లైవ్, సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమణ

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించారు. గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆయనతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ దీక్ష విరమింపజేశారు. అంతకుముందు వివిధ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు వాంగ్‌చుక్‌ను కలిసి దీక్ష విరమించాలని కోరారు.

సారాంశం

  • సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్ష విరమించారు.
  • 26 రోజుల పాటు కొనసాగించిన తన దీక్షను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో విరమించినట్లు ఆయన ‘ఎక్స’లో వెల్లడించారు.
  • అంతకుముందు వివిధ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిసి నిరాహార దీక్ష విరమించాలని కోరారు.
  • కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలకు చెందిన సుమారు 100 మంది ఎంపీలు గురువారం సాయంత్రం తీస్ జనవరి మార్గ్‌లోని గాంధీ స్మృతివనానికి చేరుకున్నారు. అక్కడ, నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పించారు.
  • నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ), 1980 కింద ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులను జారీ చేసే అధికారాన్ని దిల్లీ పోలీస్ కమిషనర్‌కు కల్పించారు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. ఈ అధికారాన్ని 2026 జూలై 19 నుంచి 2026 అక్టోబర్ 18 వరకు మూడు నెలల కాలానికి మంజూరు చేశారు. దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం జరుగుతున్న నిరసనల దృష్ట్యా దీన్ని అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తున్నారు.

లైవ్ కవరేజీ

  1. విద్యార్థులపై నిరసనలపై సోనియా గాంధీ ఏమన్నారు?

    sonia gandhi

    ఫొటో సోర్స్, ANI

    విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం, సంస్కరణలు కావాలని విద్యార్థులు డిమాండ్ చేశారని, అయితే వారి ధైర్యానికి మోదీ ప్రభుత్వం "పిరికితనం, క్రూరత్వంతో" సమాధానమిచ్చిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం అన్నారు.

    "ప్రభుత్వం విద్యార్థులను దేశ భవిష్యత్తును నిర్మించే పౌరులుగా కాకుండా, దేశానికి శత్రువులుగా చూసింది" అని సోనియా అన్నారని పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది.

    మోదీ ప్రభుత్వం భారతదేశ విద్యా వ్యవస్థను బలహీనపరిచిందని సోనియా ఆరోపించారు. దేశ విద్యార్థులు మోదీ ప్రభుత్వ వాదనలను, అహంకారాన్ని బట్టబయలు చేశారని ఆమె అన్నారు.

    విద్యార్థులకు అండగా నిలబడి, వారి భవిష్యత్తును కాపాడటం మన నైతిక, రాజకీయ, రాజ్యాంగ బాధ్యత అని సోనియా గాంధీ అన్నారు.

    నీట్-యూజీ పరీక్ష పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత జంతర్ మంతర్ వద్ద తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

    అయితే, ఈ డిమాండ్‌కు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను విరమించారు.

  2. కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ప్రభుత్వంతో చర్చలు - సౌరవ్ దాస్

    నిరాహారదీక్ష, ప్రభుత్వం, ప్రతిపక్షం

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, సౌరవ్ దాస్

    విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా తమ డిమాండ్లన్నీ యథాతథంగానే ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు. వాటిపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు.

    "తటస్థ వేదికపై చర్చలు జరపాలన్న మా డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. మాకు సంతోషంగా ఉంది. చర్చల కోసం కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాను ఎంపిక చేశారు. ప్రభుత్వం విశాల దృక్పథంతో మా ముందుకు వచ్చినందుకు, వీధుల్లోకి వచ్చిన ప్రజల మాట వినడానికి సుముఖంగా ఉన్నందుకు మాకు ఆనందంగా ఉంది" అని సౌరవ్ దాస్ చెప్పారు.

    "వారు జంతర్ మంతర్‌కూ వచ్చుండొచ్చు. కానీ మేమే ప్రత్యామ్నాయంగా తటస్థ వేదికను సూచించాం. వారు జంతర్ మంతర్‌కు రావడానికి సంకోచించవచ్చని మాకు అర్థమైంది. మేము చదువుకున్న, తెలివైన వ్యక్తులం. అందుకే ఈ తటస్థ వేదికను ప్రతిపాదించాం" అని ఆయన తెలిపారు.

    నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిన తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు మరికొన్ని డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు నెల రోజులకు పైగా దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్నారు.

    అయితే ఈ డిమాండ్లకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను విరమించారు.

  3. సోనమ్ సర్ దీక్షను విరమించడం సంతోషంగా ఉంది - అభిజిత్ దీప్కే

    నిరాహార దీక్ష, జంతర్ మంతర్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, అభిజిత్ దీప్కే

    సోనమ్ వాంగ్‌చుక్ గురువారం అర్ధరాత్రి తర్వాత తన నిరాహార దీక్షను విరమించడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే సంతోషం వ్యక్తంచేశారు.

    సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణపై అభిజిత్ దీప్కే ‘ఎక్స్’లో ఓవీడియో విడుదల చేశారు.

    "సోనమ్ సర్ 26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను విరమించడం మాకు ఉపశమనం, సంతోషాన్ని కలిగించింది. సర్.. మీ అసాధారణ ధైర్యానికి, త్యాగానికి ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి, యావత్ దేశ మనస్సాక్షిని కదిలించారు. మీ జీవితం ఈ దేశానికి చాలా విలువైనది" అని అందులో రాశారు.

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసన కొనసాగుతుందని తెలిపారు.

    నీట్-యూజీ పేపర్ లీక్‌కు నిరసనగా విద్యార్థులు గత నెల రోజులుగా జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నారు.

    కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    ఈ డిమాండ్‌కు మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.

  4. సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమణ

    sonamwangchuk

    ఫొటో సోర్స్, x.com/sonamwangchuk

    సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను విరమించారు.

    కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్‌లతో పాటు లేహ్-లడఖ్ అపెక్స్ బాడీకి చెందిన సీనియర్ నాయకుల సమక్షంలో తాను నిరాహార దీక్ష విరమించినట్టు ఆయన ‘ఎక్స్’‌లో పోస్ట్ చేశారు.

    "గతంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు నిరాహార దీక్ష విరమించాలని కోరుతూ ఒక లేఖ రాశారు" అని సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు.

    దేశంలో హింస చెలరేగే అవకాశం ఉన్నందున, అనేక షరతులపై సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

    "ఈ షరతులను నేను త్వరలోనే ఒక ప్రత్యేక వీడియోలో వివరంగా వివరిస్తాను. ఈలోగా మీరందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి హింస జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను" అని ఆ పోస్ట్‌లో రాశారు.

    నీట్-యూజీ పేపర్ లీక్‌కు నిరసనగా విద్యార్థులు గత నెల రోజులుగా జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.

  5. నమస్తే, బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ అప్టేడ్ చేస్తాం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    బీబీసీ న్యూస్ తెలుగు వెబ్‌సైట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన వార్తలను ఇక్కడ చదవొచ్చు.