లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణలు: నాసిక్ టీసీఎస్ కేసులో ఈ నెల రోజుల్లో ఏం జరిగింది?

నాసిక్ టీసీఎస్ కేసు, మత మార్పిడి, ఉద్యోగులు
ఫొటో క్యాప్షన్, నిందితులను శుక్రవారం (ఏప్రిల్ 24) కోర్టుకు తీసుకువచ్చినప్పుడు, పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు గుమిగూడారు.
    • రచయిత, అశయ్ యెడ్గే, మయూరేష్ కొన్నూర్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • చదివే సమయం: 8 నిమిషాలు

"నా భర్త బాంబు పేలుళ్లకేమైనా పాల్పడ్డాడా? రాత్రికి రాత్రే ఎనిమిది ఫిర్యాదులు ఎందుకు దాఖలయ్యాయి? ఆయన్ను వెంటనే ఎందుకు అరెస్టు చేశారు?" నాసిక్ టీసీఎస్ కేసులో నిందితులలో ఒకరి భార్య అడిగిన ప్రశ్న ఇది.

నాసిక్ జిల్లా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో, కస్టడీలో ఉన్న తన భర్తను చూడటానికి వచ్చిన ఆ మహిళ అక్కడి పరిస్థితి చూసి అయోమయానికి గురయ్యారు.

ప్రస్తుతం విచారణలో ఉన్న, ఎఫ్ఐఆర్ నంబర్ 166లోని నిందితులలో ఒకరైన షారుఖ్ ఖురేషీ తండ్రి షౌకత్ ఖురేషీ బంధువుల మధ్య నిల్చుని ఉండగా, ఆయనతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది.

"నా కొడుకు ఇలాంటి పని చేశాడని అనుకోవడం లేదు. వాడు విడుదలయ్యే వరకు నేను ఇక్కడికి వస్తాను. షారుఖ్ తప్పు చేసి ఉంటే కోర్టు చర్యలు తీసుకుంటుంది, కానీ మీడియాలో వస్తున్న వార్తలను చూడలేకపోతున్నా" అని ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి రిటైర్ అయిన షౌకత్ ఖురేషీ అన్నారు.

ఆ రోజు విచారణ సుమారు మూడు గంటల పాటు సాగింది. నిందితుడి బంధువులు, భద్రత కోసం అక్కడ మోహరించిన పోలీసులు మూడు గంటల పాటు అక్కడే నిలబడి ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ కేసుతో అంతర్జాతీయంగా పేరుగాంచిన ఐటీ కంపెనీ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (టీసీఎస్) పేరు వెలుగులోకి వచ్చింది. ఇది భారత ఐటీ రంగంలో ఒక అగ్రగామి సంస్థ, దీనిలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇక రెండో విషయం ఈ కేసులో వచ్చిన ఆరోపణలు. ఈ కేసుకు సంబంధించిన వార్తా ప్రసారాలు, చర్చలలో, 'మతమార్పిడి ప్రయత్నాలు' వంటి పదాలను విరివిగా వాడారు. కొందరు విదేశీయులతోనూ ముడిపెట్టారు. అయితే, అటువంటి విదేశీ సంబంధాల గురించి తమకు తెలియదని పోలీసులు చెబుతున్నారు.

ఈ వాదనలు, ఆరోపణలు పక్కన పెడితే అసలు నిజమేంటి? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? కోర్టులో ఏం చెప్పారు?

మొదటి ఎఫ్ఐఆర్ నమోదైన నెల తర్వాత కొన్ని సామాజిక సంస్థలు, నిందితుల బంధువులు, న్యాయవాదులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

నాసిక్ టీసీఎస్ కేసు, మత మార్పిడి, ఉద్యోగులు
ఫొటో క్యాప్షన్, మార్చి 26న మొదటి ఎఫ్‌ఐఆర్ దాఖలైన తర్వాత, ఏప్రిల్ 2, 3 తేదీల మధ్య మరో ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు ఏం జరిగింది?

