కారు, బైకు‌లలో ఇకపై ఇథనాల్‌ పోసి నడుపుకోవచ్చా, దీనికి ఏం చేయాలి? ప్రభుత్వం ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తోంది?

ఇథనాల్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో వందశాతం ఇథనాల్ (ఇ100)ను వాహనాల్లో ఇంధనంగా వినియోగించడానికి సిద్ధమైనట్లు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ జూన్ 13న ప్రకటించారు.

"వంద శాతం ఇథనాల్‌ను ఇంధనంగా వినియోగించుకునేందుకు ఉద్దేశించిన ఫైల్‌పై జూన్ 12న సంతకం చేశాను" అని చెప్పారు.

సంప్రదాయ శిలాజ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ బదులుగా ఇథనాల్ వాడకం వైపు అడుగులు వేయడం దేశ రవాణా రంగంలో కీలక మలుపు కానుంది.

ఇథనాల్ ఇప్పటికే వినియోగంలో ఉందిగానీ, అది నేరుగా కాకుండా పెట్రోల్‌తో నిర్దేశిత మోతాదులో కలిపి (బ్లెండ్ చేసి) వాడుతున్నారు.

అయితే ఇథనాల్‌ను ఇంధనంగా వాడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించినా, ఇప్పటికిప్పుడు వాహనాల్లో మార్పులు చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

''అది మంచి నిర్ణయమే. కానీ, ఇప్పుడున్న వాహనాల ఇంజిన్లు పూర్తి స్థాయి ఇథనాల్ వినియోగానికి తగ్గట్టుగా లేవు. భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది'' అని ఆటోమొబైల్ రంగ నిపుణులు, జేఎన్టీయూ-హైదరాబాద్ ప్రొఫెసర్ కె.విజయ్ కుమార్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

పెట్రోల్, డీజిల్ వినియోగం భారత్‌లో ఎక్కువ. 2026 మేలో 39.10లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ వినియోగించినట్లు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అదే నెలలో డీజిల్ వినియోగం చూస్తే 87.28లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది.

ఇథనాల్, పెట్రోల్, డీజిల్, చమురు, భారత్, e-85,

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పటికే అందుబాటులో ఇ85 ఇంధనం

దిగుమతులు తగ్గించాలంటే ఇథనాల్‌పై ఆధారపడటమే మేలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగాన్ని అధికంగా ప్రోత్సహిస్తోంది.

ఇప్పటివరకు ఇ20 (పెట్రోల్ 80శాతం, ఇథనాల్ 20శాతం కలిపిన ఇంధనం) భారత్‌లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్ కంపెనీలు ఇందుకు తగ్గట్టుగా వాహనాల ఇంజిన్లలో మార్పులు చేశాయి.

ఇంధనంలో ఇథనాల్ గాఢతను బట్టి ఇంజిన్ పనితీరు ఆధారపడి ఉంటుందని విజయ్ కుమార్ రెడ్డి వివరించారు.

"ఇథనాల్‌ను 29 శాతం మేర కలిపి ఇంధనంగా వినియోగించే విషయంపై ఆర్ అండ్ డీ జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది. ఇథనాల్ గాఢత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంజిన్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి. దాన్ని న్యూట్రల్ చేయగలిగేలా ఇంజిన్లు ఉండాలి" అని చెప్పారు.

ఇథనాల్, పెట్రోల్, డీజిల్, చమురు, భారత్, e-85,

ఫొటో సోర్స్, Getty Images

అసలు ఏమిటీ ఇథనాల్?

ఇటీవలే దేశంలో ఇ85 ఇంధనాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. దిల్లీలో ఇ85 అవుట్ లెట్‌ను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి జూన్ 5న ప్రారంభించారు.

ఇ85 అంటే 80-85శాతం ఇథనాల్, 14-19శాతం పెట్రోల్‌.. అంటే అధిక ఇథనాల్ కలిపిన ఇంధనం ఇది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ కేటగిరీ వాహనాల్లో అధిక ఇథనాల్‌తో నడిచే వాహనాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇ85 నుంచి ఇ100 తీసుకువస్తున్నట్లు కేంద్రం చెబుతోంది.

