ఇంటర్నెట్ నిషేధంతో ఉద్యోగాలు కోల్పోయిన లక్షల మంది ఇరానియన్లు, దీనికి బాధ్యులెవరు?

ఫొటో సోర్స్, Vuk Valcic/SOPA Images/LightRocket via Getty Images
అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం, ఇంటర్నెట్ నిషేధం ఇరాన్లో లక్షల మందిపై ప్రభావం చూపుతున్నాయి.
దేశంలో దాదాపు కోటి మందికి, తమ పనులు చేసుకోవడానికి ఇంటర్నెట్ అవసరం.
ఇంటర్నెట్ ఆంక్షల వల్ల ఇప్పటికే 10 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు ప్రాథమిక అంచనా. ఈ ప్రభావం ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని కొన్ని స్వతంత్ర సంస్థలు చెబుతున్నాయి.
ఇంటర్నెట్ లేకపోవడం వల్ల మౌలిక వనరులు, పరిశ్రమలకు నష్టం వాటిల్లడంతో పాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కూడా గణనీయంగా దెబ్బతినే అవకాశం ఉంది.
మరోవైపు, ఇంటర్నెట్ ఆంక్షలకు సంబంధించి ఇరాన్ పాలకుల్లో వైరుధ్యాలు కనిపిస్తున్నాయి.

ఇంటర్నెట్ నిషేధం వల్ల ఉద్యోగాలు కోల్పోవడం, సామాజిక, ఆర్థిక పర్యవసానాల గురించి ఇరాన్ సీనియర్ మంత్రులు హెచ్చరికలు చేశారు.
ఇంటర్నెట్ సదుపాయం విషయం వివక్షాపూరితంగా ఉందని కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, దేశంలో 'ప్రత్యేక పరిస్థితుల' కారణంగా ఇంటర్నెట్ను పునరుద్ధరించడం సాధ్యపడదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
అందువల్ల, ప్రజలు సంయమనం పాటించాలని కోరుతున్నారు.

ఫొటో సోర్స్, TASNIM
'వివక్షాపూరిత' వ్యవస్థకు హెచ్చరిక
అధికారులు, మీడియా రిపోర్టుల ప్రకారం.. యుద్ధం వల్ల ఇరాన్ ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతున్నాయి.
ఉపాధి కల్పన, డిజిటల్ ఎకానమీ, కీలక పరిశ్రమలపై ఒత్తిడి నిరంతరం పెరుగుతోంది.
దాదాపు 8 వారాలకుపైగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగడం దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది.
ఇంటర్నెట్ సదుపాయం ప్రజలందరికీ సమానంగా, పారదర్శకంగా అందించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు.
ఇంటర్నెట్ సదుపాయాన్ని సార్వత్రిక హక్కుగా గుర్తించాలని ఇరాన్ ప్రథమ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ ఏప్రిల్ 22న చెప్పారని ఇరాన్ ప్రభుత్వ సమాచార పోర్టల్ చెబుతోంది.
వివక్షాపూరిత లేదా వర్గాల వారీగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంపై ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
యుద్ధ సమయంలో పరిపాలన, సేవల పంపిణీకి స్థిరమైన సమాచార వ్యవస్థ కీలకమని ఆయన చెప్పారు.
ఉపాధి కల్పనపై దీని ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందని వివిధ గణాంకాలు చెబుతున్నాయి.
"యుద్ధం కారణంగా 10 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. మరో 20 లక్షల మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారని ప్రాథమిక అంచనాలు చూపిస్తున్నాయని కార్మిక శాఖ ఉప మంత్రి గులాం హుస్సేన్ మొహమ్మదీ చెప్పారు" అని జమరన్ న్యూస్ వెబ్సైట్ రాసింది.

ఫొటో సోర్స్, Jonathan Raa/NurPhoto via Getty Images
40 లక్షల ఉద్యోగాలపై ప్రభావం
ఆర్థిక నష్టాలు భారీ స్థాయిలోనే ఉండవచ్చని కొన్ని ఇరానియన్ మీడియా సంస్థల అంచనా.
యుద్ధం, ఇంటర్నెట్ ఆంక్షలతో దాదాపు 40 లక్షల ఉద్యోగాలు పోవడం లేదా, ప్రభావితమై ఉండవచ్చన్న ఒక అనధికార అంచనాను అస్ర్- ఎ- ఇరాన్ అనే వార్తా వెబ్సైట్ తెలిపింది.
మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు భారీ నష్టం వాటిల్లడం గురించి కూడా అదే కథనంలో ప్రస్తావించినప్పటికీ, అందుకు ఆధారాల గురించి పేర్కొనలేదు.
ఇరాన్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 1.69 బిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా వేశారు.
డిజిటల్ ఎకానమీకి 3.9 మిలియన్ డాలర్ల రోజువారీ నష్టాలు, మొత్తంగా ఆర్థిక వ్యవస్థకు 39.2 మిలియన్ డాలర్ల నష్టాలు వచ్చినట్లు అంచనా వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులు?
యుద్ధ సమయంలో ఇంటర్నెట్ ఆంక్షలు అవసరమని అధికారులు సమర్థించుకుంటున్నారు.
యుద్ధం ముగిసిన తర్వాతే ఇంటర్నెట్ సదుపాయం పూర్తిగా పునరుద్ధరిస్తారని ఇరాన్ పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ చీఫ్ ఇలియాస్ హజ్రతి చెప్పారు.
'ప్రత్యేక పరిస్థితుల' దృష్ట్యా ప్రజలు ఓపికగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
స్థిరమైన, నాణ్యమైన ఇంటర్నెట్ సదుపాయం 'ప్రజల హక్కు' అని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి సత్తార్ హాష్మి ఏప్రిల్ 21న చెప్పారు.
ఇంటర్నెట్ అంతరాయం కేవలం సాంకేతిక సమస్య కాదని, ఇది అనేక రంగాలకు విస్తరించిన వ్యవస్థాగత సమస్య అని హాష్మి హెచ్చరించినట్లు ఆన్లైన్ వార్తా వెబ్సైట్ ఖబర్ తెలిపింది.
మధ్య, తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన సుమారు కోటి మంది ప్రజలు తమ పని కోసం డిజిటల్ కనెక్టివిటీపై నేరుగా ఆధారపడి ఉన్నారని హాష్మి అన్నారు.
టెలికాం రంగంపై ఉన్న ఆర్థిక ఒత్తిడి గురిచి ఆయన ప్రస్తావించారు. కొంతమంది ఆపరేటర్ల ఆదాయం తగ్గుతోందని, వారు తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