ఈ కేసు మార్చి 26న వెలుగులోకి వచ్చింది. నాసిక్‌లోని ఇంద్రానగర్ ప్రాంతంలో ఉన్న అశోక బిజినెస్ ఎన్‌క్లేవ్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కార్యాలయంలో పనిచేస్తున్న 23 ఏళ్ల మహిళ ముగ్గురు ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు.

ఆమె ఫిర్యాదు ఆధారంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడం, లైంగిక వేధింపులు, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలపై డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, నిదా ఖాన్‌లపై కేసు నమోదు చేశారు.

"ఈ కేసులో మొదటి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన మహిళ చాలా భయపడిపోయారు. ఆమె ఫిర్యాదు ఇచ్చే స్థితిలో లేరు. పోలీసులు ఆమెకు నమ్మకం, ధైర్యం ఇచ్చారు. తర్వాతే ఆమె ఫిర్యాదు చేశారు" అని నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కార్నిక్ బీబీసీకి చెప్పారు.

మార్చి 26న మొదటి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత, ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 3 మధ్య మరో ఎనిమిది ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. నాసిక్‌లోని ముంబయి నాకా పోలీస్ స్టేషన్‌లో వీటిని నమోదు చేశారు. 2022 నుంచి 2026 మధ్య కాలంలో టీసీఎస్ కార్యాలయంలో ఈ సంఘటనలు జరిగాయని వాటిలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ తొమ్మిది కేసుల విచారణ నాసిక్ జిల్లా, సెషన్స్ కోర్టులో వేర్వేరు రోజుల్లో జరుగుతోంది.

బాబా సయ్యద్
ఫొటో క్యాప్షన్, నిందితుల తరఫు న్యాయవాది బాబా సయ్యద్

మతమార్పిడి ప్రయత్నాలు జరిగాయా?

ఈ కేసులో అత్యంత సున్నితమైన, తీవ్రమైన అంశం మత మార్పిడి. సామూహిక ప్రయత్నం ద్వారా మతమార్పిడి చేయాలనే ఉద్దేశం నిందితులకు ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఆరోపణల ఆధారంగానే కొన్ని మీడియా సంస్థలు ఈ ఘటనను వేర్వేరు పదాలతో వివరిస్తూ వార్తలు ప్రచురించాయి.

కొన్ని మీడియా రిపోర్టులు ఈ కేసును వ్యవస్థీకృత మత మార్పిడికి ముడిపెట్టగా, మరికొన్ని ఇది అంతర్జాతీయ రాకెట్ అయి ఉండవచ్చని సూచించాయి.

"నమోదైన తొమ్మిది కేసుల్లో మత మార్పిడి ప్రయత్నం, మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం, కార్యాలయంలో లైంగిక వేధింపులు వంటివి ఉన్నాయి" అని పోలీస్ కమిషనర్ సందీప్ కార్నిక్ చెప్పారు.

అయితే ఇప్పుడు నిందితుల తరఫు న్యాయవాదులు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ అది నిజమే అయితే, ఎఫ్ఐఆర్‌లలో మతమార్పిడి గురించి ఎందుకు ప్రస్తావించలేదు? అని.

"ఈ కేసులోని ఏ ఎఫ్‌ఐఆర్‌లోనూ మతమార్పిడికి సంబంధించిన ప్రస్తావన లేదు. కొన్ని చోట్ల మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంపై ఒక సెక్షన్ రాశారు, కానీ అందులో మతమార్పిడి ప్రస్తావనే లేదు" అని నిందితుల న్యాయవాది రాహుల్ కస్లీవాల్ చెప్పారు.

నిందితుల తరఫు మరో న్యాయవాది బాబా సయ్యద్ మాట్లాడుతూ, "పోలీసుల రిమాండ్ రిపోర్టులో కూడా బలవంతపు మత మార్పిడి లేదా మత మార్పిడి జరిగినట్లు స్పష్టమైన ప్రస్తావన లేదు. అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన ఈ విషయాన్ని లేవనెత్తుతున్నారు?" అని ప్రశ్నించారు.

