కుదిరిన ఇరాన్, అమెరికా శాంతి ఒప్పందం, 19న స్విట్జర్లాండ్‌లో సంతకాలు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు రెండు దేశాల నేతలు వెల్లడించారు. మరోవైపు ఈ రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయంటూ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ కూడా తెలిపారు.
ఈ ఒప్పందంపై తొలుత షరీఫ్ 'ఎక్స్' వేదికగా ప్రకటన చేశారు. 'చర్చల తరువాత అమెరికా, ఇరాన్‌లు శాంతి ఒప్పందానికి అంగీకరించాయని ప్రకటించడానికి మేం సంతోషిస్తున్నాం' అంటూ ఆయన పోస్ట్ చేశారు.
రెండు దేశాలు తక్షణమే మిలటరీ ఆపరేషన్స్ నిలిపివేయడానికి అంగీకరించాయని, ఇది లెబనాన్ సహా అన్ని ప్రాంతాలకూ వర్తిస్తుందని చెప్పారు.
ఈ ఒప్పందంపై రెండు దేశాలు అధికారికంగా జూన్ 19న స్విట్జర్లాండ్‌లో సంతకాలు చేస్తాయని వెల్లడించారు.

‘ఇక చమురు ప్రవహించనీ’
పాకిస్తాన్ ప్రధాని ఎక్స్ పోస్ట్ అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' పోస్ట్‌లో ఈ ఒప్పందం కుదిరినట్లు ధ్రువీకరించారు.
'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒప్పందం పూర్తయింది' అంటూ ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
హార్ముజ్ జలసంధిలో ఎలాంటి టోల్ లేకుండా ప్రయాణించొచ్చని, అమెరికా దిగ్బంధనాన్ని కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.
'ప్రపంచంలోని నౌకలన్నీ ఇక తమ ఇంజిన్లు ఆన్ చేయొచ్చు. ఇక చమురు ప్రవహించనీ' అంటూ ఆయన పోస్ట్ చేశారు.

‘శుక్రవారం సంతకాలు’
ఇరాన్ ప్రభుత్వం నుంచి కూడా ఒప్పందంపై ధ్రువీకరణ వచ్చింది.
ఇరాన్ డిప్యూటీ మినిష్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఖజీమ్ ఘారిబబాదీ ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించారు. ఆ దేశ ప్రభుత్వ టీవీ చానల్‌తో ఆయన ఫోన్లో మాట్లాడుతూ.. అమెరికాతో ఒప్పందం కుదిరిందని, శుక్రవారం స్విట్జర్లాండ్‌లో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని తెలిపారు.
తక్షణమే యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకుతూ, లెబనాన్ సహా అన్ని చోట్లా మిలటరీ ఆపరేషన్స్ నిలిపివేయడానికి సంబంధించి రాత్రికి పూర్తి ప్రకటన వస్తుందని ప్రకటించారు.
ఇరాన్‌కు వ్యతిరేకంగా హార్ముజ్ ప్రాంతంలో కొనసాగుతున్న అమెరికా దిగ్బంధనం కూడా ఎత్తివేస్తారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖతార్ మధ్యవర్తుల ఆధ్వర్యంలో 14-15 గంటల చర్చలు: ఇరాన్
ఖతార్ మధ్యవర్తుల ఆధ్వర్యంలో 14 నుంచి 15 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగిన అనంతరం అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినట్లు ఇరాన్ డిప్యూటీ మినిష్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఖజీమ్ ఘారిబబాదీ తెలిపారు.
'నిన్న ఖతార్ ప్రతినిధి బృందం తెహ్రాన్ వచ్చింది. 'ఇస్లామాబాద్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్'లోని అంశాలపై సుమారు 14 నుంచి 15 గంటలు చర్చలు జరిగాయి. మా సవరణలు చెప్పాం. వాటికి అంగీకరించడంతో ఒప్పందం తుదిరూపు దాల్చింది' అని ఘారిబబాదీ ఇరాన్ ప్రభుత్వ మీడియాతో చెప్పారు.
కాగా చర్చలకు పాకిస్తాన్‌తో పాటు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జస్సిమ్ అత్ థానీ ఈ శాంతి ఒప్పందంపై హర్షం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Reuters
తగ్గిన చమురు ధరలు
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రకటించిన తర్వాత చమురు ధరలు తగ్గాయి. ఈ ఒప్పందం ప్రకారం కీలకమైన హార్ముజ్ జలసంధి మళ్లీ తెరచుకోనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్ల ప్రారంభ ట్రేడింగ్‌లో చమురు ధరలు తగ్గాయి.
ప్రపంచ చమురు ప్రమాణంగా పరిగణించే బ్రెంట్ క్రూడ్ ధర 3.8% తగ్గి బ్యారెల్‌కు 84.02 డాలర్లకు చేరుకుంది. అమెరికాలో ట్రేడయ్యే క్రూడ్ ఆయిల్ ధర 4.1% పడిపోయి బ్యారెల్‌కు 81.40 డాలర్లుగా నమోదైంది.
"చమురు మళ్లీ ప్రవహిస్తుంది" అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఈ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు.
అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించిన కొద్దిసేపటికే హార్ముజ్ జలసంధిని మూసేసింది ఇరాన్. ఇప్పుడు శాంతి ఒప్పందం నేపథ్యంలో దాన్ని తిరిగి తెరవడానికి మార్గం సుగమమవుతోంది.
కీలకాంశాలివే- ఇరాన్ మీడియా
అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందంలోని కొన్నిఅంశాలను ఇరాన్ మీడియా వెల్లడించింది.
వీటిని ఇప్పటివరకు ఇరాన్ గానీ అమెరికా గానీ అధికారికంగా ధ్రువీకరించలేదు.
- లెబనాన్ సహా అంతటా శాశ్వత కాల్పుల విరమణ
- ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని అమెరికా నుంచి హామీ
- 30 రోజుల్లో అమెరికా నౌకాదళ దిగ్బంధనం ఎత్తివేత
- ఇరాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ
- 30 రోజుల్లో హార్ముజ్ జలసంధి తిరిగి తెరవడం. ఇది ఇరాన్ ఏర్పాట్ల ప్రకారం ఉండాలి
- అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి ఇరాన్ కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ ప్రణాళికలు అందించడం.
- ఇరాన్ చమురు, ఇంధన ఉత్పత్తులపై ఆంక్షలు ఎత్తివేయడం
- అణ్వాయుధాలు తయారు చేయబోమని ఇరాన్ మళ్లీ ధృవీకరించడం
- ఈ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలగాలను పెంచబోదని, కొత్త ఆంక్షలు విధించబోదని హామీ
- ఈ షరతులు నెరవేరిన తర్వాతే తుది చర్చలు మొదలవుతాయని తెలిపింది.
తుది ఒప్పందానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదం లభిస్తుందని కూడా ఇరాన్‌కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























