ఇజ్రాయెల్-హిజ్బొల్లా కాల్పుల విరమణ.. అమల్లోకి వచ్చిన ఒప్పందం

ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్, హిజ్బొల్లాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా ఉన్నతాధికారి ఒకరు బీబీసీకి ధ్రువీకరించారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది.
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ గత రాత్రి జరిపిన వరుస వైమానిక దాడుల్లో కనీసం 18 మంది మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ పరిణామం తర్వాత కాల్పుల విరమణ ప్రకటన వెలువడింది.
అయితే, ఈ ఘర్షణల్లో తమ సైనికులు నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
అంతకుముందు, ఇరాన్ మద్దతున్న హిజ్బొల్లాకు చెందిన 80 స్థావరాలపై దాడులు చేశామని, ఆ సంస్థ సభ్యులు డజన్ల కొద్దీ హతమయ్యారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది.
మిడిల్ ఈస్ట్ సంక్షోభానికి ముగింపు పలుకుతూ, లెబనాన్‌లో ఘర్షణను నిలిపివేసేలా అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్న మరుసటి రోజే ఈ కీలక పరిణామాలు జరిగాయి.

కాల్పుల విరమణను ధ్రువీకరించిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్రకటించింది.
ఐడీఎఫ్ అధికార ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. "ప్రస్తుతం కాల్పుల విరమణ నడుస్తోంది. అయితే ఆదేశాలు వస్తే మళ్లీ పోరాడటానికి ఐడీఎఫ్ సిద్ధంగా ఉంది" అని తెలిపారు.

ఫొటో సోర్స్, X/White House
అమెరికా-ఇరాన్ ఒప్పందంలో లెబనాన్ ప్రస్తావన ఏంటి?
ఈ ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం, లెబనాన్‌తో సహా అన్ని సరిహద్దుల్లో సైనిక చర్యలను వెంటనే, శాశ్వతంగా నిలిపివేయాలి.
అలాగే లెబనాన్ ప్రాంతీయ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించడానికి అన్ని పక్షాలూ కట్టుబడి ఉండాలి.
మొత్తం 14 అంశాలతో కూడిన ఈ అవగాహన ఒప్పందంలో.. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు తయారు చేయకూడదనే నిబంధనలతో పాటు ఇరాన్ పునర్నిర్మాణానికి 300 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కూడా ఉన్నాయి. దీనికి బదులుగా ఇరాన్‌పై ఉన్న అన్ని రకాల ఆంక్షలను అమెరికా ఎత్తివేస్తుంది.
అయితే కాల్పుల విరమణ నిబంధనలు లెబనాన్‌కు వర్తించినప్పటికీ.. అక్కడి నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణకు, ఈ ఒప్పందానికి ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధికారులు గతంలోనే స్పష్టం చేశారు. తమను తాము రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఎప్పుడూ ఉంటుందని వారు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EPA
అసలు లెబనాన్ ఈ యుద్ధంలోకి ఎలా వచ్చింది?
ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ మరణించడంతో, దానికి ప్రతీకారంగా 2026 మార్చి ప్రారంభంలో ఇజ్రాయెల్‌పైకి రాకెట్లను ప్రయోగించింది హిజ్బొల్లా. దీంతో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య సాగుతున్న ఈ పోరాటంలోకి లెబనాన్ కూడా చేరింది.
దీనికి సమాధానంగా ఇజ్రాయెల్.. లెబనాన్ వ్యాప్తంగా బాంబుల వర్షం కురిపించింది. తమ ఉత్తర సరిహద్దుల నుంచి హిజ్బొల్లా ఫైటర్లను వెనక్కి నెట్టేందుకు ఆ దేశ దక్షిణ ప్రాంతంలో చాలా భాగాన్ని ఆక్రమించింది.
తాజా ఘర్షణలు మొదలైనప్పటి నుంచి మహిళలు, పిల్లలతో కలిపి కనీసం 3,912 మంది మరణించారని, మరో 11,699 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.
దాదాపు పది లక్షల మంది ప్రజలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారగా.. దక్షిణ ప్రాంతంలోని ఎన్నో గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి.
ఇజ్రాయెల్ దాడులు ఆపనంత కాలం తమ పోరాటం కొనసాగుతుందని హిజ్బొల్లా ప్రతిజ్ఞ చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























