షిప్ లైఫ్: సముద్రం మధ్యలో నావికులు అనారోగ్యానికి గురైనా, షిప్ ఇంజిన్లు పనిచేయకపోయినా ఏం చేస్తారు, ఎలా బయటపడతారు?

నౌక

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కే. శుభగుణం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఒమన్ జలాల్లో చిక్కుకుపోయిన నౌకలో అస్వస్థతకు గురైన తమిళనాడుకు చెందిన సెకండ్ ఆఫీసర్ నిశాంత్ ఉయిర్తనాథన్ మరణించారు.

సంఘర్షణలు, యుద్ధాలు చెలరేగినప్పుడు, సరిహద్దుల్లో సంక్షోభాలు తలెత్తినప్పుడు.. సాధారణంగా వాటి ప్రభావం తీర ప్రాంతాల్లోని ప్రజలపైనే ఎక్కువగా పడుతుంది.

కానీ, నగరాలకు, యుద్ధభూములకు వేల కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ప్రయాణించే నావికులు కూడా ఈ సంక్షోభాల పర్యవసానాలను ఎదుర్కొంటున్నారు. వారు ఎదుర్కొనే సవాళ్లు భిన్నంగా ఉంటున్నాయి.

కనుచూపు మేరంతా నీరు తప్ప మరేమీ లేని సముద్ర జలాల్లో భారీ నౌకల్లో చిక్కుకున్న నావికులు ఇంటికి చేరుకోవడానికి సురక్షితమైన మార్గం కోసం ఎదురుచూస్తుంటారు.

ఇటీవల హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానం తీవ్రంగా ప్రభావితమైనప్పుడు, చాలా మంది నావికులు పర్షియన్ గల్ఫ్‌, దాని చుట్టుపక్కల నౌకలలో చిక్కుకుపోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

అలాంటి వారిలో కాంచీపురానికి చెందిన చీఫ్ ఇంజనీర్ శశికుమార్ ఒకరు. గత మార్చిలో కువైట్‌కు సమీపంలో లంగరు వేసిన మర్చెంట్ షిప్‌లో ఉన్న భారతీయ నావికుడు ఈయన.

సముద్రంలో ఉండే నావికులకు యుద్ధాలు, సంక్షోభాలు లేదా వివిధ కారణాల వల్ల వారాలు లేదా నెలల తరబడి జరిగే ఆలస్యం అనేక సవాళ్లను కలిగిస్తుంది. భోజన వసతి, మానసిక ఆరోగ్యం, వైద్య అత్యవసర పరిస్థితులు, ఇంధన నిర్వహణ, ఇంకా "మనం ఎప్పుడు ఒడ్డుకు చేరుకుంటాం?" అనే అంతులేని ప్రశ్న వంటి వాటితో వారు సతమతమవ్వాల్సి ఉంటుంది.

నావికులు ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు? నౌకలో ముందస్తు చర్యలేవైనా తీసుకుంటారా? ఇలాంటి అంశాలపై అనుభవజ్ఞులైన నావికులతో బీబీసీ మాట్లాడింది.

శశికుమార్, ఒక నౌకలో చీఫ్ ఇంజనీర్

ఫొటో సోర్స్, SASIKUMAR

నౌకలో ఎంత కాలం మనుగడ సాధించవచ్చు?

ఆధునిక వాణిజ్య నౌకలను ఎక్కువ కాలం సముద్రంలో ఉండేలా రూపొందిస్తారని షిప్ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శశికుమార్ తెలిపారు.

''సాధారణంగా తరచూ ఆగే అవసరం ఉన్న ప్రయాణికుల నౌకల్లా కాకుండా.. కార్గో నౌకలు ఒక ఫ్లోటింగ్ సిటీలా పనిచేస్తాయి. సొంతంగా వాటికంటూ విద్యుత్ ఉత్పత్తి, నీటి సరఫరా వ్యవస్థ, ఆహార నిల్వలు, వైద్యచికిత్స, ఇంజనీరింగ్ సౌకర్యాలను ముందుగానే ఏర్పాటు చేస్తారు'' అని కార్గో షిప్‌కు సెకండ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన ముత్తు సూర్య తెలిపారు.

మారిటైమ్ లేబర్ కన్వెన్షన్ 2006 (ఎంఎల్‌సీ) ప్రకారం.. సముద్రయాన కార్మికులకు వారి ఒప్పంద కాలమంతటా తగిన నాణ్యత గల ఆహారం, తాగునీరు అందించాలి. నౌకలు తమ సిబ్బంది సంక్షేమాన్ని పరిరక్షించే వాతావరణాన్ని తప్పనిసరిగా నిర్వహించాలి.

