ఉన్నప్పుడు నోట్లో పెట్టుకునే బొమ్మలు, పాల డబ్బాలు, స్పూన్లు, పీకలు వంటి వస్తువులను ఇతర పిల్లలతో పంచుకోకుండా చూడాలి.

ఫొటో సోర్స్, Getty Images
‘జ్వరం అంటే వెంటనే యాంటీబయాటిక్’ .. పెద్ద అపోహ!
పిల్లలకు జ్వరం వచ్చిందంటే వెంటనే యాంటిబయాటిక్ ఇవ్వడం సరైన పద్ధతి కాదు.
చాలా వరకు చిన్న పిల్లల్లో శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు వైరస్ల వల్ల వస్తాయి. వైరస్‌లపై యాంటిబయాటిక్ పనిచేయవు.
అవసరం లేకుండా యాంటిబయాటిక్ వాడితే డయేరియా, అలెర్జీ, ఇతర దుష్పరిణామాలు, యాంటిబయాటిక్ రెసిస్టెన్స్ వంటి సమస్యలు రావచ్చు.
సీడీసీ ప్రకారం పిల్లల్లో మెడికేషన్ రిలేటెడ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ విజిట్స్‌కు యాంటీ బయాటిక్స్ దుష్ప్రభావాలు ఒక ముఖ్యమైన కారణం.
డాక్టర్ సూచన లేకుండా యాంటీ బయాటిక్స్ ఇవ్వకూడదు.
"ఇమ్యూనిటీ బూస్టర్ సిరప్" అవసరమా?
ప్రతి ఆరోగ్యకరమైన పిల్లవాడికి రోగ నిరోధక శక్తి బూస్టర్ సిరప్ అవసరం లేదు.
సమతుల ఆహారం, తగిన నిద్ర, టీకాలు, శారీరక చలనం, పరిశుభ్రతే ప్రధానమైనవి.
ఐరన్, విటమిన్ డి లేదా ఇతర సప్లిమెంట్సు అవసరమా అనేది పిల్లల ఆహారం, వయస్సు, ఆరోగ్య పరిస్థితిని బట్టి పిల్లల వైద్యులు నిర్ణయించాలి.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లలకు తరచూ జలుబు వస్తే ‘ఇమ్యూనిటీ తక్కువ’ అనుకోవాలా?
అవసరం లేదు.
చిన్నపిల్లలు, ముఖ్యంగా డే కేర్ లేదా పాఠశాలకు వెళ్లే పిల్లలు, అనేక కొత్త వైరస్‌లకు గురవుతారు.
అందువల్ల ఏడాదిలో పలుమార్లు శ్వాస కోశ వైరల్ ఇన్ఫెక్షన్లు రావడం మాత్రమే చూసి "రోగనిరోధక శక్తి చాలా తక్కువ" అని నిర్ధరించకూడదు.
అయితే, ఇన్ఫెక్షన్లు అసాధారణంగా తీవ్రమైనవి, తరచుగా ఆసుపత్రిలో చేర్చేంత తీవ్రంగా ఉండటం, బరువు పెరగకపోవడం, దీర్ఘకాలిక విరేచనాలు, పదేపదే న్యుమోనియా, చికిత్సకు స్పందించకపోవడం వంటి పరిస్థితులతో ఉంటే పిల్లల డాక్టర్‌కు చూపించడం అవసరం.

ఫొటో సోర్స్, Getty Images
నవజాత శిశువుల విషయంలో మరింత జాగ్రత్త
నవజాత శిశువులు, ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టే లేదా తక్కువ బరువుతో పుట్టే పిల్లల్లో ఇన్ఫెక్షన్కు సంబంధించిన సమస్యలు వేగంగా తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
అందువల్ల
- శిశువును తాకే ముందు చేతులు కడుక్కోవాలి
- అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు శిశువుకు దగ్గరగా రాకుండా చూడాలి
- శిశువును ముద్దు పెట్టుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి
- పొగకు పూర్తిగా దూరంగా ఉంచాలి
- వాక్సినేషన్ షెడ్యూల్‌ను పాటించాలి
- తల్లి పాలు ఇవ్వడం కొనసాగించాలి
- శిశువుకు శ్వాసలో ఇబ్బంది, పాలు తాగడంలో ఇబ్బందులు లేదా అసాధారణ నీరసం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ముక్కు కారడం నుంచి న్యుమోనియా వరకు..
సాధారణ జలుబు ఎక్కువగా తేలికపాటి అనారోగ్యంగా ఉంటుంది.
కానీ పిల్లలో ఈ కింది లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
- శ్వాస వేగంగా ఉండటం
- ఛాతీ లోపలికి లాగడం
- ముక్కు రంధ్రాలు ఎక్కువగా విప్పడం
- గొణుగుతున్నట్లు శబ్దం రావడం
- పెదవులు/నాలుక నీలంగా మారడం
- పాలు/ఆహారం తీసుకోలేకపోవడం
- అసాధారణ నీరసం
- పదేపదే వాంతులు
- మూత్రం తగ్గడం
- మూర్ఛ రావడం
ముఖ్యంగా 3 నెలల లోపు శిశువుకు 38°C (100.4°F) లేదా అంతకంటే ఎక్కువ జ్వరం ఉంటే తక్షణ వైద్యపరీక్ష అవసరం.

