మోదీని ఉద్దేశించి ఖర్గే చేసిన వ్యాఖ్యలేంటి, క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తుంది?

ఫొటో సోర్స్, ANI
బిహార్ రాజధాని పట్నాలో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నరేంద్ర మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
కాంగ్రెస్ ఆదివారం (అక్టోబర్ 25న) ర్యాలీ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి మధ్యలోకి వచ్చి నరేంద్ర మోదీ అధికారాన్ని కోల్పోరంటూ నినాదాలు చేశారు.
ఆ వ్యక్తి చేసిన నినాదాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఖర్గే ప్రసంగిస్తున్న సమయంలో ఆయన లేచి నిలబడి, నరేంద్ర మోదీకి మద్దతుగా స్లోగన్స్ ఇవ్వడం కనిపిస్తోంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఖర్గే.. మోదీపై వ్యాఖ్యలు చేశారు.
ఖర్గే చేసిన ఆ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
హోంమంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి సహా పలువురు నేతలు ఖర్గే వ్యాఖ్యలను ఖండించారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

మల్లికార్జున ఖర్గే ఏమన్నారు?
బిహార్‌లో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీకృష్ణ సింగ్ 139వ జయంతి సందర్భంగా అక్టోబర్ 25న పట్నాలో ఒక కార్యక్రమం నిర్వహించారు.
ఆ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నప్పుడు జనంలో నుంచి ఒక వ్యక్తి అకస్మాత్తుగా లేచి "నరేంద్ర మోదీ ఎక్కడికీ వెళ్లరు. ఆయన అక్కడే ఉంటారు" అని నినాదాలు చేయడం ప్రారంభించారు.
దీనిపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ తండ్రిని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు బీజేపీ నేతల విమర్శలకు కారణమవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఖర్గే వ్యాఖ్యలు చేసిన వెంటనే, ఆ వ్యక్తిని సభా ప్రాంగణం నుంచి బయటకు పంపేశారు.
ఈ ఘటన అనంతరం ఓ బీజేపీ నాయకుడు మల్లికార్జున ఖర్గేపై పట్నాలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. అమిత్ షా ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.
"మోదీని, ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నేతలు అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కొన్నిసార్లు ఆయన తల్లిని లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేశారు. మరికొన్నిసార్లు ఆయనను 'మృత్యు వ్యాపారి' అని పిలిచారు. ఇంకొన్ని సందర్భాల్లో ఆయన పేదరికాన్ని ఎగతాళి చేస్తూ, టీ అమ్మే వ్యక్తి అని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజూ మర్యాదల హద్దులు దాటుతోంది" అని అన్నారు.
"మోదీని గానీ, ఆయన కుటుంబ సభ్యులను గానీ అవమానించేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేసిన ప్రతిసారీ, ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పారు" అని అమిత్ షా అన్నారు.
"మోదీని ఉద్దేశించి పట్నాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వాడిన అసభ్యకరమైన భాష కాంగ్రెస్ సిద్ధాంతపరమైన దివాలాకోరుతనాన్ని ప్రతిబింబిస్తోంది" అని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
ఇదిలా ఉండగా, బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి స్పందిస్తూ, ఖర్గే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
గందరగోళం సృష్టించేందుకే వచ్చారని కాంగ్రెస్ ఆరోపణ
కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడుతున్న సమయంలో గందరగోళం సృష్టించిన వ్యక్తి బీజేపీ కార్యకర్త అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు.
"ఖర్గేను ఆర్ఎస్ఎస్, బీజేపీ అవమానించడం ఇది రెండోసారి. ఆయన దళితుడు కావడంతో ఉత్తరాఖండ్‌లో శుద్ధీకరణ వంటి హేయమైన చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు బిహార్‌లో ఖర్గే ప్రసంగిస్తున్న ఒక బీజేపీ కార్యకర్త మోదీ ఎక్కడికీ వెళ్లరు అంటూ నినాదాలు చేశాడు" అని పవన్ ఖేరా ఆరోపించారు.
"ఖర్గే వంటి సీనియర్ నాయకుడిపై బీజేపీ కార్యకర్తలు అవమానకరమైన భాష ఉపయోగించారు. ఆయనపై గౌరవం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదంతా మోదీ, అమిత్ షా ఆదేశాలతో జరుగుతోంది. మల్లికార్జున ఖర్గేను పదే పదే అవమానించడాన్ని ప్రజలు క్షమించరు" అని విమర్శించారు.

ఫొటో సోర్స్, ANI
'ఓట్ల చోరీతోనే బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు'
పట్నా ర్యాలీలో మాట్లాడిన మల్లికార్జున ఖర్గే ఓట్లను దొంగిలించి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, హరియాణా, బిహార్, మహారాష్ట్రల్లో దొంగ ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు.
"జ్ఞానేశ్ కుమార్ ఒక పార్టీ గెలుపు కోసం మాత్రమే పని చేయడం లేదు. బీజేపీ టిక్కెట్లు ఇప్పించి సీనియర్ అధికారులను మంత్రులుగా చేసే బాధ్యత కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి చెప్పారు" అని అన్నారు.
"దేశ ప్రజలను అమిత్ షా తప్పుదారి పట్టిస్తున్నారు. తన అనుచరులను ఎన్నికల కమిషన్‌లో నియమించి ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారు. అందుకే 30 ఏళ్లు అధికారంలో ఉంటామని చెబుతున్నారు" అని విమర్శించారు.
ఆర్ఎస్ఎస్పై కూడా ఖర్గే విమర్శలు చేశారు. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఉన్నంత కాలం శాంతి ఉండదని, మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