కానీ, అనుజవజ్ఞులైన నావికులు చెబుతున్న వివరాలమేరకు సముద్రంలో నౌకలు ఎంత కాలం ఎలాంటి అంతరాయం లేకుండా కార్యకలాపాలు సాగించగలవనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిసింది.

''నౌక పరిమాణం, సిబ్బంది సంఖ్య, స్టోరేజీలోని ఆహార మొత్తం, చమురు నిల్వలు, మెషినరీ, ఎక్విప్‌మెంట్ పరిస్థితులు, అవసరమైన సామాగ్రిని వెంటనే అందుకోగలిగే సామర్థ్యం, వాతావరణం, నౌక వెళ్లే ప్రాంతం వంటి చాలా అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి'' అని ముత్తు సూర్య తెలిపారు.

"ఒక పెద్ద వాణిజ్య నౌకలో సాధారణంగా కొన్ని వారాలు లేదా నెలలకు సరిపడా ఆహారం, నిత్యావసర వస్తువులు ఉంటాయి. ముఖ్యంగా, డ్రై ఫుడ్ కార్గోను కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు సరిపోయే విధంగా నిల్వ చేస్తారు" అని శశికుమార్ వివరించారు.

''ఎక్కువ కాలం సముద్రయానాలు చేసే నౌకలు, తమ ప్రణాళికాబద్ధమైన ప్రయాణ వ్యవధికి అనుగుణంగా సరుకును సమకూర్చుకుంటాయి. ఏదైనా ఆలస్యం జరగొచ్చనే అంచనాతో అదనపు సరుకులను కూడా తీసుకెళ్తుంటాయి. అయితే అనుకోని సంక్షోభం తలెత్తినప్పుడు, నౌకలోని సీనియర్ అధికారులు ఆ సరుకులు ఎంతకాలం సరిపోతాయో ముందుగానే చూసి, సమీప నౌకాశ్రయానికి త్వరగా చేరుకోవడానికి ఏమి చేయచ్చో చూస్తారు" అని ముత్తు సూర్య వివరించారు.

నావికులు

ఫొటో సోర్స్, MattooShashank/X

ఫొటో క్యాప్షన్, నిశాంత్ మృతదేహం పాడవ్వకుండా ఉంచడానికి ఎలాంటి సదుపాయం లేదని నౌకలోని నావికులు ఆరోపించారు.

వారాలతరబడి సముద్రంలోనే చిక్కుకుపోతే..?

ఒక నౌక తన సముద్రయానాన్ని కొనసాగించలేకపోయినప్పుడు ''దాని సిబ్బంది సాధారణంగా ఒక సురక్షితమైన ప్రదేశంలో లంగరు వేస్తారు లేదా సేఫ్టీ క్లియరెన్స్ కోరి, సమీప ఓడరేవులో ఆశ్రయం కోరతారు. ఇలాంటి పరిస్థితులు సాధ్యం కానప్పుడు, పరిస్థితి మెరుగయ్యేంత వరకు నియంత్రిత సముద్ర జలాల్లోనే ఆ నౌకలు ఉండాల్సి వస్తుంది'' అని శశికుమార్ వివరించారు.

ఈ సమయంలో "ఇంజిన్ రూమ్ పనిచేస్తూనే ఉండాలి, నావిగేషన్ పరికరాలను పర్యవేక్షించాలి, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. తీవ్ర సంక్షోభం ఉన్నప్పటికీ ఈ పనులు కొనసాగుతాయి" అని ముత్తు సూర్య తెలిపారు.

"నౌకలోని సిబ్బంది ప్రాణాలకు ప్రమాదం ఉంటే, వారిని కాపాడటంపైనే పూర్తి దృష్టి ఉంటుంది. సాధారణంగా, కెప్టెన్, చీఫ్ ఇంజనీర్‌ సహా సుమారు నలుగురు అధికారులు మాత్రమే కమాండింగ్ అధికారులుగా ఉంటారు. ఇంజనీర్లు, డెక్ ఆఫీసర్ల వంటి ఇతర సిబ్బంది పని వీరి ఆదేశాలను పాటించడమే" అని వివరించారు.

‘‘సాధారణంగా కమాండింగ్ ఆఫీసర్ల నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించరు. ఎందుకంటే సముద్రం మధ్యలో వాదోపవాదాల కారణంగా పనిభారం పెరగడం తప్ప మరో పరిష్కారమేమీ దొరకదు. పైగా ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితులలో ఉంటారు కాబట్టి కమాండింగ్ అధికారుల మాటను ఎవరూ వ్యతిరేకించరు’’ అని శశికుమార్ తెలిపారు.