"మారుతి సుజుకీ, హీరో మోటో కార్ప్ రెండు రకాల ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు (ఎఫ్ఎఫ్‌వీ) విడుదల చేశాయి. ఇవి పూర్తిగా ఇథనాల్‌తోనే నడుస్తాయి. మరో నెలన్నర, రెండు నెలల్లో టయోటా, సుజుకి, ఎంజీ, హ్యుందాయ్ కూడా అలాంటి వాహనాలు తీసుకురానున్నాయి" అని నితిన్ గడ్కరీ చెప్పారు.

అలాగే, దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెందిన 48 అవుట్ లెట్లలో ఇ85ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు.

అయితే, పూర్తిగా ఇథనాల్‌పై ఆధారపడిన వాహనాలను వాహనదారులు నడిపించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చని విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గణేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

"భవిష్యత్తులో ఇథనాల్ ఆధారిత వాహనాలు పెరగొచ్చు. దానికి బాగా సమయం పడుతుంది. అందుకు చాలాకాలమే వేచి చూడాలి" అని అన్నారు.

అయితే, కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పెట్రోల్‌పై ఆధారపడటం తగ్గొచ్చని ఆయన అన్నారు.

ఇథనాల్‌ను ఇథైల్ ఆల్కహాల్ అని కూడా పిలుస్తారు. రంగు లేని మండే స్వభావం కల ఓ రకమైన ఆల్కహాల్ ఇది. బయో ఇంధనంగా, ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో సాల్వెంట్‌గా, బేవరేజస్‌లో కీలకమైన ద్రావణంగా దీన్ని వాడుతుంటారు.

సాధారణంగా చెరుకు పిప్పి, మొక్కజొన్న, గోధుమ, ఇతర ఆహారధాన్యాల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తారు.

ఇథనాల్ ఫర్ ఇండియా పోర్టల్ ప్రకారం దేశంలో 450కు పైగా ఇథనాల్ విక్రయించే రిజిస్టర్డ్ వ్యాపారులున్నారు.

దేశంలో ప్రస్తుతం పెట్రోల్‌తో ఇథనాల్ బ్లెండింగ్ 20శాతం ఉండగా 2030-31 నాటికి దాదాపు 26-27శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇథనాల్ వాడకం పెరగాలంటే, వాహనాల డిజైన్లు, ఇంజిన్లలో మార్పులు చేయాలని రవాణా రంగ నిపుణుడు సీఎల్ఎన్ గాంధీ అభిప్రాయపడ్డారు.

"ఇథనాల్ అనేది బయో ప్రొడక్టు. దాని ద్వారా కూడా నైట్రస్ ఆక్సైడ్ వంటివి వెలువడతాయి. నేరుగా పెట్రోల్‌తో నడిపినప్పటితో పోల్చితే ఇథనాల్ కలిపిన ఇంధనం వాడకం కారణంగా మైలేజీ తగ్గుతుంది. ఇప్పటికే రోడ్లపై ఉన్న వాహనాల్లో ఇథనాల్ వినియోగానికి వీలుండదు. ఇకవేళ నిర్దేశిత స్థాయిని మించి బ్లెండ్ చేసి వాడితే ఇంజిన్ పాడయ్యే ప్రమాదం ఉంది" అని సీఎల్ఎన్ గాంధీ బీబీసీతో చెప్పారు.

అయితే, ప్రస్తుతం ఉన్న ఇంజిన్లలో భారీ మార్పులు చేయగలిగితే ఇథనాల్ సాయంతో నడిచేలా చేయవచ్చని, అది పెద్ద ప్రహసనం అవుతుందని ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి అన్నారు.

"వాహనాల్లో ఎలక్ట్రానిక్ ఇండక్షన్ యూనిట్లు, సిలిండర్లు మార్చాలి. దీనిపై ఆర్ అండ్ డీ కోసం ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. దానివల్ల పరిశోధనలకు ప్రోత్సాహం లభిస్తుంది" అని అన్నారు.

