అయోధ్య: ‘రామాలయంలో విరాళాలు, కానుకలు మాయం’ అంటూ ట్రస్ట్‌పై ఆరోపణలు

అయోధ్య

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, ప్రేరణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

అయోధ్య వేర్వేరు సందర్భాల్లో దేశ విదేశాల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈసారి కారణం ఆలయ ఉద్యమం, దాని వైభవం లేదా భక్తుల రద్దీ కాదు.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పనితీరు, ఆలయ విరాళాల చుట్టూ తలెత్తుతున్న తీవ్ర అవకతవకల ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ రామ్ జన్మభూమి ట్రస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.

ట్రస్ట్ కళ్లముందే ఆలయ విరాళాలు, కానుకల లెక్కల్లో పెద్ద ఎత్తున తేడాలు జరిగాయని, రామాలయ కానుకల నుంచి కోట్ల రూపాయలు మాయమయ్యాయని ఆయన ఆరోపిస్తున్నారు.

ఆయనతో పాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు స్థానిక మాజీ కరసేవకుడు సంతోష్ దూబే, బీజేపీ నాయకుడు డాక్టర్ రజనీశ్ సింగ్ తదితరులు ఈ అవకతవకలను ప్రస్తావిస్తూ జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రస్తుతం ఈ ఆరోపణలపై విచారణ సాగిస్తోంది. అయితే, ఈలోగా అయోధ్య స్థానికులు, ఇక్కడికి వచ్చే భక్తులలో తీవ్ర నిరాశ, ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కోట్లమంది నమ్మకం, త్యాగాల ఫలితంగా నిర్మితమైన ఆలయం చుట్టూ ఇలాంటి ఆర్థిక ఆరోపణలు రావడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బీబీసీతో మాట్లాడిన కొందరు, దీన్ని అయోధ్యకు మచ్చ తెచ్చే అంశంగా భావిస్తే, మరికొందరు పారదర్శకత కోసం విచారణ అవసరమని అంటున్నారు.

చంపత్ రాయ్, అయోధ్య రామమందిరం, ట్రస్ట్, వివాదాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చంపత్ రాయ్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా, విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

తెరపైకి జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్

ఈ వివాదాలన్నింటికీ కేంద్ర బిందువుగా మారిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో జనరల్ సెక్రటరీ, విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షుడైన చంపత్ రాయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

2020 ఫిబ్రవరిలో అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ ట్రస్ట్‌లో అధ్యక్షుడిగా మహంత్ నృత్య గోపాల్ దాస్, కోశాధికారిగా స్వామి గోవింద్ దేవ్ గిరి, సీనియర్ న్యాయవాది కె. పరాశరన్, డాక్టర్ అనిల్ మిశ్రా, కామేశ్వర్ చౌపాల్, మహంత్ దినేంద్ర దాస్ సహా పలువురు మత, సామాజిక ప్రతినిధులు ఉన్నారు.

ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్న చంపత్ రాయ్.. దీని రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే అత్యంత కీలకమైన అధికారి. ఆలయ నిర్మాణ ప్రాజెక్టు, విరాళాలు-కానుకల నిర్వహణ, అధికారిక సంప్రదింపుల బాధ్యత ఆయనపైనే ఉండటంతో మీడియా ప్రతినిధులు ఆయన సమాధానం కోసం ప్రయత్నిస్తున్నారు.

సిట్ దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి ఆయన మీడియాకు దూరంగా ఉంటున్నారు.

అయోధ్య రామమందిరం, ట్రస్ట్, వివాదాలు

ఫొటో సోర్స్, Getty Images

తప్పు జరగలేదు: చంపత్ రాయ్

ఇటీవల విడుదల చేసిన ఒక వీడియోలో చంపత్ రాయ్ ఈ ఆరోపణలను ఖండించారు.

‘‘ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం తన వివిధ పనులకు సంబంధించి సమయానుసారం ఆడిట్ నిర్వహిస్తూనే ఉంటుంది. హుండీ కౌంటింగ్ రూమ్ ఆడిటింగ్‌ను రామాలయ తీర్థ క్షేత్ర ట్రస్టీలు, కార్యకర్తలు, స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు కలిసి చేస్తారు. ఈ ప్రక్రియ చాలా రోజుల పాటు సాగుతుంది. ప్రస్తుతం ఆ పనే జరుగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి తప్పులూ మా దృష్టికి రాలేదు'' అన్నారు.