ఈ కేసులోని ఎఫ్ఐఆర్‌లను బీబీసీ పరిశీలించినప్పుడు మత మార్పిడి జరిగినట్లు స్పష్టమైన ప్రస్తావన ఏదీ కనిపించలేదు.

ఇప్పుడు కొన్ని సంస్థలు కూడా ముందుకొచ్చి ఇలాంటి ప్రశ్నలే లేవనెత్తుతున్నాయి.

"అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్" (ఏపీసీఆర్) అనే సంస్థ శుక్రవారం ముంబయిలో విలేఖరుల సమావేశం నిర్వహించింది. ఈ సంస్థకు చెందిన ఐదుగురు సభ్యుల బృందం నాసిక్‌కు వెళ్లి ఒక ఫ్యాక్ట్-ఫైండింగ్ రిపోర్ట్ విడుదల చేసింది. ఇది కూడా మత మార్పిడి ప్రయత్నాలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.

"ఈ కేసు మత మార్పిడికి సంబంధించినదే అయితే.. నాలుగేళ్లలో కనీసం ఒకరి మత మార్పిడి అయినా జరిగి ఉండాలి. కానీ బలవంతపు మత మార్పిడికి సంబంధించి ఒక్క కేసు కూడా లేదు. ఇదంతా ప్రతిష్టాత్మకమైన టీసీఎస్ వంటి కంపెనీలో జరుగుతోందని మనం గుర్తుంచుకోవాలి. నాలుగేళ్లుగా ఇంత పెద్ద కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది" అని ఏపీసీఆర్ జాతీయ కార్యదర్శి నదీమ్ ఖాన్ చెప్పారు.

నాసిక్ పోలీస్, కమిషనర్ సందీప్ కార్నిక్, టీసీఎస్ కేసు
ఫొటో క్యాప్షన్, నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కార్నిక్

పోలీసులకు ఫిర్యాదు ఎలా వెళ్లింది?

దీనిపై కూడా వివిధ రకాల సమాచారం ఉంది.

ఒక పోలీసు బృందం టీసీఎస్ కంపెనీకి వెళ్లి, అక్కడి వారితో మాట్లాడి, ఫిర్యాదుదారులను ముందుకు తీసుకువచ్చారని పోలీసులు చెప్పారు. అయితే, దీనికి ముందే ఫిర్యాదుదారులకి సంబంధం లేని మరో వ్యక్తి అప్పటికే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

మొదటి ఫిర్యాదు అందిన తర్వాత మహిళా పోలీసులు మఫ్టీలో టీసీఎస్ ఆఫీస్‌కి వెళ్లి, కొంతమంది మహిళలతో మాట్లాడి, వారికి భరోసా ఇచ్చారని, ఆ తర్వాత మరిన్ని ఫిర్యాదులు రావడంతో మార్చి 26న మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కార్నిక్ చెప్పారు.

ఇప్పటివరకు ఈ కేసులో టీసీఎస్ చేసిన ఏకైక బహిరంగ ప్రకటనలో, ఇలాంటి ఆరోపణల గురించి తమ అంతర్గత కమిటీకి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆ కంపెనీ తెలిపింది.

"నాసిక్ ఆఫీస్‌కి సంబంధించిన సిస్టమ్స్, రికార్డుల ఆధారంగా జరిపిన ప్రాథమిక దర్యాప్తులో, ఇలాంటి ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదులేవీ మా ఎథిక్స్ లేదా 'పోష్' కమిటీకి రాలేదని తేలింది" అని ఏప్రిల్ 17న టీసీఎస్ చేసిన ప్రకటనలో పేర్కొంది.

"నిందితులు బాధితుల కంటే పైస్థాయిలో లేదా టీమ్‌ని నడిపే స్థాయిలో ఉన్నందున, ఇన్నేళ్లుగా బాధితులు దీన్ని సహించారనే విషయాన్ని కొట్టిపారేయలేం" అని పోలీస్ కమిషనర్ కార్నిక్ అన్నారు.

