లైవ్, అమెరికాలో కాల్పులు, ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

సియాటెల్‌లోని ప్రముఖ ప్రాంతం స్పేస్ నీడిల్ దగ్గర ఉన్న సియాటెల్ సెంటర్‌లో కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని సియాటెల్ పోలీసులు తెలిపారు.

సారాంశం

  • పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఇవాళ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026ను ప్రవేశపెడతారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
  • టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సహా పలుపార్టీల ఎంపీలు ఈ బిల్లుపై లోక్‌సభలో మాట్లాడనున్నారు.
  • అమెరికాలోని సియాటెల్‌లో ప్రముఖ ప్రాంతమయిన స్పేస్ నీడిల్ దగ్గరలో ఉన్న సియాటెల్ సెంటర్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారని, ఐదుగురు గాయపడ్డారని సియాటెల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
  • సియాటెల్ సెంటర్‌లో బైట్ ఆఫ్ సియాటెల్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఏటా జరిగే ఈ కార్యక్రమానికి లక్షలాది మంది హాజరవుతారు.
  • విద్యాసంస్కరణల కంటే ముందు మీడియా సంస్కరణలు రావాల్సిన అవసరముందని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య డాక్టర్ గీతాంజలి అన్నారు. "నిత్యం వండివార్చిన కథనాలతో దేశం వివేకవంతం కాలేదు. అది ఒకే మూసధోరణి వైపు లాక్కెళ్తుంది" అని ‘ఎక్స్’లో చేసిన పోస్టులో ఆమె అభిప్రాయపడ్డారు.
  • ఫ్రాన్స్‌లోని బోర్డో నగరానికి దగ్గరలో కార్చిచ్చు వ్యాపించింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి వేలాదిమంది శ్రమిస్తున్నారు.
  • నగరాన్ని ఖాళీ చేయించే అవకాశం అంతగా లేదని అధికారులు చెప్పారు. గత వారం నుంచి యూరప్‌లోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి.

లైవ్ కవరేజీ

  1. పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

    ఆందోళన, నీట్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్)సవరణ బిల్లు

    ప్రశ్నపత్రాల లీకేజ్‌లను నివారించడానికి, పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024కు సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది.

    కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

    ప్రశ్నాపత్రాలను లీక్ కేసుల్లో దోషులు వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, ఐదు నుంచి పది కోట్ల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఇలాంటి కేసుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. పరీక్షకు అయిన ఖర్చును కూడా దోషుల నుంచి వసూలు చేస్తారు. వారిని ఎనిమిదేళ్లపాటు ఎలాంటి ప్రభుత్వ పరీక్షలు రాయకుండా నిషేధిస్తారు. గతంలో జరిమానా కోటిరూపాయలుగా ఉండేది. నిషేధం నాలుగేళ్లు ఉండేది.

    ప్రతిపాదిత బిల్లు ప్రకారం పేపర్ లీకేజ్ కేసుల దర్యాప్తును సీబీఐ లేదా సిట్ రెండు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

  2. పార్లమెంట్‌లో విపక్ష ఎంపీల నిరసన

    పార్లమెంటులో ఎంపీల నిరసన

    ఫొటో సోర్స్, Chamala Kiran Kumar

    సీజేపీ నేతృత్వంలో విద్యార్థులు జులై 20న జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళన సమయంలో జరిగిన ఘటనలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలుసోమవారం పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన తెలిపారు.

  3. ఫ్రాన్స్‌లో కార్చిచ్చు, అధ్యక్షుడు మేక్రాన్ అత్యవసర సమావేశం

    కార్చిచ్చు, మంటలు, అటవీ ప్రాంతం

    ఫొటో సోర్స్, EPA

    ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లో కార్చిచ్చు

    ఫ్రాన్స్‌లోని బోర్డో నగరానికి దగ్గరలో కార్చిచ్చు వ్యాపించింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పదివేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి వేలాదిమంది శ్రమిస్తున్నారు. 8,50,000మంది ఉండే నగరాన్ని ఖాళీ చేయించే అవకాశం అంతగా లేదని అధికారులు చెప్పారు. బోర్డోకు 15కిలోమీటర్ల దూరంలో మంటలు వ్యాపించాయి.

    మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మానుయేల్ మేక్రాన్ అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.

    మంగళవారం నుంచి ఫ్రాన్స్‌లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది.

    ఫ్రాన్స్‌లోని గిరోండ్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా గతంలో ఎన్నడూ లేనంతగా పైరోక్యుములోనింబస్ అనే భారీ అగ్ని తుఫాన్ మేఘం ఏర్పడిందని నేషనల్ ఫైర్‌ఫైటర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఫ్రాన్స్(ఎఫ్ఎన్ఎస్‌పీఎఫ్) తెలిపింది.

    కార్చిచ్చు ఫ్రాన్స్‌పై తీవ్ర ప్రబావం చూపింది. నైరుతి ఫ్రాన్స్‌లో 42వేల హెక్టార్లు కాలిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చెలరేగిన భారీ కార్చిచ్చుల్లో ఇదొకటి.