చంపత్ రాయ్‌ను సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించినప్పటికీ ఎలాంటి స్పందనా రాలేదు. ఆయన సాధారణంగా అయోధ్యలోని కరసేవక్‌ పురంలో నివసిస్తుంటారు. కానీ, మేం అక్కడికి వెళ్లినప్పుడు.. గత ఏడెనిమిది రోజులుగా, అంటే సిట్ దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఆలయ ప్రాంగణంలోనే ఉంటున్నారని విశ్వహిందూ పరిషత్ సభ్యుడొకరు మాకు తెలిపారు.

అయోధ్య రామమందిరం, కానుకలు, విరాళాల్లో అవకతవకలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

అయోధ్యలోని స్థానికులు, వ్యాపారులు, సంత్-మహంత్‌లు లేదా రామాలయంతో సంబంధం ఉన్న సామాజిక, మతపరమైన సంస్థల ప్రతినిధులు.. ఇలా బీబీసీ ఎవరితో మాట్లాడినా, వారిలో చాలామంది తాజా వివాదం విని తామేమీ ఆశ్చర్యపోలేదని చెప్పారు.

గత కొన్నేళ్లుగా ఆలయం, ట్రస్ట్‌కు సంబంధించి రకరకాల వార్తలు, చర్చలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయని, అందుకే ఈ ప్రశ్నలు తలెత్తడం తమకు కొత్తేమీ కాదని కొందరు అభిప్రాయపడ్డారు.

అయితే చంపత్ రాయ్ పాత్రపై అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. అవకతవకల్లో చంపత్ రాయ్ వ్యక్తిగత ప్రమేయం ఉండే అవకాశం లేదని ఆయన మద్దతుదారులు నమ్ముతున్నారు.

మరోవైపు, విమర్శకులు మాత్రం ఆయనకు తెలియకుండా ఇంత పెద్ద స్థాయిలో పొరపాట్లు జరగడం అసాధ్యమని వాదిస్తున్నారు. వ్యక్తిగత నిజాయితీ ఎలా ఉన్నా, సంస్థలో జరిగే వాటికి ఆయనే జవాబుదారీ వహించాలని స్పష్టం చేస్తున్నారు.

చంపత్ రాయ్, అయోధ్య రామమందిరం, ట్రస్ట్, వివాదాలు

ఫొటో సోర్స్, Tariq Khan/BBC

గతంలోనూ ఆరోపణలు

ట్రస్ట్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. జూన్ 2021లో అయోధ్యలో కొనుగోలు చేసిన ఒక భూమికి సంబంధించి ట్రస్ట్‌పై ఆరోపణలు వచ్చాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు దీనిపై స్పందిస్తూ.. 'ఒక వ్యక్తి రెండు కోట్ల రూపాయలకు కొన్న భూమిని, ఆ ఒప్పందం జరిగిన కొద్ది నిమిషాలకే ట్రస్ట్ 18.5 కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసింది’ అని ఆరోపించారు.

ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్‌తో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయంలో పారదర్శకత ఉండాలని కోరాయి.

అయోధ్య

ఫొటో సోర్స్, ANI

అయితే, చంపత్ రాయ్, ట్రస్ట్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. భూమి కొనుగోళ్లన్నీ పారదర్శకంగా జరిగాయని, చెల్లింపులన్నీ బ్యాంకింగ్ మార్గాల ద్వారానే చేశామని, మార్కెట్ ధర కంటే తక్కువకే ఆ భూమిని ట్రస్ట్ కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు.

ఈ ఆరోపణలు 'తప్పుదోవ పట్టించేవిగా, 'రాజకీయ దుర్బుద్ధితో కూడినవిగా' ఉన్నాయని చంపత్ రాయ్ కొట్టిపారేశారు.

కానీ, రాజకీయ పార్టీలు ఇప్పుడు మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. 2021లో కూడా ఈ ఆరోపణలపై విచారణ జరిగిందని, అయితే దాని వల్ల ఏమీ తేలలేదని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, అయోధ్య మాజీ ఎమ్మెల్యే పవన్ పాండే అంటున్నారు.

ఆ విచారణ ఎలాంటిది, ఎవరు చేశారు, దాని వల్ల తేలిందేమిటి అనే విషయాలపై బీబీసీకి ఇప్పటివరకు ఎలాంటి కచ్చితమైన సమాచారం లభించలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)