ఫొటో సోర్స్, Getty Images
అపోహలు – నిజాలు
అపోహ: జలుబు వస్తే యాంటీబయాటిక్స్ ఇవ్వాలి
నిజం: చాలా జలుబులు వైరల్. యాంటీబయాటిక్స్ వైరస్‌లపై పనిచేయవు.
అపోహ: పిల్లలకు తరచూ జలుబు వస్తే రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉన్నట్లు భావించొచ్చు
నిజం: చిన్న పిల్లల్లో తేలికపాటి వైరల్ ఇన్ఫెక్షన్లు తరచుగా రావడం సాధారణం కావచ్చు
అపోహ: చేతులు కేవలం నీటితో కడిగితే చాలు
నిజం: సబ్బుతో చేతులు కడుక్కోవడం క్రిములను తొలగించడంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది
అపోహ: పిల్లలు అనారోగ్యంగా ఉంటే అన్ని టీకాలూ వాయిదా వేయాలి
నిజం: తేలికపాటి జబ్బులు సాధారణంగా వాక్సినేషన్‌కు అడ్డంకి కాదు. అయితే జబ్బు తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లల వైద్యులు సలహా అవసరం.
అపోహ: ఇమ్యూనిటీ సిరప్ ఇస్తే ఇన్ఫెక్షన్లు రావు
నిజం: ఏ సప్లిమెంట్ కూడా అన్ని ఇన్ఫెక్షన్లునూ నివారించదు. సమతుల ఆహారం, వ్యాక్సినేషన్, పరిశుభ్రత ముఖ్యం.
అపోహ: పిల్లలకు బయట ఆడిస్తే జలుబు వస్తుంది
నిజం: చల్లని గాలి మాత్రమే జలుబుకు కారణం కాదు. వైరస్లు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లుకు ప్రధాన కారణాలు.
తల్లిదండ్రులకు 10 గోల్డెన్ రూల్స్
1. పిల్లల టీకాలను సమయానికి వేయించండి
2. చేతులు సబ్బుతో తరచుగా కడుక్కోవడం అలవాటు చేయండి
3. దగ్గు, తుమ్ము సమయంలో చేతులు లేదా కర్చీఫ్ అడ్డు పెట్టుకోవడం నేర్పండి
4. మొదటి ఆరు నెలలు సాధ్యమైనంత వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వండి
5. పిల్లలకు సమతుల పోషకాహారం అందించండి
6. తగినంత నిద్ర ఉండేలా చూడండి
7. ఇంటిని, కారును పొగ రహితంగా ఉంచండి
8. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని తగ్గించండి
9. సురక్షితమైన నీరు, పరిశుభ్రమైన ఆహారం ఇవ్వండి
10. వైద్యుడి సలహా లేకుండా యాంటిబయాటిక్ లేదా జలుబు, దగ్గుకి మందులు ఇవ్వకండి
పిల్లలకు ప్రతి ఇన్ఫెక్షన్ రాకుండా చేయడం సాధ్యం కాదు. కానీ తీవ్రమైన ఇన్ఫెక్షన్లను చాలావరకు నివారించవచ్చు.
టీకాలు, తల్లిపాలు, పోషకాహారం, చేతుల పరిశుభ్రత, మంచి గాలి ప్రసరణ, పొగరహిత ఇల్లు, సురక్షితమైన ఆహారం–నీరు, అనారోగ్యంతో ఉన్నవారి నుంచి తగిన జాగ్రత్తలు — ఇవన్నీ కలిపి పిల్లల ఆరోగ్యానికి ఒక "మల్టీ-లేయర్ ప్రొటెక్షన్"గా పనిచేస్తాయి.
పిల్లల ఆరోగ్య రక్షణలో ఖరీదైన మందుల కంటే రోజువారీ చిన్న అలవాట్లే మొదటి రక్షణ కవచం.
(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























