మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ: 'అమ్మవారి శాపం' చుట్టూ అల్లుకున్న కథ ఎలా సాగింది?

మహేంద్రగిరి వారాహి, సుమంత్, సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్యా రాజేష్, రాజ్యశ్యామల

ఫొటో సోర్స్, Raja Shyamala Entertainments

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

సుమంత్ హీరోగా , సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, ఐశ్య‌ర్య రాజేష్ ప్ర‌త్యేకమైన పాత్ర‌ల్లో మ‌హేంద్ర‌గిరి వారాహి థియేట‌ర్‌లోకి వ‌చ్చింది. ఈ మైథ‌లాజిక‌ల్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఎలా ఉందో చూద్దాం.

విజ‌య‌న‌గ‌రం స‌మీపంలో మ‌హేంద్ర‌గిరి ఒక గ్రామం. అక్క‌డ వారాహి అమ్మ‌వారు కొలువై ఉంటుంది. ఆ ఊరి రాజ కుటుంబీకుల‌కి త‌ర‌త‌రాలుగా అమ్మ‌వారి శాపం ఉంటుంది. ఎవ‌రూ కూడా 33 ఏళ్ల‌కు మించి బ‌త‌క‌రు.

రెండు వందల ఏళ్ల క్రితం ముత్యాల‌మ్మ అనే మ‌హిళ‌పై ఆ రాజ‌కుటుంబీకుడు చేసిన అత్యాచారానికి ఆగ్ర‌హించిన అమ్మ‌వారు ఆ శాపం ఇచ్చింద‌నేది గ్రామ‌స్తుల న‌మ్మ‌కం.

హైద‌రాబాద్‌లో ఉన్న సిద్దార్థ్ (సుమంత్‌) నాస్తికుడు. యూట్యూబ్ చానల్ న‌డుపుతూ దొంగ బాబాలు, మూఢ న‌మ్మ‌కాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతూ ఉంటాడు.

ఒకానొక సంద‌ర్భంలో అత‌ను కుటుంబం స‌హా మ‌హేంద్ర‌గిరి వ‌స్తాడు. అమ్మ‌వారి శాపం , రాజ‌కుటుంబీకుల మ‌ర‌ణాల వెనుక ఉన్న మిస్ట‌రీని తెలుసుకోడానికి ప్ర‌య‌త్నిస్తాడు.

అనేక ప్ర‌మాదాలు అత‌న్ని చుట్టుముడుతాయి. అస‌లేం జ‌రిగింద‌నేది మిగ‌తా క‌థ‌.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కాంతారా త‌ర్వాత అన్ని భాష‌ల్లో మైథాల‌జీతో ముడిప‌డిన థ్రిల్ల‌ర్ సినిమాలు పెరిగాయి.

ఇది కూడా అలాంటిదే.

ఇలాంటి సినిమాల‌కి అనుకూల‌త‌లు, ప్ర‌తికూల‌త‌లు కూడా ఉన్నాయి.

ఫ‌స్టాఫ్ వ‌ర‌కు క‌థ‌లో ఎన్ని చిక్కుముడులైనా వేయొచ్చు. ఇది ప్ల‌స్‌.

సెకండాఫ్‌లో ఒక్కో ముడి విప్పుతూ ట్విస్టుల‌తో ప్రేక్ష‌కున్ని షాక్‌కి గురి చేయాలి.

ఈ ప‌ని లాజిక‌ల్‌గా , జాగ్ర‌త్త‌గా చేయ‌క‌పోతే ప్రేక్ష‌కుడు గంద‌ర‌గోళ‌ప‌డి పెద‌వి విరుస్తాడు. ఇది మైన‌స్‌.

పైగా ప్రేక్ష‌కుడు తెలివిమీరి పోయాడు.

హిచ్‌కాక్ ద‌గ్గ‌రి నుంచి ఎన్నో సస్పెన్స్ థ్రిల్ల‌ర్లు చూసేశాడు.

మైథాలాజిక‌ల్ మిక్సింగ్‌కి కూడా అల‌వాటుప‌డ్డాడు.