ఇథనాల్, పెట్రోల్, డీజిల్, చమురు, భారత్, e-85,

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఏడాది డిసెంబరు నాటికి 500 ఫ్యూయల్ స్టేషన్లు, 2027 డిసెంబరు నాటికి 5వేల ఇ85 ఫ్యూయెల్ అవుట్ లెట్లు తీసుకురానున్నట్లు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ప్రస్తుతం ఉన్న వాహనాల్లో మార్పులు చేయడం కంటే కొత్తగా వాహనాలు తీసుకువచ్చే అవకాశం ఉందని గణేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

"బీఎస్ 6 ఇంజిన్ 20శాతం ఇథనాల్ బ్లెండ్ వరకు పనిచేస్తుంది. ఇంజిన్లలో మార్పులు చేసి కొత్త వేరియంట్లను తీసుకువస్తేనే ఇథనాల్ ఆధారంగా వాహనాలు ఎక్కువ జీవిత కాలంతో నడిపించే వీలుంటుంది" అని చెప్పారు.

దేశంలో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం, పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2001లో పెట్రోల్‌లో 5 శాతం ఇథనాల్ కలిపి వినియోగించాలనే ప్రాజెక్టును పైలెట్‌గా ప్రారంభించింది.

దీని ఫలితాల ఆధారంగా 2002 సెప్టెంబరు 3న ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం ప్రారంభించింది.

తొలి విడతగా 2003లో 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేయగా, 2006లో మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించింది.

0.1శాతం నుంచి 1.5శాతం బ్లెండింగ్ రేంజ్‌లో చేపట్టిన ఈబీపీ ప్రాజెక్టు 2013-14 వరకు మిశ్రమ ఫలితాలు సాధించినట్లు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2021లో విడుదల చేసిన నీతి ఆయోగ్ నివేదిక దీన్ని స్పష్టం చేస్తోంది.

2013-14 నాటికి 173 కోట్ల లీటర్ల ఇథనాల్ దేశంలో సరఫరా అవుతుండగా, 2020-21 నాటికి అది 332 కోట్ల లీటర్లకు చేరుకుందని ప్రకటించింది. దీని ప్రకారం, 8.50శాతం బ్లెండింగ్ జరుగుతున్నట్లుగా నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది.

ఇథనాల్, పెట్రోల్, డీజిల్, చమురు, భారత్, e-85,

ఫొటో సోర్స్, Getty Images

లక్ష్యానికంటే ఐదేళ్ల ముందే ఇ20 వాడకం

కేంద్ర ప్రభుత్వం 2018లో నేషనల్ పాలసీ ఆన్ బయో ఫ్యూయల్స్ తీసుకువచ్చింది. ఈ పాలసీ ప్రకారం బయో, వ్యవసాయ మిగులు వ్యర్థాలు, ఉత్పత్తులను ఉపయోగించి జీవ ఇంధన తయారీ పెంచాలని సూచించింది.

అలాగే, 2022 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం (బ్లెండింగ్) పది శాతం (ఇ10), 2030 నాటికి 20శాతానికి (ఇ20) పెంచాలనేది ప్రణాళిక.

ఇందులో పదిశాతం ఇథనాల్ బ్లెండింగ్ (ఇ10) 2021-22 నాటికి చేరుకోగా, 2026 జనవరి 31 నాటికి 20శాతం (ఇ20) చేరుకుందని కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ 2026 మార్చిలో లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.

2025 నాటికి దేశంలో పెట్రోల్‌తో బ్లెండింగ్ కోసం 1016 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం ఉండగా, మరో 334 కోట్ల లీటర్లు పరిశ్రమల వినియోగానికి అవసరం ఉందని నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ వెబ్ సైట్ ప్రకారం స్పష్టమవుతోంది.

ఇవి కాకుండా ఇతర అవసరాలను కలుపుకొని 1700 కోట్ల లీటర్ల సామర్యంతో ప్లాంట్లు అందుబాటులోకి రావాలని భావించింది. అయితే, 2024 సెప్టెంబరు నాటికి దేశంలో 1648 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేయగల పరిశ్రమలు ఉండగా, మరో 120 కోట్ల లీటర్ల ప్లాంట్లు నిర్మాణ దశల్లో ఉన్నట్లు కేంద్రం చెప్పింది.