    గత వారం నుంచి యూరప్‌లోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి.

  4. అమెరికాలో కాల్పులు, ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

    అమెరికాలో కాల్పులు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, సియాటెల్‌లో కాల్పులు

    అమెరికాలోని సియాటెల్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారని సియాటెల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. రెండేళ్ల చిన్నారి, ముగ్గురు మహిళలు సహా ఐదుగురు గాయపడ్డారని తెలిపింది.

    నగరంలో ప్రముఖ ప్రాంతమయిన స్పేస్ నీడిల్ దగ్గరలో ఉన్న సియాటెల్ సెంటర్‌లో ఈ కాల్పులు జరిగాయి.

    కాల్పుల్లో గాయపడ్డ రెండేళ్ల బాలుణ్ని ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. గాయపడ్డవారిలో 56ఏళ్ల మహిళ ఉన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

    "సియాటెల్ సెంటర్‌లో కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం. దయచేసి ఆ ప్రాంతానికి దూరంగా ఉండండి" అని సియాటెల్ పోలీసులు ‘ఎక్స్’లో తెలిపారు.

    ఘటనాస్థలంలో భారీగా పోలీసులు, అత్యవసర సర్వీసులుకు చెందిన వారిని మోహరించినట్టు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోల్లో కనిపిస్తోంది.

    సియాటెల్ సెంటర్‌లో బైట్ ఆఫ్ సియాటెల్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఏటా జరిగే ఈ కార్యక్రమంలో ఆహార స్టాల్స్, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు ఉంటాయి. దీనికి లక్షలాది మంది హాజరవుతారు.

    అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల సమయంలో వరుసగా పలుమార్లు కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ సియాటెల్ టైమ్స్ తెలిపింది.

    కాల్పుల శబ్దం వినిపించగానే అక్కడి నుంచి పరుగులు తీశామని బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడిన పలువురు ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

    మొదట బాణాసంచా పేలుళ్లేమో అనుకున్నామని ప్రత్యక్ష సాక్షులన్నారు.

    ‘‘అందరూ పరుగులు తీస్తుండంతో మేమూ వారితో పాటు పరుగెత్తాం. అక్కడి నుంచి దూరంగా వెళ్లాలనుకున్నాం. మేం ఎక్కడ ఉన్నామో తెలుసుకోడానికి స్పేస్ నీడిల్ వైపు చూశాను. నిజంగా చాలా భయమేసింది’’ అని ఓ మహిళ చెప్పారు.

    కాల్పుల శబ్దం వినగానే తల్లిదండ్రులు భయపడిపోయారని, పిల్లల చేతులు పట్టుకుని ఎగ్జిట్ గేట్ వైపు పరుగులు తీశారని, అక్కడంతా భయాందోళన నెలకొందని స్థానిక వ్యాపారి చెప్పారు.

  5. దేశం కోసం స్వర్ణం గెలవడం కన్నా ఆనందకరమైనది ఏదీ లేదు: మీరాబాయి చనూ

    కామన్‌వెల్త్ గేమ్స్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, మీరాబాయి చనూ

    గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చనూ స్వర్ణపతకం గెలుచుకుంది. దేశం కోసం స్వర్ణం సాధించడం కంటే ఆనందకరమైనది మరొకటి లేదని వరుసగా మూడోసారి కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న అనంతరం మీరాబాయి చనూ చెప్పింది.

    "నేను చాలా సంతోషంగా ఉన్నాను. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇది నా మూడో స్వర్ణ పతకం. మొత్తంగా ఇది నా నాలుగో పతకం. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలుచుకోవడంతో నా ప్రయాణం మొదలైంది" అని మీరాబాయి చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.

    జుట్టులోని త్రివర్ణ పతాక రంగుల్లో క్లిప్పు పెట్టుకోవడానికి గల కారణాన్ని మీరాబాయి చెప్పింది.

    "ఈ త్రివర్ణ క్లిప్పులను నేనే స్వయంగా తయారు చేసుకున్నాను. మన జాతీయ పతాకానికి ప్రాతినిధ్యం వహించేలా ఏదైనా ప్రత్యేకంగా ఉండాలనుకున్నా. ఏదైనా తయారు చేయాలని అకస్మాత్తుగా అనిపించింది. అందుకే ఈ సీతాకోకచిలుక ఆకారపు క్లిప్పులను పోటీల ముందురోజు నేనే స్వయంగా తయారు చేసుకున్నాను. త్రివర్ణ పతాకాన్ని నాతో పాటు తీసుకువెళ్లడం నాకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇవాళ నేను చాలా భావోద్వేగానికి లోనై చాలా ఏడ్చాను. అయితే భావోద్వేగాలతో నిండి ఉన్నప్పటికీ ఈ క్షణం నాకు అంతే ఆనందాన్ని కూడా ఇచ్చింది" అని మీరాబాయి తెలిపింది.

  6. బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌కు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి కమలాదేవి నల్లపనేని.

    ఇప్పటినుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను లైవ్ పేజ్ ద్వారా మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    మరిన్న ‘బీబీసీ తెలుగు’ కథనాలు మీకోసం..