మహేంద్రగిరి వారాహి, సుమంత్, సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్యా రాజేష్, రాజ్యశ్యామల

ఫొటో సోర్స్, instagram.com/rajashyamalae

ఈ సినిమాలో లోపం ఏమంటే ప్రధానమైన ట్విస్ట్ మురారి సినిమాని గుర్తు తెస్తుంది.

హీరో వారాహి అమ్మ‌వారి గురించి రీసెర్చ్ చేయ‌డం కూడా పాత‌దే.

ఫ‌స్టాఫ్ అంతా స్లో నెరేష‌న్‌లో ఏవేవో స‌న్నివేశాల‌తో న‌డుస్తుంది.

ఈ క‌థ‌కి హీరోని కనెక్ట్ చేయ‌డానికి ద‌ర్శ‌కుడు చాలా టైమ్ తీసుకున్నాడు.

అందుకే రెండు వేర్వేరు క‌థ‌ల్ని చూస్తున్న‌ట్టుగా అనిపిస్తూ డిస్‌క‌నెక్ట్ అయిపోతాం.

అస‌లు విష‌య‌మంతా సెకెండాఫ్‌లో ఉంది.

ఊహ‌కి అంద‌ని ట్విస్టులే అయినా ఆ 20 నిమిషాల కోసం మిగిలిన రెండు గంట‌లు భ‌రించ‌డం క‌ష్టం.

పైగా ఇలాంటి క‌థాంశంతో సోష‌ల్ థ్రిల్ల‌ర్ అప‌రిచిత (1978 క‌న్న‌డం).

అన్వేష‌ణ (1985) వ‌చ్చాయి. అయితే అన్ని క‌థ‌లు ఎక్క‌డో ఒక‌చోట చూసిన‌వే.

స్క్రీన్ ప్లే కొత్త‌గా ఉండ‌డ‌మే కావాలి.

అదే ద‌ర్శ‌కుడు సంతోష్ జాగ‌ర్ల‌మూడి మిస్స‌య్యాడు.

మహేంద్రగిరి వారాహి, సుమంత్, సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్యా రాజేష్, రాజ్యశ్యామల

ఫొటో సోర్స్, Raja Shyamala Entertainments

సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, మంజు భార్గ‌వి లాంటి న‌టులున్న వాళ్ల‌కి క‌నీసం ఒక‌ట్రెండు మంచి సీన్స్ లేవు.

అస‌లు సిద్దు ఈ పాత్ర ఎందుకు చేశాడో తెలియ‌దు.

హీరోయిన్ , పాట‌లు లేక‌పోవ‌డం మంచి విష‌య‌మే కానీ, నిడివి రెండున్న‌ర గంట‌లు అన‌వ‌స‌రం.

వెన్నెల కిషోర్‌ ఉన్నా కామెడీ లేదు. బ్ర‌హ్మానందం కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించాడు.

కెమెరా, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ జ‌స్ట్ ఓకే.

ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ రిచ్‌గానే వున్నాయి. గ్రాఫిక్స్‌కి బాగానే ఖ‌ర్చు పెట్టారు.

సుమంత్ న‌ట‌న అక్క‌డ‌క్క‌డ బానే ఉంది.

ఆయ‌న కొత్త క‌థాంశాలు ఎంచుకుంటున్నాడు కానీ, అవి రొడ్డ‌కొట్టుడు క‌థ‌నంతో ఉన్నాయ‌ని గుర్తించ‌లేక‌పోతున్నాడు.

మహేంద్రగిరి వారాహి, సుమంత్, సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్యా రాజేష్, రాజ్యశ్యామల

ఫొటో సోర్స్, Raja Shyamala Entertainments

ప్ల‌స్ పాయింట్

1.క్లైమాక్స్ ట్విస్ట్‌

మైన‌స్ పాయింట్స్

1.స్క్రీన్ ప్లే ఎంగేజింగ్‌గా లేక‌పోవ‌డం

2.నిడివి

ఫైన‌ల్‌గా.. వారాహిలో వారెవ్వా అనేదేమీ లేదు.

(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)