అయితే, కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ శాఖ మార్చిలో లోక్ సభకు చెప్పిన లెక్కల ప్రకారం, 2024-25 నాటికే 1000 లీటర్లకు పైగా సరఫరా దేశంలో జరుగుతోందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇ85 లేదా ఇ100ను ప్రోత్సహించాలంటే, ఇథనాల్ ఉత్పత్తి భారీగా జరగాల్సి ఉంది.

ఇథనాల్, పెట్రోల్, డీజిల్, చమురు, భారత్, e-85,

ఫొటో సోర్స్, Getty Images

ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉందంటే…

ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ లేదా ఇ20 వినియోగించినప్పుడు అలాంటి వాహనాలకు బీమా వర్తిస్తుందా? అనే విషయంపై కొన్ని రోజులుగా వివాదం నెలకొంది.

ఈ విషయంలో బీమా కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ స్పష్టత ఇచ్చింది.

"ఇ20తో నడిచే కారుకు బీమా సౌకర్యం వర్తిస్తుంది. ఇ20 ఇంధనానికి అనుకూలంగా లేని కార్ల విషయంలో సంక్లిష్టత ఏర్పడుతోంది. అలాంటి కార్లకు ఇ20 ఇంధనం పోసి నడిపించి బీమా కోసం క్లెయిమ్ చేస్తే తిరస్కరించే అవకాశం ఉంది. అలా అనుకూలంగా లేని ఇంధనం పోయడం నిర్లక్ష్యం కిందకు వస్తుంది" అని ఐసీఐసీఐ లాంబార్డ్ చెబుతోంది.

ఈబీపీ కార్యక్రమంతో దేశంలో 2014-15 నుంచి 2026 జనవరి నాటికి ఇథనాల్ సరఫరాతో రైతులకు రూ.1.47 లక్షల కోట్లు ప్రయోజనం చేకూరిందని కేంద్రం చెబుతోంది.

వాహనాల్లో పెట్రోల్‌తో కలిపి ఇథనాల్ వాడకం కారణంగా సుమారు 851 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ తగ్గిందని, 283 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ వాడకం తగ్గిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలిపి ఇంధనంగా వాడుతున్న దేశం భారత్ ఒక్కటే కాదు, బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సహా కొన్ని యూరోపియన్ దేశాలు ఇ20 పెట్రోల్ వాడుతున్నాయి.

బ్రెజిల్ ఈ కోవలో ముందున్నదని చెప్పాలి. 1970ల నుంచే ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను అక్కడ ఇంధనంగా వాడుతున్నారు.

బ్లూమ్‌బర్గ్ 2023, 2025 నివేదికల ప్రకారం , ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ (ఎఫ్ఎఫ్‌వీ) వినియోగం 2025 నాటికి బ్రెజిల్‌లో సుమారు 84.5 శాతానికి చేరుకుంది. ప్రజల నుంచి ఆమోదం లభించినప్పటికీ, ఇథనాల్ కోసం చెరుకు పంటపై ఆధార పడటంతో పర్యావరణపరంగా మిశ్రమ ఫలితాలు కనిపించినట్లు నివేదిక చెబుతోంది.

అమెరికాలో ఇ10 ఇంధనం వాడుతుండగా, ఇ15 ఇంధనం పది శాతం ఫ్యూయల్ స్టేషన్లలో వాడుతున్నారు. సీజన్‌ను బట్టి ఇ85 కూడా వినియోగంలో ఉంది.

యూరోపియన్ దేశాలైన ఆస్ట్రియా, బెల్జియంలో ఇ10 ఇంధనం వాడుతుంటే, జర్మనీ, ఫిన్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో వినియోగదారులకు ఇ10 లేదా ఇ15 తమ వాహనాలకు వినియోగించుకునే వీలుందని బిజినెస్ స్టాండర్డ్ 2025 ఆగస్టులో రాసిన కథనంలో పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)