ఫ్రాన్స్: నిరసనలు, ఘర్షణలు,దాదాపు వెయ్యి మంది అరెస్ట్

ఫొటో సోర్స్, Sener Yilmaz Aslan/Getty Images
ఫ్రాన్స్‌లో శనివారం నాటి నిరసనలు, ఘర్షణలకు సంబంధించి దాదాపు వెయ్యి మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
శనివారం పగటిపూట నిరసనలు చాలావరకు శాంతియుతంగా సాగాయి. అయితే, పారిస్ సహా పలు నగరాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. వాటర్ కానన్లను ఉపయోగించారు.
మార్సెయ్ నగరంలో నిరసనకారులు రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్లకు నిప్పుపెట్టారు. బోర్డో నగరంలో ఓ దుకాణానికి అమర్చిన చెక్క పలకలను కొందరు తొలగించారు.
అయితే, గత వారాంతంలో జరిగిన స్థాయిలో అల్లర్లు, దోపిడీలు జరగకుండా అధికారులు ఇప్పటివరకు నియంత్రించగలిగారు.
శనివారం జరిగిన నిరసనల్లో సుమారు 4.10 లక్షల మంది పాల్గొన్నట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.
అయితే, ఈ సంఖ్య దాదాపు 8 లక్షలుగా ఉంటుందని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, Sener Yilmaz Aslan/Getty Images
జీవన వ్యయం పెరగడం, పాఠశాలల్లో అధ్వాన పరిస్థితులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా దాదాపు 70 వేల మంది పోలీసులను మోహరించారు. పలు నగరాల్లో ఆంక్షలు విధించారు.
గతంలో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసుల సంఖ్య కంటే ఆందోళనకారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పరిస్థితులు అదుపుతప్పాయి. వందలాది వ్యాపార సంస్థల్లో దోపిడీలు జరిగాయి. భవనాలకు నిప్పుపెట్టారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు నిర్వహించే ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ వారం ప్రారంభంలోనే ఆదేశాలు జారీ చేశారు.
