బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్నబ్’ తుపానుగా మారినట్టు ఐఎండీ ప్రకటన

ఫొటో సోర్స్, @Indiametdept
తూర్పు-మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘అర్నబ్’తుపానుగా మారిందని ఐఎండీ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈరోజు (అక్టోబర్ 26) ఉదయం 5:30 గంటలకు తుపాను 15.4° ఉత్తర అక్షాంశం, 88.9° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉందని ప్రకటించింది. శ్రీ విజయపురం (అండమాన్ దీవులు)కు వాయువ్య దిశలో 590 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 610 కి.మీ దూరంలో, విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 650 కి.మీ దూరంలో, కాకినాడకు తూర్పు-ఆగ్నేయ దిశలో 730 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి తూర్పు దిశలో 830 కి.మీ దూరంలో, బాపట్లకు తూర్పు దిశలో 910 కి.మీ దూరంలో ఉంది.
మరింత బలపడనున్న తుపాను
అర్నబ్ తుపాను పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ అర్ధరాత్రి నాటికి తీవ్ర తుపానుగా, అక్టోబర్ 27 నాటికి అత్యంత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 28 ఉదయం బాపట్ల- విశాఖ మధ్య తీరాన్ని దాటే అవకాశముంది.
తీరాన్ని దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే ఈదురుగాలుల వేగం 140 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.