ఇక్కడ ఇంకో ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అదేంటంటే, ఒకే రాత్రిలో ఇన్ని కేసులు ఎలా నమోదయ్యాయి? అని.

"ఏప్రిల్ 2, 3 తేదీలలో కొన్ని గంటల్లోనే ఎనిమిది ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. నిందితులను అదే రోజున అరెస్ట్ చేశారు. ఎందుకింత హడావిడి? గత నాలుగేళ్లుగా పోష్‌లో గానీ, హెచ్‌ఆర్‌లో గానీ ఒక్క ఫిర్యాదు లేదు. అలాంటిది అకస్మాత్తుగా అందరూ కలిసి ఒకే రోజు 8 ఫిర్యాదులు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు రావడం అనుమానాలను రేకెత్తిస్తోంది" అని నిందితుల న్యాయవాది బాబా సయ్యద్ అన్నారు.

బీబీసీ ఈ ప్రశ్నను నాసిక్ పోలీసులను కూడా అడిగింది. నేరాల తీవ్రత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకున్నామని దర్యాప్తులో పాల్గొన్న ఒక అధికారి చెప్పారు. ఆయన తన పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు.

"మాకు అందిన సమాచారం ప్రకారం, రంజాన్ మాసంలో ఉపవాసం చేస్తున్న ఒక హిందూ మహిళ గురించి తనకు సమాచారం ఉందని ఒక రాజకీయ పార్టీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఏ చట్టం కింద ఒక వ్యక్తి ఇలాంటి ఫిర్యాదు చేయగలరు? అలాంటి చట్టం ఏదీ లేదు" అని నాసిక్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ నిరంజన్ టక్లే అన్నారు.

నాసిక్ టీసీఎస్ కేసు, మత మార్పిడి, ఉద్యోగులు
ఫొటో క్యాప్షన్, కోర్టులో మహిళా హెచ్‌ఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన న్యాయవాదులు రాహుల్ కస్లివాల్, బాబా సయ్యద్

నిదా ఖాన్‌పై ఉన్న ఆరోపణలేంటి?

నాసిక్ టీసీఎస్‌ కేసులో నిదా ఖాన్ పేరు ప్రత్యేకంగా చర్చలోకి వచ్చింది. కొన్ని మీడియా కథనాలలో, ఆమెను ఈ మొత్తం కేసుకు సూత్రధారిగా పేర్కొన్నారు. ప్రస్తుతం, నిదా ముందస్తు బెయిల్ దరఖాస్తు కోర్టులో పెండింగ్‌లో ఉంది. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

అయితే, పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ని బట్టి చూస్తే పరిస్థితి వేరేలా కనిపిస్తోంది. ఈ తొమ్మిది కేసుల్లో నిదా ఖాన్ కేవలం ఒక ఎఫ్‌ఐఆర్‌లో మాత్రమే సహనిందితురాలిగా ఉన్నారు. మార్చి 26న దాఖలైన ఆ ఫిర్యాదులో, నిదా ఖాన్ తన మతభావాలను దెబ్బతీశారని బాధిత మహిళ ఆరోపించారు.

"నిదా ఖాన్ కేవలం ఒక కేసులో మాత్రమే నిందితురాలు. మిగిలిన ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లలో ఆమె పేరు ఎక్కడా లేదు, ఇతర నేరాలలో ఆమె సహ-నిందితురాలు కూడా కాదు. అయినప్పటికీ ఏ ప్రాతిపదికన ఆమెను ప్రధాన నిందితురాలిగా పరిగణించారో తెలియడం లేదు" అని నిదా ఖాన్ న్యాయవాది బాబా సయ్యద్ అన్నారు.

నాసిక్ టీసీఎస్ కేసు, మత మార్పిడి, ఉద్యోగులు

ఫొటో సోర్స్, TCS

ఫొటో క్యాప్షన్, టీసీఎస్ ప్రకటన కాపీ

"ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులు ఉన్నారు. అందులో ఇద్దరు మహిళలు. నిదా ఖాన్ ఒక కేసులో నిందితురాలు, ఆమెపై మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపణ ఉంది" అని నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కార్నిక్ బీబీసీ మరాఠీతో చెప్పారు.