ముత్తు సూర్య

ఫొటో సోర్స్, MUTHU SURYA

ఫొటో క్యాప్షన్, కార్గో నౌకలో సెకండ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తమిళనాడు నావికుడు ముత్తు సూర్య

నౌకలో ఎంత ఆహారం, తాగునీరు అందుబాటులో ఉంటుంది?

ప్రతి నౌకకు భిన్నమైన అవసరాలు ఉంటాయి. కానీ ఎంత ఆహారం, నీరు నిల్వ ఉంచాలనే దానిపై నిర్దిష్టమైన లెక్క అంటూ ఏదీ లేదని నావికులు చెబుతున్నారు.

నౌకలో ఆహార సరఫరాను సాధారణంగా "సిబ్బంది సంఖ్య, ప్రయాణ వ్యవధి, అత్యవసర సరఫరా అవసరాలు, జెండా దేశ నిబంధనల" ఆధారంగా లెక్కిస్తారు.

''ఆహారపు పదార్థాల్లో సాధారణంగా బియ్యం, పిండి, ప్రాసెస్డ్ మీట్, ఇతర ప్రాసెస్డ్ ఉత్పత్తులు, ఎక్కువ కాలం నిల్వ ఉండే కూరగాయాలు, త్వరగా పాడవని ఆహార పదార్థాలు ఉంటాయి" అని నౌక చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శశికుమార్ వివరించారు.

దీనికి అదనంగా, ఫ్రెష్‌వాటర్ జనరేటర్లు అని పిలిచే సముద్రపు నీటి శుద్ధి వ్యవస్థలను ఉపయోగించి తాగునీటిని ఉత్పత్తి చేసే వ్యవస్థ కూడా నౌకలో ఉంటుందని ముత్తు సూర్య తెలిపారు.

''ప్రయాణంలో.. 15 రోజులకు సరిపడా పండ్లు, కూరగాయాలు ఉంటాయి. నెలకు సరిపడా ప్రాసెస్డ్ మీట్ ఉంటుంది. బియ్యం వంటి ఇతర ఆహార పదార్థాలు స్టోరేజ్‌లో ఉంటాయి'' అన్నారు.

''సముద్రపు నీటి శుద్ధి వ్యవస్థలు దాదాపు అన్ని నౌకలలో ఉంటాయి. అంటే, రోజువారీ తాగునీటి అవసరాలకు ఎలాంటి ఢోకా లేదు. ఈ వ్యవస్థలు సముద్ర జలాలను తాగునీరుగా మారుస్తాయి. దీంతో, నిల్వ చేసిన నీటిపై ఆధారపడటం తగ్గుతుంది'' అని తెలిపారు.

అయితే, సంక్షోభాలు, ఉద్రిక్తతలలో నౌక చిక్కుకున్నప్పుడు ఆహారం ఒక్కటే సమస్య కాదని నావికులు చెప్పారు.

చాలా సందర్భాలలో, ఇంధన సరఫరాలు, విడి భాగాలు, వైద్య సహాయం, సిబ్బంది ఓర్పు ప్రధాన అడ్డంకులుగా ఉంటాయన్నారు.

అంతేకాకుండా, "ఈ వ్యవస్థలకు ఇంజన్లు సజావుగా పనిచేయడం అవసరం. అందువల్ల, ఒకవేళ నౌకలో కరెంట్ పోయినా లేదా పెద్ద సాంకేతిక వైఫల్యాన్ని ఎదుర్కొన్నా, కనీస అవసరాలు కూడా దెబ్బతినవచ్చు'' అని ముత్తు సూర్య చెప్పారు.

ఓడరేవు

ఫొటో సోర్స్, SASIKUMAR

సముద్ర జలాల్లో నావికుల ఆరోగ్యం క్షీణిస్తే..?

సముద్రంలో సంక్షోభం మధ్యలో చిక్కుకున్నప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తితే ఎలా అనేది నావికుల అతిపెద్ద భయాలలో ఒకటి అని ముత్తు సూర్య అన్నారు.

''సాధారణంగా వాణిజ్యపరంగా కార్యకలాపాలు సాగించే కార్గో నౌకల్లో సిబ్బంది సంఖ్యను బట్టి అవసరమైన మెడిసిన్లు, వైద్య సరఫరాలు, పెద్ద ఆక్సిజన్ సిలిండర్లు, చిన్న పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్లు, ఫస్ట్ ఎయిడ్‌లో శిక్షణ పొందిన వ్యక్తులు ఉంటారు'' అని తెలిపారు.