మరోవైపు నిదా ఖాన్ పాత్రపై టీసీఎస్ తన ప్రకటనలో స్పష్టత ఇచ్చింది. మీడియాలో ఆమెను "హెచ్ఆర్ మేనేజర్"గా పేర్కొన్నప్పటికీ, వాస్తవానికి ఆమె "ప్రాసెస్ అసోసియేట్"గా పనిచేస్తున్నారని, ఆమెకు ఎలాంటి నాయకత్వ బాధ్యతలు లేవని కంపెనీ తెలిపింది. ఈ కేసు నేపథ్యంలో టీసీఎస్ ఆమెను సస్పెండ్ చేసింది.

నాసిక్ టీసీఎస్ కేసు, మత మార్పిడి, ఉద్యోగులు
ఫొటో క్యాప్షన్, శుక్రవారం ముంబయిలో పౌర హక్కుల పరిరక్షణ సంఘం (ఏపీసీఆర్) ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించింది.

'బాధ్యతారహితమైన రిపోర్టింగ్'

ఈ కేసుపై కొన్నిమీడియా సంస్థలు వార్తలు ప్రచురించిన తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. పోలీస్ లేదా కోర్టు విచారణల్లో కూడా ప్రస్తావన లేని కొన్నివార్తలు మీడియాలో వచ్చాయి.

జర్నలిస్టుగా కూడా పనిచేసిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ముంబయిలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ కేసు రిపోర్టింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

"ఈ రకమైన లైంగిక వేధింపులను ఏ మతానికీ, ఏ లింగానికీ ముడిపెట్టలేం. ఇది 'పవర్ ఆఫ్ కంట్రోల్' కారణంగా జరుగుతుంది. దీనికి మతం రంగు ఎందుకు పులిమారు? ఈ ప్రశ్న పోలీసులకు, ప్రభుత్వానికి, ముఖ్యంగా మీడియాని అడుగుతున్నా" అన్నారు తీస్తా సెతల్వాద్.

"మీడియాలో పెరుగుతున్న ఈ రకమైన రిపోర్టింగ్ అత్యంత బాధ్యతారాహిత్యమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది. అదే సమయంలో మహారాష్ట్ర రాజకీయ నాయకత్వం ఈ కేసులో చూపిస్తున్న పాత్ర కూడా బాధ్యతారాహిత్యంగా ఉంది. ఇది నేరుగా సమాజాన్ని విభజించడానికి చేసే ప్రయత్నం" అని తీస్తా సెతల్వాద్ అన్నారు.

సీఎం ఫడణవీస్ స్పందనేంటి?

ఈ విషయంపై స్పందిచాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను మీడియా అడిగినప్పుడు, ఆయన మాట్లాడుతూ " నాసిక్‌లోని టీసీఎస్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నందుకు టీసీఎస్‌కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. వారి చీఫ్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వారు పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారు, మేం ఈ విషయంలో మూలాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం" అన్నారు.

"ఇది ఒక్క ఘటనేనా లేక ఇలాంటివి ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయా అనే దానిపై మేం దర్యాప్తు చేస్తున్నాం. ఇది పెద్ద కుట్రలో భాగమా, ఇందులో ఎవరెవరున్నారు? ఈ విషయాలన్నింటిపైనా దర్యాప్తు జరుగుతోంది. కాబట్టి ఇది 'కార్పొరేట్ జిహాద్' అయితే, మేం కచ్చితంగా దీని మూలాలు కనుగొంటాం" అని ఫడణవీస్‌ అన్నారు.

మొత్తం మీద ఈ నాసిక్ కేసులన్నింటిలో అసలు నిజం ఇంకా బయటకు రాలేదు. కాబట్టి, దాని గురించి ముందుగానే నిర్ధరణకు రావడం కష్టం.

(అదనపు ఇన్‌పుట్స్: ప్రవీణ్ థాకరే)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)