"అంతేకాకుండా, ఉన్నతాధికారులకు ముందుగానే ఫస్ట్ ఎయిడ్‌ శిక్షణ ఇస్తారు. కొన్నిపెద్ద నౌకలలో వారికి వైద్య అధికారులను కూడా కేటయిస్తారు" అని ముత్తు సూర్య వివరించారు.

అయితే, నౌక ఒక ఆసుపత్రిగా ఉండలేదని చెబుతూ.. "గుండెపోటు, తీవ్రమైన గాయం లేదా ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు, నౌక కెప్టెన్ శాటిలైట్ ఫోన్ ద్వారా వైద్య సలహాలు తీసుకుని దానికి అనుగుణంగా చికిత్స చేస్తారు. శాటిలైట్ ఫోన్ ద్వారా వైద్యులతో నేరుగా కాంటాక్ట్ కొనసాగించవచ్చు. దీంతో, అనారోగ్యం పాలైన వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక విధంగా సహాయపడుతుంది" అని అన్నారు.

''ఒకవేళ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారితే.. వీలైతే తక్షణమే సమీపంలోని ఓడరేవుకు తీసుకెళ్లడం, హెలికాప్టర్ ద్వారా తరలించడం, సమీప ఇతర నౌకల నుంచి సాయం కోరడం వంటి ఏమైనా సాధ్యమవుతాయో ప్లాన్ చేయాలి. తీర ప్రాంతానికి నౌక ఎంత దూరంలో ఉంది, వాతావరణ పరిస్థితులేంటి, భద్రతా పరిస్థితులేంటి, సాధ్యమయ్యే రెస్క్యూ మార్గాలను ఆధారంగా చేసుకుని ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుంది'' అని వివరించారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ముందే శిక్షణ తీసుకోవాలి

అంతర్జాతీయ సముద్రయాన సంస్థ కింద రూపొందిన ప్రపంచ సముద్రయాన ఒప్పందమైన నావికుల శిక్షణ, ధ్రువీకరణ, వాచ్‌కీపింగ్ ప్రమాణాల అంతర్జాతీయ కన్వెన్షన్ (ఎస్‌టీసీడబ్ల్యూ, 1978) నావికుల తప్పనిసరి శిక్షణకు సంబంధించిన కనీస ప్రమాణాలను నిర్ణయించింది.

నౌకల్లో పయనించడానికి ముందే.. నావికులు ''సర్వైవల్ టెక్నిక్స్, అగ్నిమాపక చర్యలు, ప్రథమ చికిత్స, వైద్య సహాయం, అత్యవసర పరిస్థితుల విధానాలు, నౌకను విడిచిపెట్టే వెళ్లే విధానాలు, లైఫ్‌బోట్ నిర్వహణ, అత్యవసర సమాచార ప్రసారం, భద్రతా అవగాహన" వంటి అంశాలలో శిక్షణ పూర్తి చేసి ఉండాలి.

''సముద్ర ప్రయాణంలో సంక్షోభాలు, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు చాలా తక్కువ సమయమే ఉంటుంది. అంతర్జాతీయ సముద్రయాన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నౌకలు క్రమం తప్పకుండా సేఫ్టీ డ్రిల్స్‌ను చేపట్టాలి'' అని ముత్తు సూర్య చెప్పారు.

సముద్రాల గుండా తరలించే ప్రతి కంటైనర్, ఫ్యూయల్ కార్గో, ముడిసరుకు భద్రత నావికులపై ఆధారపడి ఉంటుంది.

''తుపానులు, మెకానిక్ ఫెయిల్యూర్లు, ఎమర్జెన్సీలు నిర్వహించేలా మాకు శిక్షణ ఇస్తారు. కానీ, వేలాది కిలోమీటర్ల అవతల జరిగే యుద్ధం భిన్నమైన సవాలును విసిరింది'' అని కాంచీపురానికి చెందిన నావికుడు శశికుమార్ తెలిపారు.

''ఇది ఒక నౌకను సంక్షోభం మధ్యలో చిక్కుకుపోయేలా చేస్తుంది. దీంతో నౌకలోని నావికులు, 'మేం ఎప్పుడు ఇంటికి చేరుకుంటాం?' అనే సమాధానం లేని ప్రశ్నతో ఎదురుచూస్తూ ఉంటారు'' అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)